దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం.
ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment