ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే..
అలాంటి ఆలయం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు.
ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది.
అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు.
(చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్‌బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!)
Comments
Please login to add a commentAdd a comment