అద్భుత శిల్పాలకు ఆలవాలం
లేపాక్షి : సుందర పర్యాటక క్షేత్రమైన లేపాక్షి.. హిందూపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన దేశంలో మహిమాన్వితమైన దివ్యశైవ క్ష్రేతాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటి లేపాక్షి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, స్తంభం మలిచిన తీరు మహాద్భుతం. త్రేతాయుగంలో రావణునికి, జటాయువుకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు ఆ పక్షి నిచూసి ‘లే పక్షీ’ అని పిలిచి దానికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రాంతమే లేపాక్షిగా మారిందట. దేశంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఇక్కడే ఉంది. ఇటువంటి పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి పాల్గుణ శుద్ధ పాఢ్యమి వరకు జరుగుతాయి. ఈ నెల 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 27వ తేదీన ముగుస్తాయి.
ఒకే రాతిపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం:
ఒక పెద్ద బండపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కడం చూస్తే చూసిన ప్రతి పర్యాటకులు, భక్తులు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ సర్పము మూడు చుట్టలతో ఏడు పడగలతో, చుట్టలపై మధ్యన శివలింగంతో యాత్రికులను ఆకర్షిస్తోంది. శిల్పి ఇంటికి భోజనానికి వచ్చారని, అయితే తన తల్లి వంట చేయలేదని, కాసేపు ఉంటే భోజనం చేస్తామని ఆమె చెప్పి వంట చేయడం ప్రారంభించింది. అంతవరకు ఏమి చేయాలని వంటశాలకు ఎదురుగా ఉన్న పెద్దబండపై ఏడుశిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కినట్టు, భోజనానికి రమ్మని పిలవడానికి బయటకు తల్లిరాగా పెద్ద నాగేంద్రుని విగ్రహం చూసి ఆశ్చర్యం చెందిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి దిష్టి శిల్పంపై పడడం వల్ల ఈ విగ్రహానికి చీలిక వచ్చిందని పేర్కొంటున్నారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నంది విగ్రహం
ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహానికి ఎదురుగా పర్లాంగు దూరంలో ఒకే రాతిపై మలచిన నంది విగ్రహం వుంది. ఇంతటి అందమైన విగ్రహం భారత దేశంలో ఎక్కడా లేదని చెబుతుంటారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడువుతో పైకి లేచి వస్తున్నట్టు కనబడతుంది. ఈ నంది శరీర భాగమంతా అలంకరించిన గుడ్డలతో, గజ్జెలు, గంటలు, మువ్వలతో, వచ్చే యాత్రికులను చాలా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని చూసిన అడవిబాపిరాజు ‘ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్యా’ అన్నాడు.
విరుపణ్ణ కులదైవం వీరభద్రస్వామి
లేపాక్షి ఆలయాన్ని నిర్మించినది విరుపణ్ణ, వీరుణ్ణలు. వీరభద్రస్వామి వీరికి కులదైవం. గర్భగుడి పైకప్పులో సుమారు 24 అడగుల పొడువు, 14 అడగుల వెడల్పుతో వీరభద్రస్వామి వర్ణచిత్రం చిత్రీకరించారు. ఈ వర్ణ చిత్రం భారతదేశంలోనే పెద్ద చిత్రముగా పేరుగాంచినది. ఒక పక్క విరుపణ్ణ మరో పక్క విరుపణ్ణ భార్య పుత్రులతో స్వామిని పూజించినట్టుగా చూపించినారు.
స్తంభంలో వెలసిన దుర్గాదేవి
దుర్గాదేవి విగ్రహం ఒక స్తంభంలో చెక్కబడినది. శిల్పులు ఈ శిల్పాన్ని మలిచే సమయంలో దుర్గాదేవి భక్తులపై ఆవాహమై నేను ఈ స్తంభంలో ఉందునని, నాకే నిత్య పూజలు, ఆరాధనలు జరిపించవలెనని కోరిందని భక్తుల నమ్మకం. స్తంభంలో ఉన్న దుర్గాదేవి విగ్రహానికి అలంకరణలు, పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దుర్గాదేవి ఆలయంగా కూడా స్థానికులు పిలుస్తున్నారు.
అసంపూర్తిగా కల్యాణ మంటపం
పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మంటపం అంసపూర్తిగానే ఉంది. ఆలయ నిర్మాణ కర్త విరుపణ్ణ ఖజానా పైకం అనవసరంగా ఖర్చు పెట్టాడని, ఆలయ నిర్మాణానికి ప్రభువుల అనుమతి తీసుకోలేదని, విరుపణ్ణ మీద గిట్టని వారు కొందరు రాజుతో లేనిపోని నిందలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మాటలను రాయలువారు నిజమని నమ్మి ఆగ్రహించి విరుపణ్ణ కళ్లు తొలగించాలని ఉత్తర్వులు చేసినారని, ఆ ఉత్తర్వులు విన్న విరుపణ్ణ నా కన్నులను నేనే తీసి నా స్వామికి అర్పించెదనని రెండు కళ్లు ఊడబెరికి గోడకు విసిరినట్టు, దీనివల్ల కల్యాణ మంటపం అంసపూర్తిగా మిగిలిపోయిందని చెబుతున్నారు.