kotappa konda jathara
-
హర హర మహాదేవ శంభో శంకర
సాక్షి, నెట్వర్క్: హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు పులకించాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దక్షిణ కైలాసంగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్త జనం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై పట్టణంలోని నాలుగుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శనివారం మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహణకు స్వామివారి రథాన్ని సిద్ధంగా ఉంచారు. ఆలయంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవ కల్యాణం శ్రీశైలంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి పర్వదిన ఘడియలు ప్రారంభం కాగానే శ్రీమల్లికార్జునస్వామిని వరుడిగా తీర్చిదిద్దే పాగాలంకరణ మొదలైంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 11 మంది రుత్వికులు స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివనామస్మరణతో హోరెత్తిన సాగరతీరం సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షణలో కోటి లింగాలకు పూజలు నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్న సుబ్బరామిరెడ్డి, స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామతీర్థంలో శివనామ స్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవ దేవాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు హాజరై పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సాక్షాత్తూ శ్రీరాముడే రామ క్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. -
శ్రీగిరి.. భక్త జన ఝరి
శ్రీశైలం/శ్రీకాళహస్తి(రేణిగుంట)/నరసరావుపేట: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తులందరికీ 24 గంటలూ మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల ఏడు వరకు ఇదే తరహాలో అనుమతిస్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తడంతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆదివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి.. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం ప్రధాన మాడ వీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్సింగ్, ఈఓ శ్రీరామచంద్రమూర్తి, చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి 10గంటల నుంచి శ్రీమల్లికార్జునస్వామి వార్లకు 11 మంది రుత్వికులు వేదమంత్రోచ్ఛారణతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు అభిషేకం జరుగుతుండగానే.. మరోవైపు మల్లన్న వరుడయ్యే శుభముహూర్తం రాత్రి 10.30 నుంచి ఆరంభమవుతుంది. గర్భాలయ కలశవిమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అతిసుందరంగా పాగాను అలంకరిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట సమీపంలో అత్యంత శోభాయమానంగా అలంకరించిన కల్యాణవేదికపై శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిపిస్తారు హంసవాహనంపై విహరించిన ఆదిదేవుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై విహరించారు. రాత్రి హాలాహలాన్ని సేవించిన నీలకంఠుడు మగతనిద్రలోకి జారుకోగా ఆయనను మేల్కొలిపేందుకు నాగులు నిర్వహించే ఉత్సవమే నాగరాత్రి. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వర్లు పురవీధుల్లో విహరించారు. అలాగే రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిద్విలాసంతో భక్తులకు ఆభయ ప్రధానం చేశారు. తల్లి జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాహుకేతు పూజలను సోమవారం రద్దు చేశారు. నేడు కోటప్పకొండ తిరునాళ్లు మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో సోమవారం మహా తిరునాళ్ళు జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. త్రికోటేశ్వరుడిని సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడి కింద విద్యుత్ ప్రభలు, పెద్దా, చిన్న తడికె ప్రభలు నిర్మించి తీసుకురానున్నారు. అధికారులు తిరునాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 255 ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయగా, చిలకలూరిపేట, అద్దంకి, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరునాళ్లను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు. శ్రీకాళహస్తిలో నేడు నందిసేవ – లింగోద్భవ అభిషేకం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి రోజున శివుడు నంది వాహనంపై ఊరేగడం ఆనవాయితీ. ధర్మానికి ప్రతీకగా ఉన్న నందిపై ఊరేగుతున్న పరమశివుని దర్శిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీ కాళహస్తికి తరలి వస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం ఇక్కడ మరో ప్రధానఘట్టం. విషప్రభావంతో ఉన్న శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవంగా పిలుస్తారు. మహాశివరాత్రి రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగింపునకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పూజారులు 10 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తి వెనుకభాగంలో ఉన్న లింగోద్భవ మూర్తికి 11వ అభిషేకం (లింగోద్భవ అభిషేకం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ అభిషేకం కేవలం మహాశివ రాత్రి రోజున మాత్రమే నిర్వహిస్తారు. వేకువజామున రెండుగంటల సమయంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తారు. -
ప్రశాంత వాతావరణంలో కోటప్పకొండ తిరునాళ్ల
నరసరావుపేట రూరల్: భక్తి, బాధ్యతలతో అధికారులు పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన మహశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల ఏర్పాట్లుపై సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభాపతి డాక్టర్ కోడెలతో పాటు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, రూరల్ ఎస్పీ డాక్టర్ అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. కోడెల మాట్లాడుతూ రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటప్పకొండ పర్యటనకు రానున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రికోటేశ్వరుని ఆలయం జిల్లాలో ఉండడం అదృష్టమన్నారు. రూరల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడతామని తెలిపారు. గత బకాయిలు చెల్లించలేదు... తిరునాళ్ల ఏర్పాట్ల కోసం గతంలో తాము చెసిన ఖర్చులను ఇప్పటి వరకు చెల్లించలేదని పలు శాఖల అధికారులు సమావేశంలో సభాపతి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్‌అండ్‌బీకి రూ.9లక్షలు, ఆర్‌డబ్లూఎస్‌కు రూ.7.5లక్షలు, విద్యుత్ శాఖకు రూ.5లక్షలు, ఆర్టీసీకి రూ.3.5లక్షల మేరకు బకాయిలు ఉన్నట్టు అయా శాఖల అధికారులు సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లను రాష్ట్ర పండుగుగా ప్రకటించినందున రూ.50 లక్షలు విడుదల చేస్తుందని ఇందులో అయా శాఖలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని సభాపతి డాక్టర్ కోడెల తెలిపారు. రైల్వే శాఖ డబ్బులు చెల్లించాలి అంటుంది కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట మార్గంలోని ఈటీ సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్‌లైన్‌లో ప్రభల రాక, పోకల సందర్భంగా సరఫరా నిలిపివేస్తారు. దీనివలన వినుకొండ పట్టణంలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. నూతనంగా రైల్వే లైన్ విద్యుదీకరించడంతో వినుకొండ నుంచి రైల్వేకు విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రభల రాక సందర్భంగా విద్యుత్ నిలిపివేయాలంటే గంటకు రూ.5 లక్షలు చెల్లించాలని రైల్వే అధికారులు తెలిపినట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ జయభారతరావు తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు 332 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డీఎం అబ్దుల్సలీం తెలిపారు. ఆర్డీవో జి.గంగాధర్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, ఈవో వై.బైరాగి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కోటప్పకొండ జాతరకు పటిష్ట బందోబస్తు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్ కోటప్పకొండ తిరునాళ్ల జాతరను విజయవంతం చేసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. మహిమాన్విత పుణ్యక్షేత్రం కోటప్పకొండపై సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రూరల్ ఎస్పీ మాట్లాడుతూ కొండకు తరలివచ్చే విద్యుత్ ప్రభలపై రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీల జెండాలు, సినిమా హీరోల కటౌట్లు, వాల్‌పోస్టర్లు పెట్టకూడదన్నారు. ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఎవరైనా ప్రభలపై పార్టీల జెండాలు, రాజకీయ నాయకుల ఫొటోలు ఏర్పాటు చేస్తే సంబంధిత ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యా దు చేయడంతో పాటు ప్రభల నిర్వాహకులపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు. స్నానా ల ఘాట్, మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. గతేడాది 2500 పోలీసు సిబ్బంది కోటప్పకొండ జాతర విధులు నిర్వహించారని, ఈ ఏడాది 4000 మంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోటప్పకొండ ప్రాంతంలోని చిలకలూరిపేట రోడ్డు, నరసరావుపేట, పెట్లూరివారిపాలెం, కొండకావూరు రహదార్ల వద్ద పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభలను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం ఆరు గంటల నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 వెర్లైస్ సెట్లతో సిబ్బంది ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం మొబైల్ పార్టీలు ఆ ప్రాంతానికి చేరుకొని క్రమబద్ధీకరిస్తారన్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖల సహకారంతో తిరునాళ్లలో ఎలాంటి సంఘటన లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, దేవస్థానం ఈవో రామకోటిరెడ్డి, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, కమ్యూనికేషన్స్ డీఎస్పీ రమణ, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తొలుత త్రికోటేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎస్పీ సత్యనారాయణకు ఈవో రామకోటిరెడ్డి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.