నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్
కోటప్పకొండ తిరునాళ్ల జాతరను విజయవంతం చేసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. మహిమాన్విత పుణ్యక్షేత్రం కోటప్పకొండపై సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రూరల్ ఎస్పీ మాట్లాడుతూ కొండకు తరలివచ్చే విద్యుత్ ప్రభలపై రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీల జెండాలు, సినిమా హీరోల కటౌట్‌లు, వాల్‌పోస్టర్లు పెట్టకూడదన్నారు.
ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఎవరైనా ప్రభలపై పార్టీల జెండాలు, రాజకీయ నాయకుల ఫొటోలు ఏర్పాటు చేస్తే సంబంధిత ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యా దు చేయడంతో పాటు ప్రభల నిర్వాహకులపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు. స్నానా ల ఘాట్, మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. గతేడాది 2500 పోలీసు సిబ్బంది కోటప్పకొండ జాతర విధులు నిర్వహించారని, ఈ ఏడాది 4000 మంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోటప్పకొండ ప్రాంతంలోని చిలకలూరిపేట రోడ్డు, నరసరావుపేట, పెట్లూరివారిపాలెం, కొండకావూరు రహదార్ల వద్ద పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభలను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం ఆరు గంటల నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 వెర్లైస్ సెట్‌లతో సిబ్బంది ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం మొబైల్ పార్టీలు ఆ ప్రాంతానికి చేరుకొని క్రమబద్ధీకరిస్తారన్నారు.
రెవెన్యూ, దేవాదాయశాఖల సహకారంతో తిరునాళ్లలో ఎలాంటి సంఘటన లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, దేవస్థానం ఈవో రామకోటిరెడ్డి, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, కమ్యూనికేషన్స్ డీఎస్పీ రమణ, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. తొలుత త్రికోటేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎస్పీ సత్యనారాయణకు ఈవో రామకోటిరెడ్డి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
కోటప్పకొండ జాతరకు పటిష్ట బందోబస్తు
Published Fri, Feb 21 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM