వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
నరసరావుపేట రూరల్(గుంటూరు జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వలేదనే కారణంతో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు చేసిన దాడిలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పమిడిపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం బొడ్డురాయి సెంటర్‌లో చోటుచేసుకుంది. గాయపడిన వారందరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ముతరాసులు నివాసం ఉండే వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. దీనిని మనసులో పెట్టుకున్న టీడీపీ, జనసేన వర్గీయులు బొడ్డురాయి సెంటర్‌లో ముతరాసులు కూర్చుని ఉండగా ముందస్తు ప్రణాళికతో సుమారు 30 మంది మారణాయుధాలతో దాడి చేశారు.
ఈ దాడిలో బొంగితాల శ్రీను, రవి, బాజి, లక్ష్మీనారాయణ, రామారావులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన రవి, రామారావులను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడులు జరిగాయని, ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా మద్దతు పొందలేని పారీ్టలు ఇటువంటి చౌకబారు చర్యలకు పాల్పడుతుంటాయని విమర్శించారు. ఎమ్మెల్యే వెంటమార్కెట్ యార్డు చైర్మన్ ఎస్.హనీఫ్ తదితరగ్రామ నాయకులు ఉన్నారు. డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ వై.అచ్చయ్య ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment