వైఎస్సార్‌సీపీలో నూతన ఉత్సాహం | Great Excitement In West Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నూతన ఉత్సాహం

Published Wed, Mar 20 2019 7:19 AM | Last Updated on Wed, Mar 20 2019 7:23 AM

Great Excitement In West Ysrcp - Sakshi

కొయ్యలగూడెంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు భవనాలెక్కిన అభిమానులు

ఎన్నికల రోజు వచ్చేసరికి చంద్రబాబు ఒక పెద్ద డ్రామాకు తెరలేపుతారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతారు. అవ్వా, తాతా, అక్కా, చెల్లీ.. ప్రతి వారిని కోరేది ఒకటే. రూ.3 వేలకు మోసపోకండి. పాదయాత్రలో ప్రతి పేదవాని గుండెచప్పుడూ నేను విన్నాను. మీ బాధలు అర్థం చేసుకున్నాను. ప్రతి వ్యక్తికి సంక్షేమ పాలన అందించేందుకు నేను ఉన్నాను.
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో సమరనాదం మోగించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో కొయ్యలగూడెం జనసంద్రంగా మారింది. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు గిరిజనం వెల్లువలా తరలివచ్చింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం జగన్‌ రాక కోసం పడిగాపులు పడ్డారు. ఒక్కసారి తమ అభిమాన నేతను తనివితీరా చూసేందుకు మేడలు, మిద్దెలు ఎక్కి మరీ వేచి చూశారు. జగన్‌ ప్రసంగిస్తున్నంత సేపూ ఆయన ప్రతి మాటకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మహిళలు, రైతులు, అవ్వాతాతలు, యువతకు భరోసా కల్పిస్తూ హామీలు ఇస్తుంటే కరతాళ ధ్వనులతో హర్షామోదాలు తెలిపారు. కాబోయే సీఎం.. సీఎం.. సీఎం.. అంటూ యువత నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఇక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో వైఎస్సార్‌సీపీలో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పార్టీ నేతలు, క్యాడర్‌లోనూ జగన్‌ రాక కొండంత ధైర్యాన్ని నింపిందనటంలో సందేహం లేదు. 


నే విన్నాను.. నేనున్నాను 
రాష్ట్రవ్యాప్తంగా 14 నెలల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు మీ అందరి చల్లని దీవెనలు, దేవుని ఆశీస్సులతో పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మీతో నడిచాను మీ కష్టాలు విన్నాను.. మీ బాధలు అర్థం చేసుకున్నాను.. పాదయాత్రలో ప్రతి పేదవాని గుండెచప్పుడూ నేను విన్నాను.. ప్రతి పేదవానికీ సంక్షేమ పాలన అందించేందుకు నేను ఉన్నాను.. అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగానికి అశేష ప్రజానీకం నుంచి విశేష స్పందన వచ్చింది. అక్కాచెల్లమ్మల బాధలన్నీ నేను విన్నాను.. నేనున్నాను అనీ, పాదయాత్రలో దారిపొడవునా రైతన్నల కష్టాలన్నీ నేను విన్నాను.. వారికి కొండంత అండగా నేనున్నాను.. అంటూ భరోసా కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ హామీలు ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆద్యంతం ప్రజల నుంచి హర్షామోదం లభించింది. తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానో స్పష్టంగా తెలిపారు. వైఎస్‌ జగన్‌ హామీలు ఇస్తున్నంత సేపూ ప్రజలు చప్పట్లు, ఈలలతో హర్షద్వానాలు చేస్తూ మద్దతు తెలిపారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల మాఫియాను తెచ్చాడని, వాటిని పూర్తిగా రద్దు చేస్తానని జగన్‌ చెప్పారు. లంచాలు లేని సంక్షేమ పాలన ఇస్తానంటూ ప్రజలకు వాగ్దానం చేశారు. 


అక్కా, చెల్లీ రూ.3 వేలకు మోసపోవద్దు
చంద్రబాబునాయుడు రాబోయే రోజుల్లో చేయని జిమ్మిక్కులు ఉండవు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే సరికి చంద్రబాబు చూపని సినిమా ఉండదు. చేయని డ్రామా ఉండదు. చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు. ఎన్నికల రోజు వచ్చేసరికి చంద్రబాబు ఒక పెద్ద డ్రామాకు తెరలేపుతారు. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతారు. అందరినీ కోరేది ఒకటే.. ప్రతి అక్క, చెల్లెమ్మ వద్దకు వెళ్లి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అన్నను గెలిపించుకుందాం. ఆయన్ను గెలిపించుకుంటే మన పిల్లల చదువుకు భరోసా ఉంటుందని తెలపండి అని జగన్‌ సభికులకు తెలిపారు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు సంబంధించి ఎన్నికల నాటికి ఎంతైతే అప్పుందో ఆ అప్పును నాలుగు దఫాల్లో వారి చేతికే ఇస్తామని చెప్పండి. ప్రతి అవ్వాతాతకు చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్‌ రూ.3 వేలు చేస్తాడని, ప్రతి రైతన్నకు చెప్పండి వ్యవసాయాన్ని పండుగ చేస్తాడనీ అంటూ ఎన్నికల్లో టీడీపీ మోసాలను ఎండగడుతూనే.. తానేమి చేయబోతానో వైఎస్‌ జగన్‌ వివరంగా చెప్పారు.

సభలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు 
∙ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలకు ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పంతా 4 దఫాల్లో నేరుగా వారి చేతులకే ఇస్తాను.
∙ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అక్కాచెల్లెమ్మలు 45 నుంచి 60 ఏళ్లు వయసున్న వారికి వైఎస్సార్‌ చేయూత పథకంలో రూ.75 వేలు ఇస్తాం
∙పిల్లలను బడికి పంపించే ప్రతి మహిళకు ఏడాదికి రూ.15 వేలు వారికి అందిస్తాం
∙అప్పులన్నీ మాఫీ చేయటమే కాదు.. సున్నా వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చేస్తాను
∙ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్న చేతికి పెట్టుబడిగా రూ.12,500 ఇస్తాను
∙నాలుగేళ్లలో ప్రతి రైతుకు పెట్టుబడిగా రూ.50 వేలు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం
∙రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాదు, బీమా సొమ్ములు మేమే కడతాం
∙రైతన్నలకు పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తాం, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తాం
∙వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్, టోల్‌ ట్యాక్స్‌ లేకుండా అన్నిరకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం
∙రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
∙తుపానులు వస్తే రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు
∙రైతన్నలు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్యలు చేసుకున్నా రూ.7 లక్షలు డబ్బులు ఇస్తాం
∙పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2006, 2007లో రూ.1 లక్ష, రూ.1.5 లక్షలకే భూములు త్యాగం చేసిన రైతన్నకు ముందే చెప్పినట్లు రూ.10 లక్షలు పరిహారం అందిస్తాం
∙ప్రతి అవ్వాతాతకు పింఛను రూ.2 వేల నుంచి  రూ.3 వేలకు పెంచి ఇస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement