అమరం.. నీ కథ అజరామరం.. | Great Salute to Akkineni | Sakshi
Sakshi News home page

అమరం.. నీ కథ అజరామరం..

Published Wed, Jan 22 2014 6:06 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Great Salute to Akkineni

 శిఖరం ఒరిగింది... అక్కినేని అస్తమించారు...
 ప్రతి తెలుగువాడికీ శరాఘాతం ఈ మాట. కానీ తప్పదు. గుండెను దిటవు చేసుకోక తప్పదు. ‘కన్నీళ్లకే బతికించే శక్తి ఉంటే.. అవి ఏనాడో కరువైపోయేవి’ అన్నాడు ఆయనే ఓ సినిమాలో. అందుకని వాటిని ఆపగలమా? కట్టలుతెగిన  విషాదానికి అడ్డుకట్ట వేయగలమా? ఏడు దశాబ్దాల పాటు తన నటనతో రంజిపంజేసి.. ప్రేక్షకుల్ని రుణగ్రస్తుణ్ణి చేశాడాయన. ఆయన పంచిన ఆనందాన్ని మరిచిపోవడం తేలికైన విషయం కానేకాదు. మనిషి అనేవాడు ఎలా బతకాలో ఆయన పాత్రలు చెప్పాయి. ఎలా బతక్కూడదో ఆయన పాత్రలు చెప్పాయి. సంఘాన్ని సంస్కరించేంత గొప్ప పాత్రలు పోషించిన ఘనత ఆయనది.  ఈ వయసులో కూడా మూడు తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన నవ యువకుడు అక్కినేని.  కుటుంబసభ్యులతో కలిసి ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ త్వరలోనే విడుదల కానుంది.


 దటీజ్ అక్కినేని...
 ఎన్నెన్ని ప్రేమ కావ్యాలు, ఎన్నెన్ని కుటుంబ గాధలు, ఎన్నెన్ని ఆధ్యాత్మికానందాలు, ఎన్నెన్ని పురాణపాత్రలు.. ఒకానొక దశలో తెరపై మానవ బంధాలన్నింటిలో అక్కినేనినే చూసుకుంది ప్రేక్షకలోకం. ప్రేమికుడంటే అక్కినేని. కొడుకంటే అక్కినేని. భర్త, అన్న, తమ్ముడు, మరిది, తండ్రి, తాత.. ఇలా అన్ని బంధాల్లో అక్కినేనినే చూసుకున్నారు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన...

 పట్టుదలకు పర్యాయపదం అక్కినేని...
 కార్యదీక్షను ఇంటిపేరుగా మార్చుకున్న నిత్య కృషీవలుడు అక్కినేని..
 నిరంతరం నటననే శ్వాసించిన అభినయ నటరాజు అక్కినేని...
 చెన్నపట్టణంలో వేళ్లూనుకుపోయిన.. మన సినిమాను తెలుగునేలకు తరలించిన అభినవ భగీరథుడు అక్కినేని...
 82 ఏళ్ల తెలుగు సినిమాతో.. 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగు సినీ సహోదరుడు అక్కినేని...
 అక్కినేని జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఒడిదుడుకులు.
 హీరోగా నిలదొక్కుకోడానికి ఆయన చేసిన సాహసాలు ఎన్నో. విమర్శించిన వారితోనే పొగిడించుకున్న దీక్షాదక్షుడు అక్కినేని

 అక్కినేని బాల్యం
 కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట.
 
 విఫలమైన తొలి సినీ అవకాశం
 1940లో వచ్చిన ‘ధర్మపత్ని’ అక్కినేని తొలి సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి ఆ సినిమాకంటే ముందే అక్కినేనికి సినీ అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘తల్లిప్రేమ’. జ్యోతి సిన్హా దర్శకుడు. కథ రిత్యా అందులో ఓ పధ్నాలుగేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. దానికి అక్కినేనిని ఎంపిక చేసి మద్రాసు తీసుకెళ్లారు ప్రముఖ నిర్మాత కడారు నాగభూషణం. షూటింగ్ జరుగుతోంది. కానీ ఆయన పాత్ర  మాత్రం రావడం లేదు. అలా నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అక్కినేని. తన పాత్ర ఎప్పుడొస్తుందో అని ఆయన ఎదురు చూస్తున్న సమయంలో... కథలో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ పాత్రను తీసేశామని బాంబు పేల్చారు. నాలుగు నెలలు అక్కడే ఉన్నందుకు వంద రూపాయలు ఇచ్చి అక్కినేనిని పంపించారు. కానీ ఆయన వెంకటరాఘవపురానికి నిరాశతో రాలేదు. సీఎస్‌ఆర్ ఆంజనేయశాస్త్రి, కన్నాంబ లాంటి మేటి నటుల్ని చూశానని ఆనందంతో ఆయన వెనుదిరిగారు. ‘దేవదాసు’ నిర్మాత డీఎల్ నారాయణను అక్కినేని తొలిసారి కలిసింది అప్పుడే. ఆ టైమ్‌లో డీఎల్ ప్రొడక్షన్ మేనేజర్. ఉత్తరకాలంలో అక్కినేని హీరో అవుతారని, ఆయనతో డీఎల్ ‘దేవదాసు’ లాంటి అజరామర ప్రేమ కావ్యాన్ని తీస్తారనేది కాలానికి మాత్రమే తెలిసిన భవిష్యవాణి.
 
 తొలిసినిమా ‘ధర్మపత్ని’
 పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు. అయితే... అప్పటికే ఆయన వయసు 16 ఏళ్లు. దాంతో... ఆ వేషానికి పెద్దవాడైపోయాడనే ఉద్దేశంతో అక్కినేనికి గుంపులో గోవింద లాంటి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా... తొలిసారి తెరపై కనిపించారు. సో... ఆ విధంగా చూసుకుంటే అక్కినేని తొలి సినిమా ధర్మపత్నే.
 
 నట ప్రస్థానం...
 ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్‌ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం’(1949) ఆయన్ను నంబర్‌వన్‌ని చేసింది. దేవదాసు(1953),  అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన సాంఘిక చిత్రాల గురించి చెప్పడమంటే సాహసమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement