బాబూ.. ప్రజలమధ్య చిచ్చు పెట్టొద్దు
బాబుపై గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో చిక్కుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఊబి నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల ప్రజలమధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడటం దారుణమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) దుయ్యబట్టింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలను ప్రజలతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం సమంజసం కాదంది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన పలువురు గ్రాట్ నేతలు నేరుగా పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు తీరును తప్పుపట్టారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులపై నేరారోపణలొస్తే అవి పూర్తిగా వారి వ్యక్తిగతమైనవేగానీ ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినవి కానేరవు. అలాంటి నేరారోపణలొస్తే వారిని ఎన్నుకున్న ప్రజలకు ఆపాదించడం, రెచ్చగొట్టడం క్షమార్హం కాద’’ని స్పష్టం చేశారు. ‘‘ఏడాదిగా గుర్తుకురా ని సెక్షన్-8 ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? ఏ సంఘటన జరిగిందని ఇప్పు డు దానిగురించి మాట్లాడుతున్నారు?
మీరు తప్పుడు పనులు చేసి ఊబిలో చిక్కుకుని తప్పించుకునేందుకు మమ్మల్ని(తెలుగు ప్రజలను) అందులోకి లాగుతున్నా రు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ విషయంలో ఇక్కడ(తెలంగాణలో) వేలుపెట్టే అధికారం ఆంధ్ర ప్రభుత్వానికి లేదు’’ అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ హనుమంతరెడ్డి అన్నారు.
‘‘బాబు తనకున్న మచ్చల్ని ప్రజ లపై రుద్దేయత్నం చేస్తున్నారు. అక్కడి(ఆంధ్ర) ప్రభుత్వం నేరగాళ్లను రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట’’ని సీనియర్ న్యాయవాది జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి అండగా ఉండేందుకు గ్రాట్ ఏర్పాటు చేసినట్టు దాని జ నరల్ సెక్రటరీ రాధాకృష్ణ చెప్పారు.