సాక్షి, ఒంగోలు : దురాశే నెల్లూరు డీఎంహెచ్‌ఓ కొంపముంచింది. తక్కు వ డబ్బుతో బంగారం బిస్కెట్లు పొందేందుకు డాక్టర్ సుధాకర్ నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌కు చెందిన కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వంతో రూ.25 లక్షలను హైవే కిల్లర్ మున్నాకు పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే రూ.25 లక్షలు తీసుకున్న మున్నా బెంగళూరులో బంగారం బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి అనంతరం చేతులెత్తేసినట్లు తెలిసింది. పోలీసు విచారణలో మున్నా వెల్లడించిన అనేక ఆసక్తికర విషయాల్లో ఇదొకటిగా తెలిసింది. సాధారణంగా ఒక జిల్లా స్థాయి ప్రభుత్వాధికారిని ఎలాంటి ఆధారాలు లేనిదే పోలీసులు అదుపులోకి తీసుకోరు. ఒకవేళ అదుపులోకి తీసుకోవాలంటే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
తాజాగా ఒంగోలులో నేర పరిశోధనలో దిట్ట అని పేరున్న ఒక పోలీసు అధికారి, సింగరాయకొండకు చెందిన మరో అధికారుల బృందం నెల్లూరు డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఆ బృందం లోతుగా దర్యాప్తు చేస్తూ ఇతర వ్యవహారాలు, సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. దానిలో భాగంగానే సుధాకర్‌ను వెంట పెట్టుకుని ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది.
మున్నా కేసులో ‘మరో సంచలనం’
నరహంతకుడు, సెలైంట్ కిల్లర్ మహమ్మద్ అబ్దుల్‌సమద్ అలియాస్ మున్నాభాయ్ కేసులో అనేక సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నచిన్న నేరాలతో ప్రారంభమైన అతని నేరప్రస్థానం లక్షలు, కోట్ల రూపాయలతో ముడిపడి సాగినట్లు తెలుస్తోంది. తాజాగా ఒంగోలు పోలీసులు అతన్ని విచారించగా నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ రూ.25 లక్షలను అతనికి పెట్టుబడి పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి కర్నూలు పోలీసులకు మున్నాభాయ్ పట్టుబడిన విషయం విదితమే. అక్కడ రిమాండ్‌లో ఉన్న అతన్ని 2008లో జరిగిన ఒక లారీడ్రైవర్, క్లీనర్ హత్య కేసులో పీటీ వారెంట్‌పై మద్దిపాడు పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలులోని జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఒంగోలు ఒన్‌టౌన్, టూటౌన్, తాలూకా పోలీస్‌స్టేషన్, మద్దిపాడు, సింగరాయకొండ పోలీస్‌స్టేషన్లలో అతనిపై పది కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
దురాశే ముంచింది
Published Fri, Jan 24 2014 3:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement