గ్రీవెన్స్‌సెల్‌లో ఆత్మహత్యాయత్నం
ఓబులవారిపల్లె:
తనకు ఇచ్చిన భూమికి సంబందించిన స్థలాన్ని తొమ్మిదేళ్లుగా చూపకపోవడంతో ఆ దళితరైతు విసిగిపోయాడు. చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో చిన్నఓరంపాడు గ్రామానికి చెందిన సోంబత్తిన శ్రీనివాసులు అనే దళిత రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రీవెన్‌సెల్‌కు రైల్వేకోడూరు శాసన సభ్యుడు కొరముట్ల శ్రీనివాసులుతో పాటు స్థానిక తహశీల్దార్ శిరీష పాల్గొన్నారు. మధ్యాహ్న సమయంలో సోంబత్తిన శ్రీనివాసులు ‘తనకు 2005లో ఠమొదటిపేజీ తరువాయి
జెడ్‌హెచ్‌టీసీ భూముల్లో ఎకరా పట్టా ఇచ్చారని, ఇంత వరకు ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని వాపోయాడు. ఇందుకోసం ఓబులవారిపల్లె మండల రెవెన్యూ కార్యాలయం మొదలుకుని హైదరాబాదు ఎస్సీ, ఎస్టీ కమిషనర్ కార్యాలయం వరకు తొమ్మిదేళ్లుగా తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమి కోసం అధికారుల వద్ద పడిన అవమానాన్ని తలచుకుని ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న విషద్రావణాన్ని తాగే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు తహశీల్దార్ నివ్వెరపోయారు. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన మాజీ మండలాధ్యక్షుడు తిరుపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు ఆర్‌ఐ రఘుపతి తదితరులు శ్రీనివాసులు దగ్గర ఉన్న విషద్రావణాన్ని లాక్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎకరా భూమితో పాటు మరో ఎకరా భూమి వచ్చేటట్లు చేస్తామని ఈ సందర్భంగా తహశీల్దార్ శిరీష బాధిత రైతుకు హామీ ఇచ్చారు.