రౌడీషీట్ ఓపెన్ చేస్తా
- నాల్గో పట్టణ సీఐ బెదిరింపులు
- యువకుడి ఆత్మహత్యాయత్నం
అనంతపురం మెడికల్ : ‘రేయ్ కాలనీలో ఉండాలనుకున్నావా? లేదా? నేను చెప్పినట్లు వింటే బాగుంటావ్. లేదంటే నీ ఇష్టం. బ్యాచ్‌లు మెయింటేన్ చేస్తున్నావంట. రౌడీషీట్ ఓపెన్ చేస్తా’ అంటూ నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ శివశంకర్ తనను బెదిరించారని చంద్రబాబు కొట్టాలకు చెందిన అనిల్ ఆరోపించాడు. పోలీసుల వేధింపులు తాళలేని అతడు సోమవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అనంతపురం మండలం చంద్రబాబు కొట్టాలకు చెందిన అనిల్, అశ్విని భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అదే కాలనీలో అనిల్ ఇటీవల కేబుల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. క్రమంగా డిష్ కనెక‌్షన్లు పెరగడంతో మరో కేబుల్‌కు చెందిన వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పలుమార్లు అనిల్ నిర్వహిస్తున్న కేబుల్ వైర్లను కట్ చేశారు. డిష్ నిర్వహించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా అతడు వినకపోవడంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సహకారంతో నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శివశంకర్ తరచూ అనిల్‌ను స్టేషన్‌కు పిలిపించసాగారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్‌కు రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇదే క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్నీ వదులుకుంటే బాగుంటుందని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ వేయొద్దని సూచించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ సోమవారం కాలనీలోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన స్నేహితులు వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు.
మాజీ ఎమ్మెల్యే పరామర్శ :
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపారు. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుగా మారారని, అతడికేమైనా జరిగితే కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నేతలు యోగేశ్వరరెడ్డి, బండి పరుశురాం, మారుతినాయుడు తదితరులు ఉన్నారు.
స్టేషన్ ముందు ధర్నా చేస్తాం :
పోలీసుల వైఖరిపై అనిల్ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పక్షాల నిలవాల్సిన ఖాకీలే ఇలా బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. రెండు వారాల నుంచి రోజూ స్టేషన్‌కు రమ్మంటున్నారని, వెళితే తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఒకానొక దశలో స్టేషన్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తామని వారు చెప్పగా గురునాథరెడ్డి వారిని సముదాయించారు.