రిసెప్షన్ రోజే ఫిట్స్‌తో వరుడి మృతి
గోదావరిఖని, న్యూస్‌లైన్: మూడుముళ్లు.. ఏడడుగులతో ఏకమైన జంటకు మూడో రోజే ఎడబాటు ఎదురైంది. రిసెప్షన్ తంతు ముగిసి బంధువులు ఇళ్లకు కూడా వెళ్లకముందే వరుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా యైటింక్లయిన్‌కాలనీ సదానందటాకీస్ ఏరియాలో చెందిన పిడుగు రాజేశం ఆర్టీ-1 ఏరియా వకీల్‌పల్లి గనిలో కోల్‌కట్టర్‌గా పనిచేస్తున్నాడు.
రాజేశం దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు రాజు(26)కు పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఇంటివద్దే రిసెప్షన్ జరిగింది. బంధుమిత్రులు వచ్చి నూతన జంటను ఆశీర్వదించి భోజనాలు చేశారు. బంధువులు నిద్రకు ఉపక్రమించారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో రాజు ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే వరుడు మృతి చెందాడు. ఈ ఘటనతో వధూవరుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.