సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఓఎమ్మార్ షీట్లతో పేపర్, పెన్ను ఆధారంగా జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలన్నారు. గ్రూప్– 2 కోసం మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేసుకోగా.. శనివారం నాటికి 2.30 లక్షల మందికిపైగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పర్యవేక్షణకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులను ఆయా జిల్లాలకు పంపినట్లు ఆయన వివరించారు. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగాలు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని చెప్పారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాలపై సందేహం వస్తే ఆయా ఫోన్ నంబర్లకు కాల్ చేయాలన్నారు. కొన్ని మార్చిన సెంటర్లకు సంబంధించిన వివరాలను జిల్లా యంత్రాంగాలు అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ చేశామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆయా అభ్యర్థులు రివైజ్డ్ హాల్ టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఎలా చేరుకోవాలో..?
ఫోని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి కాస్త అస్తవ్యస్తంగా మారింది. పలు రైళ్లు, బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎంబీబీఎస్, డెంటల్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ’నీట్’ పరీక్షలను తుపాను ప్రభావిత ఒడిశాలో నిర్వహించడం లేదు. ఉత్తరాంధ్రలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా గ్రూప్–2ని వాయిదా వేయాలని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నా ఏపీపీఎస్సీ వినిపించుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు.
నేడు గ్రూప్–2 ప్రిలిమినరీ
Published Sun, May 5 2019 4:19 AM | Last Updated on Sun, May 5 2019 4:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment