సాక్షి, అమరావతి: వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా తదుపరి చర్యలన్నింటినీ స్తంభింపజేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీపీఎస్సీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షను కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. ఇది చట్టవిరుద్ధమంటూ నెల్లూరు జిల్లాకు చెందిన బాణాల చరణ్, ప్రకాశం జిల్లాకు చెందిన మద్దుల రాజారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సైతం ఇంగ్లిష్‌లోనే రాత పరీక్ష నిర్వహించనున్నారని, ఇది చట్టవిరుద్ధమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన డి.శివశంకర్‌రెడ్డి, మద్దుల రాజారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. ఇంగ్లిష్‌లో మాత్రమే రాతపరీక్ష నిర్వహించడం అధికార భాషా చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఇంగ్లిష్‌లోనే పరీక్ష నిర్వహించడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తెలుగులో కూడా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రెండు నోటిఫికేషన్‌లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసుల్లో అసిస్టెంట్ మోటార్ వాహన ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
‘ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు’.. తదుపరి చర్యలన్నీ నిలుపుదల
Published Tue, Nov 22 2022 4:21 AM | Last Updated on Tue, Nov 22 2022 8:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment