priliminary exam
-
ప్రిలిమ్స్ మళ్లీ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసు కోకపోవడం, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. అంతేకాదు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను వేర్వేరుగా వెల్ల డించడం టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంద ని పేర్కొంది. అభ్యర్థుల సంతకాలు మారినా ఇన్విజిలేటర్లు గమనించకపోవడాన్ని తప్పుబట్టింది. నోటి ఫికేషన్లో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించని కారణంగా ఒక్క మెరిట్ అభ్యర్థి అర్హత కోల్పోయినా న్యాయ సమ్మతం, సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నామని తీర్పు ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై వచ్చే వారం డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అక్రమాలకు తావిస్తోందంటూ..: జూన్ 11న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, అది అక్రమాలకు తావిచ్చేలా ఉందంటూ అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. లోపాలపై చర్యలు తీసుకోవాలని జూన్ 13న టీఎస్పీఎస్సీకి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వివరించారు. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోర్టును కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్టు అయింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్లను మార్చేందుకు ఇది అవకాశం ఇచ్చిందంటూ పిటిషనర్లు కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఒకసారి లీక్ అయి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పకడ్బందీగా వ్యవహరించాల్సిన టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓఎంఆర్ షీట్‌పై ఫొటో లేదు. 2022 అక్టోబర్‌లో ప్రిలిమ్స్ సందర్భంగా తీసుకున్న చర్యలు, సూచనలు తాజా పరీక్ష సందర్భంగా చేపట్టలేదు. ఓఎంఆర్ షీట్‌పై, హాల్‌టికెట్‌పై నందని అనే అభ్యర్థిని సంతకం సరిపోలకున్నా పరీక్షకు అనుమతించారు. భరత్ అనే మరో అభ్యర్థి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇలాంటి లోపాల కారణంగా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చినట్లు అయింది. అందుకే తాజా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి’’ అని కోర్టుకు విన్నవించారు. పకడ్బందీగా నిర్వహించామంటూ.. టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులతో హాల్‌టికెట్లను సరిపోల్చాకే.. అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ఒక అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లికాక ముందు ఇంటిపేరుకు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. పిటిషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించి, మెయిన్ నిర్వహించేలా టీఎస్పీఎస్సీకి అనుమతి ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే.. అభ్యర్థుల తరఫున జూన్ 21న న్యాయవాది బి.నర్సింగ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ఆగస్టు 3న తీర్పును రిజర్వు చేశారు. శనివారం వెలువరించారు. ‘‘ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమేనని అనుకున్నా.. ఇందులో అర్హత పొందినవారే 1ః50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు ఎంపికవుతారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ లోపాలు, అలసత్వం కారణంగా.. కొందరు మెరిట్ అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపిక కాకుండా పోయే అవకాశం ఉంది. లక్షల మంది భవిష్యత్‌ను నిర్ణయించే పరీక్ష ఇది. అందుకే ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఎలాంటి లోపాలు, అలసత్వం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేస్తున్నాం. బయోమెట్రిక్ తీసుకోకపోవడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను ధ్రువీకరించుకోకుండానే టీఎస్పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. జూన్ 28న వెబ్‌నోట్‌లో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను 2,33,506గా పేర్కొన్నారు. జూలై 12న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఈ సంఖ్యను 2,33,248గా వెల్లడించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు నేరుగా అధారాలు లేకున్నా.. అందుకు అవకాశమిచ్చేలా పరీక్ష నిర్వహణ సాగిందని స్పష్టమవుతోంది. టీఎస్పీఎస్సీ అలసత్వం కారణంగానే సంతకాలలో వ్యత్యాసమున్న వారూ పరీక్ష రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కొందరు అభ్యర్థుల సంతకాల ఆధారాలను కూడా అందజేశారు’’ అని తీర్పులో పేర్కొన్నారు. గ్రూప్–1 లీకేజీపై పెండింగ్‌లో పిటిషన్ ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో దాఖలైన పిల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ పిటిషన్లో గత నెల విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.. డబ్బూ.. సమయం వృథా గ్రూప్–1 పరీక్షకు మూడేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. పుస్తకాలు, గది అద్దె, శిక్షణ కేంద్రాల్లో ఫీజు కలిపి రూ.2లక్షలకుపైగా ఖర్చయింది. ఇప్పటికే ఒకే ప్రిలిమ్స్‌ను రెండు సార్లు రాశాను. మూడోసారి పరీక్షకు సిద్ధమవడమంటే కష్టమే. మళ్లీ డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పరీక్షను రెండుసార్లు రద్దు చేయడమంటే.. ప్రభుత్వం ఫెయిలైనట్టే లెక్క. – బోడ నాగేశ్వరరావు, కొత్తగూడెం, గ్రూప్–1 అభ్యర్థి -
గ్రూప్-1 ప్రిలిమ్స్.. టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దర్యాప్తు నివేదిక మూడు వారాల్లో సమర్పించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. కాగా పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మరో కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఈ పిల్‌కు అటాచ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. చదవండి: వారం రోజుల్లో తొలి విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్ -
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు
-
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది. -
ఏపీపీఎస్సీ నియామకాలకు ఇకపై ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి : గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది, ఆ పైన సమయం పడుతోందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నందున పాలిటెక్నిక్ లెక్చరర్లు, గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయలేకపోయామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం. వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వచ్చే ఆగస్టులో చెప్పుకోదగ్గ రీతిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తాం. అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించాం. నిరుద్యోగులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని అన్నారు. -
నేడు గ్రూప్–2 ప్రిలిమినరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఓఎమ్మార్ షీట్లతో పేపర్, పెన్ను ఆధారంగా జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలన్నారు. గ్రూప్– 2 కోసం మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేసుకోగా.. శనివారం నాటికి 2.30 లక్షల మందికిపైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పర్యవేక్షణకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులను ఆయా జిల్లాలకు పంపినట్లు ఆయన వివరించారు. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగాలు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని చెప్పారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాలపై సందేహం వస్తే ఆయా ఫోన్ నంబర్లకు కాల్ చేయాలన్నారు. కొన్ని మార్చిన సెంటర్లకు సంబంధించిన వివరాలను జిల్లా యంత్రాంగాలు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ చేశామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆయా అభ్యర్థులు రివైజ్డ్ హాల్ టికెట్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎలా చేరుకోవాలో..? ఫోని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి కాస్త అస్తవ్యస్తంగా మారింది. పలు రైళ్లు, బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎంబీబీఎస్, డెంటల్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ’నీట్’ పరీక్షలను తుపాను ప్రభావిత ఒడిశాలో నిర్వహించడం లేదు. ఉత్తరాంధ్రలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా గ్రూప్–2ని వాయిదా వేయాలని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నా ఏపీపీఎస్సీ వినిపించుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
అనంతపురం అర్బన్: జిల్లాలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను కలెక్టర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. పరీక్షకు మొత్తం 3,537 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకి 2,099 మంది, పేపర్–2 పరీక్షకి 2,106 మం ది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 1,438 మంది (40. 65 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,431 మం ది (40.45 శాతం) మాత్రమే హాజరయ్యారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశా రు.అదే విధంగా దివ్యాంగులు, అంధులు పరీక్ష రాస్తున్న కేంద్రా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివి ల్స్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో జరగడం ఇది రెండవసారి అన్నా రు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, యూపీఎస్సీ నిబంధనల మేరకు పరీక్షలను నిర్వహించామన్నారు. అనంతరం యూ పీఎస్సీ పరీక్ష పరిశీలకురాలిగా వచ్చిన సర్వే, భూ రికార్డుల శాఖ కమిషనర్ వాణిమోహన్‌కు పరీక్షల నిర్వహణ వివరాలను తెలి యజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మలోలా, ఎస్ఎస్బీఎన్ కేం ద్రం పరిశీలకులు సురేశ్, జిల్లా పరిశీలకులు హౌసింగ్ పీడీ ప్రసా ద్, యువజన సంక్షేమ శాఖాధికారి గీతాగాంధీవాణి ఉన్నారు.