సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసు కోకపోవడం, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. అంతేకాదు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను వేర్వేరుగా వెల్ల డించడం టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంద ని పేర్కొంది. అభ్యర్థుల సంతకాలు మారినా ఇన్విజిలేటర్లు గమనించకపోవడాన్ని తప్పుబట్టింది.
నోటి ఫికేషన్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించని కారణంగా ఒక్క మెరిట్ అభ్యర్థి అర్హత కోల్పోయినా న్యాయ సమ్మతం, సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నామని తీర్పు ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై వచ్చే వారం డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
అక్రమాలకు తావిస్తోందంటూ..: జూన్ 11న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, అది అక్రమాలకు తావిచ్చేలా ఉందంటూ అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. లోపాలపై చర్యలు తీసుకోవాలని జూన్ 13న టీఎస్‌పీఎస్సీకి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వివరించారు. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని కోర్టును కోరారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్టు అయింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్లను మార్చేందుకు ఇది అవకాశం ఇచ్చిందంటూ పిటిషనర్లు కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అప్పటికే ఒకసారి లీక్ అయి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పకడ్బందీగా వ్యవహరించాల్సిన టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓఎంఆర్ షీట్‌పై ఫొటో లేదు. 2022 అక్టోబర్‌లో ప్రిలిమ్స్ సందర్భంగా తీసుకున్న చర్యలు, సూచనలు తాజా పరీక్ష సందర్భంగా చేపట్టలేదు. ఓఎంఆర్ షీట్‌పై, హాల్‌టికెట్‌పై నందని అనే అభ్యర్థిని సంతకం సరిపోలకున్నా పరీక్షకు అనుమతించారు.
భరత్ అనే మరో అభ్యర్థి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇలాంటి లోపాల కారణంగా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చినట్లు అయింది. అందుకే తాజా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి’’ అని కోర్టుకు విన్నవించారు.
పకడ్బందీగా నిర్వహించామంటూ..
టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులతో హాల్‌టికెట్లను సరిపోల్చాకే.. అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు.
ఒక అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లికాక ముందు ఇంటిపేరుకు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. పిటిషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించి, మెయిన్ నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీకి అనుమతి ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే..
అభ్యర్థుల తరఫున జూన్ 21న న్యాయవాది బి.నర్సింగ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ఆగస్టు 3న తీర్పును రిజర్వు చేశారు. శనివారం వెలువరించారు. ‘‘ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమేనని అనుకున్నా.. ఇందులో అర్హత పొందినవారే 1ః50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు ఎంపికవుతారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ లోపాలు, అలసత్వం కారణంగా.. కొందరు మెరిట్ అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపిక కాకుండా పోయే అవకాశం ఉంది.
లక్షల మంది భవిష్యత్‌ను నిర్ణయించే పరీక్ష ఇది. అందుకే ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఎలాంటి లోపాలు, అలసత్వం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేస్తున్నాం. బయోమెట్రిక్ తీసుకోకపోవడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను ధ్రువీకరించుకోకుండానే టీఎస్‌పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం.
జూన్ 28న వెబ్‌నోట్‌లో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను 2,33,506గా పేర్కొన్నారు. జూలై 12న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ఈ సంఖ్యను 2,33,248గా వెల్లడించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు నేరుగా అధారాలు లేకున్నా.. అందుకు అవకాశమిచ్చేలా పరీక్ష నిర్వహణ సాగిందని స్పష్టమవుతోంది. టీఎస్‌పీఎస్సీ అలసత్వం కారణంగానే సంతకాలలో వ్యత్యాసమున్న వారూ పరీక్ష రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కొందరు అభ్యర్థుల సంతకాల ఆధారాలను కూడా అందజేశారు’’ అని తీర్పులో పేర్కొన్నారు.
గ్రూప్–1 లీకేజీపై పెండింగ్‌లో పిటిషన్
ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో దాఖలైన పిల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ పిటిషన్‌లో గత నెల విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా..
డబ్బూ.. సమయం వృథా
గ్రూప్–1 పరీక్షకు మూడేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. పుస్తకాలు, గది అద్దె, శిక్షణ కేంద్రాల్లో ఫీజు కలిపి రూ.2లక్షలకుపైగా ఖర్చయింది. ఇప్పటికే ఒకే ప్రిలిమ్స్‌ను రెండు సార్లు రాశాను. మూడోసారి పరీక్షకు సిద్ధమవడమంటే కష్టమే. మళ్లీ డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పరీక్షను రెండుసార్లు రద్దు చేయడమంటే.. ప్రభుత్వం ఫెయిలైనట్టే లెక్క.
– బోడ నాగేశ్వరరావు, కొత్తగూడెం, గ్రూప్–1 అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment