group-1 exams
-
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు షురూ..
-
అపోహలొద్దు.. పరీక్ష రాయండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రూప్–1 విషయంలో అపోహలను నమ్మొద్దు. జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందరికీ న్యాయం జరగాలనే జీవో 29ను తీసుకొచ్చాం. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1ః50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్‌కు సెలెక్ట్ చేశాం. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు. అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరుకావాలి. లేకపోతే బంగారం లాంటి అవకాశం కోల్పోతారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శనివారం నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్–2024 ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందని, మధ్యలో నిబంధనలు మారిస్తే పరీక్షలను కోర్టు రద్దు చేయొచ్చ న్నారు. తాము పరీక్ష నిర్వహిస్తున్న విధానాన్ని కోర్టులు సమర్థించాయని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే..: గ్రూప్–1 విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసం వితండవాదం చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను ఉసిగొల్పి ప్రాణాలు బలిగొన్నారని, వారు మాత్రం రాజకీయంగా లబ్ధిపొంది ఉన్నత పదవులు చేపట్టారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనివారు.. ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఆందోళనలు చేయిస్తున్నారని, నిరుద్యోగులు వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. ఇక ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. పోలీస్ సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన ఉంటుందని.. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ వరకు పోలీస్ పిల్లలకు చదువు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పోలీస్ డ్యూటీ మీట్‌ను సిబ్బందిలో స్ఫూర్తినిచ్చేలా నిర్వహించారని ఉన్నతాధికారులను అభినందించారు. తెలంగాణ సాధన కోసం కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం 4 కోట్ల మంది మరువలేనిదన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని ఆదేశించారు. కాగా.. త్వరలోనే పోలీస్ స్పోర్ట్స్ మీట్ కూడా నిర్వహిస్తామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. డ్యూటీ మీట్ ముగింపులో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
గ్రూప్–1పై అప్పీలుకు వెళ్లేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షపై సందిగ్ధం వీడటం లేదు. నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి వహించినందుకు ఈ పరీక్షను రద్దు చేయాలంటూ వేర్వేరు సందర్భాల్లో హైకోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చి నెలరోజులు కావస్తున్నా... తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు ఏ నిర్ణయాన్ని ప్రక టించలేదు. పరీక్ష రద్దు విషయంలో స్పష్టతని వ్వని టీఎస్పీఎస్సీ హైకోర్టు తీర్పుపై అప్పీలు కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అందుకు మళ్లీ సన్నద్ధం కావాలా? లేక మెయిన్ పరీక్షలకు సిద్ధమవ్వా లా? తేల్చుకోలేక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. పరీక్షలు రద్దు మీద రద్దు గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తూ... 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను విడుదల చేసింది. దీంతో ఆయా అభ్యర్థులంతా మెయిన్ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీలో పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకు కావడంతో ఆఘమేఘాల మీద అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 11న మరోమారు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు మళ్లీ సన్నద్ధమయ్యారు. రెండో దఫా పరీక్షకు 3,09,323 మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోగా... 2,33,248 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండో దఫా పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ పకడ్భందీగా నిర్వహించలేదని అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధానంగా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకోకుండా ఇష్టానుసారంగా నిర్వహించారని, పరీక్ష హాజరు శాతంలో గణాంకాలు మారిపోయాయంటూ ఆరోపించారు. కేసును విచారించిన హైకోర్టు రెండు సార్లు పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది. ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో? సాధారంగా కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును అమలు చేయడం లేదా పై కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కానీ టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. దాదాపు ఏడాదిన్నరగా పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులకు తక్షణ కర్తవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధం కాగా... ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో పాలుపోవడం లేదంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందట! కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని టీఎస్పీఎస్సీని వివరణ కోరగా... సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని కమిషన్ అధికారులు చెబుతున్నారు. -
ప్రిలిమ్స్ మళ్లీ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసు కోకపోవడం, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. అంతేకాదు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను వేర్వేరుగా వెల్ల డించడం టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంద ని పేర్కొంది. అభ్యర్థుల సంతకాలు మారినా ఇన్విజిలేటర్లు గమనించకపోవడాన్ని తప్పుబట్టింది. నోటి ఫికేషన్లో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించని కారణంగా ఒక్క మెరిట్ అభ్యర్థి అర్హత కోల్పోయినా న్యాయ సమ్మతం, సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నామని తీర్పు ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై వచ్చే వారం డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అక్రమాలకు తావిస్తోందంటూ..: జూన్ 11న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, అది అక్రమాలకు తావిచ్చేలా ఉందంటూ అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. లోపాలపై చర్యలు తీసుకోవాలని జూన్ 13న టీఎస్పీఎస్సీకి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వివరించారు. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోర్టును కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్టు అయింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్లను మార్చేందుకు ఇది అవకాశం ఇచ్చిందంటూ పిటిషనర్లు కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఒకసారి లీక్ అయి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పకడ్బందీగా వ్యవహరించాల్సిన టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓఎంఆర్ షీట్‌పై ఫొటో లేదు. 2022 అక్టోబర్‌లో ప్రిలిమ్స్ సందర్భంగా తీసుకున్న చర్యలు, సూచనలు తాజా పరీక్ష సందర్భంగా చేపట్టలేదు. ఓఎంఆర్ షీట్‌పై, హాల్‌టికెట్‌పై నందని అనే అభ్యర్థిని సంతకం సరిపోలకున్నా పరీక్షకు అనుమతించారు. భరత్ అనే మరో అభ్యర్థి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇలాంటి లోపాల కారణంగా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చినట్లు అయింది. అందుకే తాజా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి’’ అని కోర్టుకు విన్నవించారు. పకడ్బందీగా నిర్వహించామంటూ.. టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులతో హాల్‌టికెట్లను సరిపోల్చాకే.. అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ఒక అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లికాక ముందు ఇంటిపేరుకు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. పిటిషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించి, మెయిన్ నిర్వహించేలా టీఎస్పీఎస్సీకి అనుమతి ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే.. అభ్యర్థుల తరఫున జూన్ 21న న్యాయవాది బి.నర్సింగ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ఆగస్టు 3న తీర్పును రిజర్వు చేశారు. శనివారం వెలువరించారు. ‘‘ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమేనని అనుకున్నా.. ఇందులో అర్హత పొందినవారే 1ః50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు ఎంపికవుతారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ లోపాలు, అలసత్వం కారణంగా.. కొందరు మెరిట్ అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపిక కాకుండా పోయే అవకాశం ఉంది. లక్షల మంది భవిష్యత్‌ను నిర్ణయించే పరీక్ష ఇది. అందుకే ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఎలాంటి లోపాలు, అలసత్వం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేస్తున్నాం. బయోమెట్రిక్ తీసుకోకపోవడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను ధ్రువీకరించుకోకుండానే టీఎస్పీఎస్సీ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. జూన్ 28న వెబ్‌నోట్‌లో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను 2,33,506గా పేర్కొన్నారు. జూలై 12న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఈ సంఖ్యను 2,33,248గా వెల్లడించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు నేరుగా అధారాలు లేకున్నా.. అందుకు అవకాశమిచ్చేలా పరీక్ష నిర్వహణ సాగిందని స్పష్టమవుతోంది. టీఎస్పీఎస్సీ అలసత్వం కారణంగానే సంతకాలలో వ్యత్యాసమున్న వారూ పరీక్ష రాశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కొందరు అభ్యర్థుల సంతకాల ఆధారాలను కూడా అందజేశారు’’ అని తీర్పులో పేర్కొన్నారు. గ్రూప్–1 లీకేజీపై పెండింగ్‌లో పిటిషన్ ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో దాఖలైన పిల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ పిటిషన్లో గత నెల విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా.. డబ్బూ.. సమయం వృథా గ్రూప్–1 పరీక్షకు మూడేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను. పుస్తకాలు, గది అద్దె, శిక్షణ కేంద్రాల్లో ఫీజు కలిపి రూ.2లక్షలకుపైగా ఖర్చయింది. ఇప్పటికే ఒకే ప్రిలిమ్స్‌ను రెండు సార్లు రాశాను. మూడోసారి పరీక్షకు సిద్ధమవడమంటే కష్టమే. మళ్లీ డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పరీక్షను రెండుసార్లు రద్దు చేయడమంటే.. ప్రభుత్వం ఫెయిలైనట్టే లెక్క. – బోడ నాగేశ్వరరావు, కొత్తగూడెం, గ్రూప్–1 అభ్యర్థి -
Telangana: గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేయండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్లలో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్, ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్ష ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్పీఎస్సీ సిబ్బందిలో ఎంత మందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. యూపీపీఎస్సీ లాంటి కమిషన్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలని సూచించారు. ఈ పిటిషన్లపై గురువారం జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. గత ఏడాది గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలు పూ ర్తయ్యాక ప్రశ్నపత్రాలు లీకేజీ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారన్నారు. మళ్లీ టీఎస్పీఎస్సీ నిర్వహణ అంటే ఎలా? ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేలిందని, ఇప్ప టికే 19 మంది దాకా అరెస్టయ్యారని చెప్పారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని, అలాంటప్పుడు అదే సంస్థ పరీక్ష ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఆ బాధ్యతను మరో సంస్థకు అప్పగించాలని కోరారు. టీఎస్పీఎస్సీ తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. లీకేజీ అంశంలో 19 మంది ఉద్యోగులు లేరన్నారు. ఉన్న ఇద్దరు కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 991 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామని, పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పా రు. వాదనలను విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు, గతంలో జరిగిన ఉదంతాల నిగ్గు తేల్చేందుకు కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నగర పోలీసులు బదిలీ చేశారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరగనుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఏ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి? గతంలోనూ ఇలా జరిగాయా? తదితర అంశాలపై సిట్ లోతైన దర్యాప్తు జరపనుంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రేణుకను చంచల్‌గూడ మహిళ జైలుకు మిగతా ఎనిమిది మందిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు మంగళవారం జ్యుడీíÙయల్ రిమాండ్‌కు (చంచల్‌గూడ జైలుకు) తరలించారు. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు వీలుగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇలావుండగా ఈ కేసులో నిందితుడు గత అక్టోబర్‌లో గ్రూప్–1 పరీక్ష రాయడం, 150కి ఏకంగా 103 మార్కులు సాధించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ వైరల్ టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పులిదిండి ప్రవీణ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 పరీక్ష రాశాడు. కానీ పరీక్షకు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అయినా మొత్తం 150 మార్కులకు గాను ఏకంగా 103 సాధించాడు. దీంతో ఆ పేపర్‌ను కూడా తస్కరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓఎంఆర్ షీట్‌ను నింపడంలో చేసిన పొరపాటు కారణంగా ప్రవీణ్ డిస్క్వాలిఫై అయ్యాడు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్‌లోని ప్రతి అంశాన్నీ పక్కాగా నింపాల్సి ఉంటుంది. దీని పైభాగంలో హాల్ టిక్కెట్ నంబర్‌తో పాటు టెస్ట్ బుక్లెట్ నంబర్, వెన్యూ కోడ్లను తొలుత అంకెల్లో నింపి, వాటి కింద ఓఎంఆర్ విభాగంలో సున్నాలు చుడుతూ పూరించాలి. అంకెల్ని సక్రమంగా వేసిన ప్రవీణ్‌కుమార్ సున్నాలు చుట్టడంలో మాత్రం పొరపడ్డాడు. టెస్ట్ బుక్లెట్ నంబర్‌కు అంకెల్లో ‘459244’గా వేసిన ఇతను సున్నాల దగ్గరకు వచ్చేసరికి ‘4599244’అని రీడ్ అయ్యేలా పూరించాడు. దీంతో అతను ఆ పరీక్షలో డిస్క్వాలిఫై అయ్యాడని అధికారులు చెప్తున్నారు. ఈ ఓఎంఆర్ షీట్ మంగళవారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పది రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవడ్యావత్ డాక్యా సహా మొత్తం తొమ్మిది మందినీ తదుపరి విచారణ నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నిందితులను ప్రశ్నించడంతోపాటు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ల పరిశీలన, ఫోరెన్సిక్ నివేదిక అందాకే లీకేజీలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లి, సోదరుడి ఆర్థిక ఇబ్బందులతో.. పోలీసులు కోర్టుకు సమరి్పంచిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు పొందుపరిచారు. రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ గతంలో వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆమె తల్లికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేణుక తనకు పరిచయస్తుడైన ప్రవీణ్‌ను ట్రాప్ చేసి, పరీక్ష పేపర్లు బయటకు తీసుకువస్తానని, వాటిని అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని చెప్పింది. పేపర్లు చేజిక్కిన తర్వాత భర్త లవడ్యావత్ డాక్యా, రాజేశ్వర్లతో కలిసి ప్రధానంగా తమ సామాజిక వర్గం వారికే విక్రయించాలని నిర్ణయించుకుంది. నీలేష్, గోపాల్‌లకు అమ్మడానికి సిద్ధమై ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. అయితే వాళ్లు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు వారి నుంచి తీసుకున్న రూ.15 లక్షల్లో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచి్చంది. 48 మందితో అసభ్య చాటింగ్.. ఫొటోల షేరింగ్ కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దాన్ని ఆన్లైన్లో నింపే క్రమంలో పొరపాట్లు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కమిషన్ నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతూ ఉంటాయి. వీటిని సరి చేసుకోవడానికి అనేక మంది అభ్యర్థులు, అభ్యర్థినులు టీఎస్పీఎస్సీకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో యువతులు, మహిళలకు సహాయపడే ప్రవీణ్.. ఆపై వారిని ట్రాప్ చేసి లోబర్చుకునేవాడని తెలుస్తోంది. దాదాపు 48 మందితో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం చేశాడని ప్రవీణ్ ఫోన్‌ను విశ్లేషించిన సైబర్ నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేణుక కూడా ప్రవీణ్‌కు గురుకుల పరీక్షల నేపథ్యంలో పరిచయమైంది. 2018లో గురుకులాల్లో హిందీ టీచర్ పోస్టుకు ఆమె దరఖాస్తు చేసుకుంది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కమిషన్‌కు వచ్చిన ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. పరీక్ష సమస్య పరిష్కారం కాగా.. పరిచయం కాస్తా సన్నిహిత సంబంధం వరకు వెళ్లింది. వీళ్లు కొన్ని వ్యక్తిగత ఫొటోలను కూడా షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో రేణుక గురుకుల పరీక్షలో క్వాలిఫై కావడంలోనూ లీకేజీ వ్యవహారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస సెలవులు.. మరిన్ని అనుమానాలు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 2018 నుంచి పనిచేస్తున్న రేణుక..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సెలవులు తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష ఈ నెల 5న జరగగా.. నాలుగో తేదీన సెలవు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐదో తేదీ ఆదివారం కాగా.. బంధువులు చనిపోయారని ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సెలవులో ఉన్నట్లు ఆమె సహోపాధ్యాయులు తెలిపారు. మరోవైపు గ్రూప్–1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరగగా.. నవంబర్‌లో 12 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యింది. 14 రోజులు మెడికల్ లీవ్ పెట్టినట్లు సిబ్బంది తెలిపారు. ఇప్పుడు, అప్పుడు పరీక్షల తర్వాత వరుస సెలవులు పెట్టిన క్రమంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో 13 మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్ -
సమయం దాటినా గ్రూప్-1 పరీక్ష రాయించి గోప్యంగా ఉంచారు..అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షలు, ఉద్యో గాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు ఏవైనా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్నింటికైతే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి రానివ్వరు. ఇక నిర్ణీత సమయం అయిపోయిందంటే.. జవాబు పత్రాన్ని లాక్కుని మరీ బయటికి పంపేస్తారు. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను ఒక కేంద్రంలో ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించిన విషయం కలకలం రేపుతోంది. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగింది? హైదరాబాద్‌లోని లాలాపేట్ శాంతినగర్‌లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను ఆలస్యంగా నిర్వహించారు. ఈ నెల 16న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగాల్సి ఉంటే.. ఈ సెంటర్లోని మూడు గదుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3:30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్టు వెల్లడైంది. పరీ„ý కేంద్రంలోకి అభ్యర్థులందరినీ సకాలంలో అనుమతించామని.. పరీక్ష సమయం ప్రారంభం కాగానే ప్రశ్నపత్రాలు అందజేశామని అధికారులు చెబుతున్నారు. 3 గదుల్లో మాత్రం ఇంగ్లిష్–తెలుగు ప్రశ్నపత్రానికి బదులుగా ఇంగ్లిష్ –ఉ ర్దూ పేపర్ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన కు దిగారని.. దీనితో ఆలస్యమైందని అంటున్నారు. తిరిగి అభ్యర్ధులకు కొత్త ప్రశ్నపత్రం, కొత్త ఓఎంఆర్ షీట్‌తోపాటు అదనపు సమ యం ఇచ్చి పరీక్ష రాయించినట్టు వివరిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులు గోప్యంగా ఉంచడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం వాస్తవమే: పరీక్షల అదనపు కో–ఆర్డినేటింగ్ అధికారి సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ప్రిలిమ్స్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం వాస్తవమేనని హైదరాబాద్ జిల్లా గ్రూప్–1 పరీక్షల అడిషనల్ కో–ఆర్టినేటింగ్ అధికారి, అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మూడు గదుల్లోని 47 మంది అభ్యర్థులకు తెలుగు–ఇంగ్లిష్ ద్విభాషా ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్, ఇతర భాష ల్లో (తెలుగు కాకుండా) ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్లు పంపిణీ చేశారని తెలిపారు. తర్వాత తప్పిదాన్ని గుర్తించి.. తెలుగు–ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలను ఇచ్చారని వివరించారు. కానీ అభ్యర్థులు చాలాసేపు ఆందోళన చేశారని.. తమ జవాబుపత్రాలు చెల్లుబాటు అవుతాయనే అపోహతో ప్రశ్నపత్రం సెట్ తీసుకోవడానికి నిరాకరించారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి నచ్చజెప్పడంతో.. మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష రాయడం ప్రారంభించారన్నారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్ష పూర్తయ్యేదాకా సెంటర్లోనే ఉన్నారని తెలిపారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే తరహా కారణాలతో ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, ఐదుగురు అభ్యర్ధులకు 30 నిమిషాలు.. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 15 మంది అభ్యర్థులకు 7 నిమిషాలు అదనపు సమయమిచ్చామని వివరించారు. పరీక్షకేంద్రంలో అవకతవకలు జరగలేదని, టీఎస్పీఎస్సీతో సంప్రదింపుల మేరకే అదనపు సమయం ఇచ్చామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఏఐవైఎఫ్ గ్రూప్–1 పరీక్షను నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని, తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంపై విచారణ జరపాలి: ఏఐఎస్ఎఫ్ గ్రూప్–1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిబంధ నల ప్రకారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించాలనీ, కానీ హైదరా బాద్ లాలాపేట్, శాంతినగర్‌లోని ఎస్ఎఫ్ ఎస్ (సెయింట్, ఫ్రాన్సిస్ డీ సేల్స్) హైస్కూ ల్ పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణి కంఠరెడ్డి, లక్ష్మణ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు. ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్లపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పరీక్ష నిర్వహించేది ఇలానేనా?
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేందుకు సింగిల్ జడ్జి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు సోమవారం తన తీర్పును వాయిదా వేసింది. ఇదే సమయంలో గ్రూప్–1 ప్రశ్నపత్రం రూపకల్పన విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీరును హైకోర్టు తప్పుపట్టింది. అభ్యర్థుల భవిష్యత్తు గురిం చి ఏ మాత్రం పట్టించుకోరా అంటూ నిలదీసింది. ప్రశ్నపత్నంలో 50కి పైగా తప్పులు ఏమిటంటూ అడిగింది. పరీక్షలు నిర్వహించేది ఇలాగేనా అంటూ ప్రశ్నించింది. ఇంగ్లిష్ లో ఉన్న ప్రశ్నలను తెలుగులోకి సక్రమంగా అనువదించేందుకు అవసరమైన సామర్థ్యం కమిషన్‌కు లేదా అంటూ నిలదీసింది. నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నల్లో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని, అందువల్ల పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని కోరారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, పరీక్ష తిరిగి నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపించారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తప్పులున్న ప్రశ్నలకు అభ్యర్థులందరికీ సమానంగా మార్కులిచ్చామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పరీక్షలు నిర్వహించడం ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేసింది. -
ఇదో ‘గ్రూప్’ దందా!
సాక్షి, అమరావతి: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు నచ్చిన, అనుకూలురైన అభ్యర్థులను నియమించుకునేందుకు టీడీపీ సర్కారు సిద్ధమైంది! డిప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–3 , సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తదితర గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేసి ఇంటర్వ్యూ మార్కులను కూడా పెంచడం ద్వారా దీన్ని ‘మేనేజ్’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా సర్కారీ కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ రూ.లక్షలు పోసి శిక్షణ పొందుతున్న అభ్యర్థుల ఆశలు గల్లంతు కానున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల శిక్షణ విధానం పూర్తిగా భిన్నంగా ఉండటంతోపాటు ఇంటర్వ్యూ మార్కుల్లో తేడా వల్ల అభ్యర్థుల జాతకాలే మారిపోనున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లోకి మళ్లించేందుకు ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలపై నిరుద్యోగ యువత తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 నియామకాల్లో అర్హులైన అభ్యర్ధులకు దక్కాల్సిన పోస్టులను ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు కేటాయించడం ద్వారా ఇతరులకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తమ ప్రణాళిక అమలయ్యేలా సర్కారు పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆబ్జెక్టివ్‌కు బదులుగా వ్యాసరూప ప్రశ్నలు గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్ధులు శిక్షణ కోసం గత కొన్నేళ్లుగా రూ.లక్షలు వెచ్చించి సన్నద్ధమవుతున్నారు. ఇక గ్రూప్–1 పరీక్షలు రాసేది 5 వేల మందికి లోపే ఉన్నారు. గ్రూప్–2 పరీక్షలకు ఇప్పటివరకు ఆబ్జెక్టివ్ తరహాలో సిద్ధం అవుతున్న అభ్యర్థులకు సర్కారు తాజా ఆలోచనలు కలవరం కలిగిస్తున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేస్తే ఆబ్జెక్టివ్‌కు బదులుగా డిస్క్రిప్టివ్ (వ్యాస రూప) పరీక్షలను రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ మార్కులు 50కి బదులుగా 75కి పెరుగుతాయి. దీనివల్ల ఇన్నాళ్లూ తాము పొందిన శిక్షణ అంతా వృథాగా మారటంతోపాటు అక్రమాలకు ఎక్కువ ఆస్కారముంటుందని ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణ కమిటీ సిఫార్సులు తుంగలోకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సత్యనారాయణ కమిటీ గ్రూప్–1 కేడర్ పోస్టులకు మినహా తక్కిన గ్రూపుల్లోని పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించి కేవలం రాతపరీక్షల ద్వారానే ఎంపికలు చేయాలని 2011లో సిఫార్సు చేసింది. కమిటీ నివేదికను ఆమోదించిన అప్పటి ప్రభుత్వం గ్రూప్–2 పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించింది. కానీ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 622, 623 జీవోలను తెచ్చి గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ టీడీపీ సర్కారు గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేయాలని భావిస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మినహా ఇతర కేడర్లలోని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ ఇదే విధానం వర్తింప చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా యోచిస్తోంది. గ్రూప్–2లోనే ఎక్కువ పోస్టులు 2016 గ్రూప్–2లో 982 పోస్టులు (ఇందులో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు) ప్రకటించగా గ్రూప్–1లో 78 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రూప్–2లో ఆబ్జెక్టివ్ పరీక్షలతోపాటు వాటిలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గ్రూప్–1లో డిస్క్రిప్టివ్ పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు 75 మార్కులకు ఉంటాయి. డిస్క్రిప్టివ్ మూల్యాంకనంపై ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఇంటర్వ్యూల తరువాత తలరాతలు తారుమారు ఇంటర్వ్యూల్లో కూడా అర్హులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇటీవల డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గ్రూప్–1 నియామకాలపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో అతి తక్కువ మార్కులు రావటంతో అభ్యర్ధుల తలరాతలు తారుమారయ్యాయి. ఇంటర్వ్యూల్లో గరిష్ఠ మార్కులను నిర్దిష్ట శాతానికి పరిమితం చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని విధివిధానాలను పాటిస్తోంది. ఏపీపీఎస్సీ అలా చేయడం లేదు. కొందరికి 15 శాతం మార్కులే వస్తే మరికొందరికి 80 – 95 శాతం వరకు మార్కులు కేటాయిస్తున్నారు. ఫలితంగా రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులు ఇంటర్వ్యూల తరువాత అట్టడుగుకు పడిపోయి పోస్టులు కోల్పోతున్నారు. కేసులు, ఆందోళనకు దిగితే మార్కులకు కత్తెర! ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు, తప్పులను సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసినా, ఆందోళనకు దిగినా అలాంటి వారికి రాతపరీక్షల మూల్యాంకనం, ఇంటర్వ్యూలలో కత్తెర వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2016 గ్రూప్–2 పరీక్షల్లో గందరగోళం చెలరేగిందని ఆందోళనకు దిగిన తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇటీవల గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి కేసులు వేసిన ఏడుగురిని ఇంటర్వ్యూల్లో ఫెయిల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బోర్డు కూర్పుపైనా విమర్శలు గతంలో ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్‌లోని అందరు సభ్యులతోపాటు ప్రభుత్వం సూచించిన ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒకరు, సబ్జెక్టు నిపుణులు కొందరు ఉండేవారు. రోజుకొకరు ఇంటర్వ్యూ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. అభ్యర్థులకు తుది మార్కులు ఖరారు చేసేది బోర్డు ఛైర్మనే. కానీ ప్రస్తుత కమిషన్‌లో దీన్ని పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇంటర్వ్యూలన్నిటిలో బోర్డు ఛైర్మన్ ప్రతిరోజూ తప్పకుండా ఉండడమే కాకుండా ఇంటర్వ్యూ బోర్డులన్నిటికీ ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఇతర సభ్యుల్లో రోజుకొకరికి మాత్రమే అవకాశమిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా ఇది కమిషన్ బోర్డు సభ్యుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు వేసే మార్కుల మధ్య వ్యత్యాసం 5 మార్కులకు మించి ఉండరాదన్న నియమం గతంలో ఉండేది. కానీ ప్రస్తుత బోర్డులో ఇది లేదన్న విమర్శ ఉంది. పైగా ఏ సభ్యుడు ఎన్ని మార్కులు వేసినా చివరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వారే ఫైనల్ మార్కులను నిర్ణయిస్తుండడంతో అభ్యర్థుల తలరాతలు మారిపోతున్నాయి. పోస్టుల విలీనానికి ఏపీపీఎస్సీ చెబుతున్న కారణాలు ఇవీ – ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సరైన అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు అవసరం. – గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారు గ్రూప్–1 పోస్టులకు కూడా ఎంపికవుతున్నందున ఆ పోస్టులు చివరకు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దీన్ని నివారించేందుకే కొత్త పద్ధతి తెస్తున్నామని ఏపీపీఎస్సీ చెబుతోంది. ఎంపికను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే! – ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోస్టుల విలీనం ప్రయత్నాల వెనుక కారణాలు వేరే ఉన్నాయని విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. – గ్రూప్–1లో పోస్టుల సంఖ్య పరిమితంగా ఉంటాయి. గ్రూప్–2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి గ్రూప్–1ఏ, 1బీగా చేయడం ద్వారా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. -
మార్కాపురం అభ్యర్థికి గ్రూప్–1లో ఫస్ట్ ర్యాంక్
మార్కాపురం/రాచర్ల/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/దాచేపల్లి (గురజాల): 2011 గ్రూప్– 1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 489.5 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆకుల వెంకటరమణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రమణ బీటెక్ చదివేటప్పుడే తండ్రి శ్రీరాములు మృతి చెందగా, తల్లి లక్ష్మీనరసమ్మ రెండేళ్ల కిందట మరణించింది. ప్రస్తుతం రమణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఇదే జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లెకు చెందిన ఖాజావలి బీసీ–ఈ కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని రాచర్ల మండలం ఆకవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళల విభాగంలో రెండో ర్యాంక్ శైలజ సొంతం గ్రూప్–1 (2011) పరీక్ష ఫలితాల్లో 434 మార్కులు సాధించి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన దామరచర్ల శైలజ మహిళల విభాగంలో రెండో ర్యాంక్, జనరల్ విభాగంలో 15వ ర్యాంక్ సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పెదయలమంద, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె అయిన శైలజ తండ్రి 11 ఏళ్ల కిందట మరణించడంతో తల్లి కష్టపడి చదివించింది. కాగా.. శైలజ భర్త డాక్టర్ రాజేంద్ర ఇన్‌కంట్యాక్స్ విభాగంలో విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మహిళల్లో మొదటి ర్యాంకర్ హేమలత శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామ శివారు కనుగులవానిపేటకు చెందిన కనుగుల హేమలత 470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి ర్యాంక్ పొందారు. ప్రస్తుతం ఆమె విజయనగరం జిల్లా పార్వతీపురంలో పంచాయతీరాజ్ విభాగం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె విజయంతో తల్లిదండ్రులు ప్రసాదరావు, సుజాత స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. ప్రసాదరావుది వ్యవసాయ కుటుంబమే అయినా హేమలతతోపాటు మిగతా ఇద్దరు పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రోత్సహించారు. పెద్ద కుమార్తె హైమావతి ఆముదాలవలసలో టీచర్‌గా, కుమారుడు జగదీశ్వరరావు తెలంగాణ జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హేమలత భర్త కె.తవిటినాయుడు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో రేంజ్ ఆఫీసర్‌గా ఉన్నారు. -
గ్రూప్-1 మెయిన్ పకడ్బందీగా నిర్వహించాలి
– అధికారులకు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి ఆదేశం - నేటి నుంచి రెండు కేంద్రాల్లో నిర్వహణ - 17 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ సి. మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రోజుమార్చి రోజు జరుగుతాయన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీపీఎస్సీ అధికారులు, జిల్లా అధికారులతో డీఆర్ఓ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు ఒక లైజన్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ లైజన్ అధికారులను నియమించామన్నారు. కేంద్రాల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రశ్నాపత్రాలను జిల్లా ఖజానాలోని స్ట్రాంగ్ రూం నుంచి కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో లైజన్ అధికారి తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో కేంద్రం పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోకి అనుమతించరాదన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికంటే కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. సమావేశలో ఖజానా శాఖ డీడీ శర్మ, పర్యవేక్షకులు వరదరాజులు, నాగభూషణం, ఏపీపీఎస్సీ మానిటరింగ్ అధికారి బి.సి.హెచ్.ఎన్.కుమార్రాజ్, కోఆర్డినేటింగ్ అధికారులు జి.వసంతకుమార్, వి.సురేశ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాలు కేంద్రం కోడ్ అభ్యర్థులు పరీక్ష కేంద్రం 4001 400 ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల 4002 288 ఎస్ఎస్బీఎన్ జూనియన్ కళాశాల పరీక్ష తేదీలు పరీక్ష తేదీ పేపర్ 17.08.17 జనరల్ ఇంగ్లిష్ 19.08.17 పేపర్–1 21.08.17 పేపర్–2 23.08.17 పేపర్–3 26.08.17 పేపర్–4 28.08.17 పేపర్–5