సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు, గతంలో జరిగిన ఉదంతాల నిగ్గు తేల్చేందుకు కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నగర పోలీసులు బదిలీ చేశారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరగనుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఏ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి? గతంలోనూ ఇలా జరిగాయా? తదితర అంశాలపై సిట్ లోతైన దర్యాప్తు జరపనుంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దీంతో పోలీసులు రేణుకను చంచల్‌గూడ మహిళ జైలుకు మిగతా ఎనిమిది మందిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు మంగళవారం జ్యుడీíÙయల్ రిమాండ్‌కు (చంచల్‌గూడ జైలుకు) తరలించారు. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు వీలుగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇలావుండగా ఈ కేసులో నిందితుడు గత అక్టోబర్‌లో గ్రూప్–1 పరీక్ష రాయడం, 150కి ఏకంగా 103 మార్కులు సాధించడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ వైరల్
టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పులిదిండి ప్రవీణ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 పరీక్ష రాశాడు. కానీ పరీక్షకు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అయినా మొత్తం 150 మార్కులకు గాను ఏకంగా 103 సాధించాడు. దీంతో ఆ పేపర్‌ను కూడా తస్కరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఓఎంఆర్ షీట్‌ను నింపడంలో చేసిన పొరపాటు కారణంగా ప్రవీణ్ డిస్‌క్వాలిఫై అయ్యాడు. టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్‌లోని ప్రతి అంశాన్నీ పక్కాగా నింపాల్సి ఉంటుంది. దీని పైభాగంలో హాల్ టిక్కెట్ నంబర్‌తో పాటు టెస్ట్ బుక్‌లెట్ నంబర్, వెన్యూ కోడ్‌లను తొలుత అంకెల్లో నింపి, వాటి కింద ఓఎంఆర్ విభాగంలో సున్నాలు చుడుతూ పూరించాలి. అంకెల్ని సక్రమంగా వేసిన ప్రవీణ్‌కుమార్ సున్నాలు చుట్టడంలో మాత్రం పొరపడ్డాడు. టెస్ట్ బుక్‌లెట్ నంబర్‌కు అంకెల్లో ‘459244’గా వేసిన ఇతను సున్నాల దగ్గరకు వచ్చేసరికి ‘4599244’అని రీడ్ అయ్యేలా పూరించాడు. దీంతో అతను ఆ పరీక్షలో డిస్‌క్వాలిఫై అయ్యాడని అధికారులు చెప్తున్నారు. ఈ ఓఎంఆర్ షీట్ మంగళవారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పది రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు
ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవడ్యావత్ డాక్యా సహా మొత్తం తొమ్మిది మందినీ తదుపరి విచారణ నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నిందితులను ప్రశ్నించడంతోపాటు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ల పరిశీలన, ఫోరెన్సిక్ నివేదిక అందాకే లీకేజీలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
తల్లి, సోదరుడి ఆర్థిక ఇబ్బందులతో..
పోలీసులు కోర్టుకు సమరి్పంచిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు పొందుపరిచారు. రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ గతంలో వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆమె తల్లికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేణుక తనకు పరిచయస్తుడైన ప్రవీణ్‌ను ట్రాప్ చేసి, పరీక్ష పేపర్లు బయటకు తీసుకువస్తానని, వాటిని అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని చెప్పింది. పేపర్లు చేజిక్కిన తర్వాత భర్త లవడ్యావత్ డాక్యా, రాజేశ్వర్‌లతో కలిసి ప్రధానంగా తమ సామాజిక వర్గం వారికే విక్రయించాలని నిర్ణయించుకుంది. నీలేష్, గోపాల్‌లకు అమ్మడానికి సిద్ధమై ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. అయితే వాళ్లు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు వారి నుంచి తీసుకున్న రూ.15 లక్షల్లో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచి్చంది.
48 మందితో అసభ్య చాటింగ్.. ఫొటోల షేరింగ్
కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దాన్ని ఆన్‌లైన్‌లో నింపే క్రమంలో పొరపాట్లు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కమిషన్ నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతూ ఉంటాయి. వీటిని సరి చేసుకోవడానికి అనేక మంది అభ్యర్థులు, అభ్యర్థినులు టీఎస్‌పీఎస్సీకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో యువతులు, మహిళలకు సహాయపడే ప్రవీణ్.. ఆపై వారిని ట్రాప్ చేసి లోబర్చుకునేవాడని తెలుస్తోంది. దాదాపు 48 మందితో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం చేశాడని ప్రవీణ్ ఫోన్‌ను విశ్లేషించిన సైబర్ నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రేణుక కూడా ప్రవీణ్‌కు గురుకుల పరీక్షల నేపథ్యంలో పరిచయమైంది. 2018లో గురుకులాల్లో హిందీ టీచర్ పోస్టుకు ఆమె దరఖాస్తు చేసుకుంది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కమిషన్‌కు వచ్చిన ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. పరీక్ష సమస్య పరిష్కారం కాగా.. పరిచయం కాస్తా సన్నిహిత సంబంధం వరకు వెళ్లింది. వీళ్లు కొన్ని వ్యక్తిగత ఫొటోలను కూడా షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో రేణుక గురుకుల పరీక్షలో క్వాలిఫై కావడంలోనూ లీకేజీ వ్యవహారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరుస సెలవులు.. మరిన్ని అనుమానాలు
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 2018 నుంచి పనిచేస్తున్న రేణుక..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సెలవులు తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఏఈ పరీక్ష ఈ నెల 5న జరగగా.. నాలుగో తేదీన సెలవు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐదో తేదీ ఆదివారం కాగా.. బంధువులు చనిపోయారని ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సెలవులో ఉన్నట్లు ఆమె సహోపాధ్యాయులు తెలిపారు. మరోవైపు గ్రూప్–1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరగగా.. నవంబర్‌లో 12 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యింది. 14 రోజులు మెడికల్ లీవ్ పెట్టినట్లు సిబ్బంది తెలిపారు. ఇప్పుడు, అప్పుడు పరీక్షల తర్వాత వరుస సెలవులు పెట్టిన క్రమంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో 13 మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment