The Time Of Group Exams Comes To An End But The Exam Was Written By Students - Sakshi
Sakshi News home page

సమయం దాటినా గ్రూప్‌-1 పరీక్ష రాయించి గోప్యంగా ఉంచారు..అసలేం జరిగింది?

Published Fri, Oct 21 2022 9:41 AM | Last Updated on Fri, Oct 21 2022 10:28 AM

he Time Of Groups Exam Comes To An End But the Exam Was written By Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పబ్లిక్‌ పరీక్షలు, ఉద్యో గాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు ఏవైనా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్నింటికైతే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి రానివ్వరు. ఇక నిర్ణీత సమయం అయిపోయిందంటే.. జవాబు పత్రాన్ని లాక్కుని మరీ బయటికి పంపేస్తారు. కానీ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చేపట్టిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఒక కేంద్రంలో ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించిన విషయం కలకలం రేపుతోంది. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏం జరిగింది? 
హైదరాబాద్‌లోని లాలాపేట్‌ శాంతినగర్‌లో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను ఆలస్యంగా నిర్వహించారు. ఈ నెల 16న ప్రిలిమ్స్‌ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగాల్సి ఉంటే.. ఈ సెంటర్‌లోని మూడు గదుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3:30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్టు వెల్లడైంది. పరీ„ý కేంద్రంలోకి అభ్యర్థులందరినీ సకాలంలో అనుమతించామని.. పరీక్ష సమయం ప్రారంభం కాగానే ప్రశ్నపత్రాలు అందజేశామని అధికారులు చెబుతున్నారు. 3 గదుల్లో మాత్రం ఇంగ్లిష్‌–తెలుగు ప్రశ్నపత్రానికి బదులుగా ఇంగ్లిష్‌ –ఉ ర్దూ పేపర్‌ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన కు దిగారని.. దీనితో ఆలస్యమైందని అంటున్నారు. తిరిగి అభ్యర్ధులకు కొత్త ప్రశ్నపత్రం, కొత్త ఓఎంఆర్‌ షీట్‌తోపాటు అదనపు సమ యం ఇచ్చి పరీక్ష రాయించినట్టు వివరిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీ అధికారులు గోప్యంగా ఉంచడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆలస్యం వాస్తవమే: పరీక్షల అదనపు కో–ఆర్డినేటింగ్‌ అధికారి 
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో ప్రిలిమ్స్‌ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం వాస్తవమేనని హైదరాబాద్‌ జిల్లా గ్రూప్‌–1 పరీక్షల అడిషనల్‌ కో–ఆర్టినేటింగ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మూడు గదుల్లోని 47 మంది అభ్యర్థులకు తెలుగు–ఇంగ్లిష్‌ ద్విభాషా ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్, ఇతర భాష ల్లో (తెలుగు కాకుండా) ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్లు పంపిణీ చేశారని తెలిపారు. తర్వాత తప్పిదాన్ని గుర్తించి.. తెలుగు–ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలను ఇచ్చారని వివరించారు.

కానీ అభ్యర్థులు చాలాసేపు ఆందోళన చేశారని.. తమ జవాబుపత్రాలు చెల్లుబాటు అవుతాయనే అపోహతో ప్రశ్నపత్రం సెట్‌ తీసుకోవడానికి నిరాకరించారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి నచ్చజెప్పడంతో.. మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష రాయడం ప్రారంభించారన్నారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్ష పూర్తయ్యేదాకా సెంటర్‌లోనే ఉన్నారని తెలిపారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇదే తరహా కారణాలతో ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, ఐదుగురు అభ్యర్ధులకు 30 నిమిషాలు.. అబిడ్స్‌ లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాలలో 15 మంది అభ్యర్థులకు 7 నిమిషాలు అదనపు సమయమిచ్చామని వివరించారు. పరీక్షకేంద్రంలో అవకతవకలు జరగలేదని, టీఎస్‌పీఎస్సీతో సంప్రదింపుల మేరకే అదనపు సమయం ఇచ్చామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి: ఏఐవైఎఫ్‌ 
గ్రూప్‌–1 పరీక్షను నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని, తక్షణమే సిట్టింగ్‌ జడ్జితో విచారణ నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

నిర్లక్ష్యంపై విచారణ జరపాలి: ఏఐఎస్‌ఎఫ్‌ 
గ్రూప్‌–1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిబంధ నల ప్రకారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించాలనీ, కానీ హైదరా బాద్‌ లాలాపేట్, శాంతినగర్‌లోని ఎస్‌ఎఫ్‌ ఎస్‌ (సెయింట్, ఫ్రాన్సిస్‌ డీ సేల్స్‌) హైస్కూ ల్‌ పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణి కంఠరెడ్డి, లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు. ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్లపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement