సాక్షి, అమరావతి: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు నచ్చిన, అనుకూలురైన అభ్యర్థులను నియమించుకునేందుకు టీడీపీ సర్కారు సిద్ధమైంది! డిప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–3 , సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తదితర గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేసి ఇంటర్వ్యూ మార్కులను కూడా పెంచడం ద్వారా దీన్ని ‘మేనేజ్’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా సర్కారీ కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ రూ.లక్షలు పోసి శిక్షణ పొందుతున్న అభ్యర్థుల ఆశలు గల్లంతు కానున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల శిక్షణ విధానం పూర్తిగా భిన్నంగా ఉండటంతోపాటు ఇంటర్వ్యూ మార్కుల్లో తేడా వల్ల అభ్యర్థుల జాతకాలే మారిపోనున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లోకి మళ్లించేందుకు ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలపై నిరుద్యోగ యువత తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 నియామకాల్లో అర్హులైన అభ్యర్ధులకు దక్కాల్సిన పోస్టులను ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు కేటాయించడం ద్వారా ఇతరులకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తమ ప్రణాళిక అమలయ్యేలా సర్కారు పెద్దలు పావులు కదుపుతున్నారు.
ఆబ్జెక్టివ్‌కు బదులుగా వ్యాసరూప ప్రశ్నలు
గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్ధులు శిక్షణ కోసం గత కొన్నేళ్లుగా రూ.లక్షలు వెచ్చించి సన్నద్ధమవుతున్నారు. ఇక గ్రూప్–1 పరీక్షలు రాసేది 5 వేల మందికి లోపే ఉన్నారు. గ్రూప్–2 పరీక్షలకు ఇప్పటివరకు ఆబ్జెక్టివ్ తరహాలో సిద్ధం అవుతున్న అభ్యర్థులకు సర్కారు తాజా ఆలోచనలు కలవరం కలిగిస్తున్నాయి. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేస్తే ఆబ్జెక్టివ్‌కు బదులుగా డిస్క్రిప్టివ్ (వ్యాస రూప) పరీక్షలను రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ మార్కులు 50కి బదులుగా 75కి పెరుగుతాయి. దీనివల్ల ఇన్నాళ్లూ తాము పొందిన శిక్షణ అంతా వృథాగా మారటంతోపాటు అక్రమాలకు ఎక్కువ ఆస్కారముంటుందని ఆందోళన చెందుతున్నారు.
సత్యనారాయణ కమిటీ సిఫార్సులు తుంగలోకి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సత్యనారాయణ కమిటీ గ్రూప్–1 కేడర్ పోస్టులకు మినహా తక్కిన గ్రూపుల్లోని పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించి కేవలం రాతపరీక్షల ద్వారానే ఎంపికలు చేయాలని 2011లో సిఫార్సు చేసింది. కమిటీ నివేదికను ఆమోదించిన అప్పటి ప్రభుత్వం గ్రూప్–2 పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించింది. కానీ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 622, 623 జీవోలను తెచ్చి గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ టీడీపీ సర్కారు గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో విలీనం చేయాలని భావిస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మినహా ఇతర కేడర్లలోని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ ఇదే విధానం వర్తింప చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా యోచిస్తోంది.
గ్రూప్–2లోనే ఎక్కువ పోస్టులు
2016 గ్రూప్–2లో 982 పోస్టులు (ఇందులో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు) ప్రకటించగా గ్రూప్–1లో 78 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రూప్–2లో ఆబ్జెక్టివ్ పరీక్షలతోపాటు వాటిలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గ్రూప్–1లో డిస్క్రిప్టివ్ పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు 75 మార్కులకు ఉంటాయి. డిస్క్రిప్టివ్ మూల్యాంకనంపై ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.
ఇంటర్వ్యూల తరువాత తలరాతలు తారుమారు
ఇంటర్వ్యూల్లో కూడా అర్హులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇటీవల డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గ్రూప్–1 నియామకాలపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో అతి తక్కువ మార్కులు రావటంతో అభ్యర్ధుల తలరాతలు తారుమారయ్యాయి. ఇంటర్వ్యూల్లో గరిష్ఠ మార్కులను నిర్దిష్ట శాతానికి పరిమితం చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని విధివిధానాలను పాటిస్తోంది. ఏపీపీఎస్సీ అలా చేయడం లేదు. కొందరికి 15 శాతం మార్కులే వస్తే మరికొందరికి 80 – 95 శాతం వరకు మార్కులు కేటాయిస్తున్నారు. ఫలితంగా రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులు ఇంటర్వ్యూల తరువాత అట్టడుగుకు పడిపోయి పోస్టులు కోల్పోతున్నారు.
కేసులు, ఆందోళనకు దిగితే మార్కులకు కత్తెర!
ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు, తప్పులను సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసినా, ఆందోళనకు దిగినా అలాంటి వారికి రాతపరీక్షల మూల్యాంకనం, ఇంటర్వ్యూలలో కత్తెర వేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2016 గ్రూప్–2 పరీక్షల్లో గందరగోళం చెలరేగిందని ఆందోళనకు దిగిన తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇటీవల గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి కేసులు వేసిన ఏడుగురిని ఇంటర్వ్యూల్లో ఫెయిల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
బోర్డు కూర్పుపైనా విమర్శలు
గతంలో ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్‌లోని అందరు సభ్యులతోపాటు ప్రభుత్వం సూచించిన ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒకరు, సబ్జెక్టు నిపుణులు కొందరు ఉండేవారు. రోజుకొకరు ఇంటర్వ్యూ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. అభ్యర్థులకు తుది మార్కులు ఖరారు చేసేది బోర్డు ఛైర్మనే. కానీ ప్రస్తుత కమిషన్‌లో దీన్ని పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఇంటర్వ్యూలన్నిటిలో బోర్డు ఛైర్మన్ ప్రతిరోజూ తప్పకుండా ఉండడమే కాకుండా ఇంటర్వ్యూ బోర్డులన్నిటికీ ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఇతర సభ్యుల్లో రోజుకొకరికి మాత్రమే అవకాశమిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా ఇది కమిషన్ బోర్డు సభ్యుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు వేసే మార్కుల మధ్య వ్యత్యాసం 5 మార్కులకు మించి ఉండరాదన్న నియమం గతంలో ఉండేది. కానీ ప్రస్తుత బోర్డులో ఇది లేదన్న విమర్శ ఉంది. పైగా ఏ సభ్యుడు ఎన్ని మార్కులు వేసినా చివరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వారే ఫైనల్ మార్కులను నిర్ణయిస్తుండడంతో అభ్యర్థుల తలరాతలు మారిపోతున్నాయి.
పోస్టుల విలీనానికి ఏపీపీఎస్సీ చెబుతున్న కారణాలు ఇవీ
– ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సరైన అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు అవసరం.
– గ్రూప్–2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారు గ్రూప్–1 పోస్టులకు కూడా ఎంపికవుతున్నందున ఆ పోస్టులు చివరకు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దీన్ని నివారించేందుకే కొత్త పద్ధతి తెస్తున్నామని ఏపీపీఎస్సీ చెబుతోంది.
ఎంపికను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే!
– ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోస్టుల విలీనం ప్రయత్నాల వెనుక కారణాలు వేరే ఉన్నాయని విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
– గ్రూప్–1లో పోస్టుల సంఖ్య పరిమితంగా ఉంటాయి. గ్రూప్–2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి గ్రూప్–1ఏ, 1బీగా చేయడం ద్వారా తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment