సాక్షి, అమరావతి: గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేందుకు సింగిల్ జడ్జి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు సోమవారం తన తీర్పును వాయిదా వేసింది. ఇదే సమయంలో గ్రూప్–1 ప్రశ్నపత్రం రూపకల్పన విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) తీరును హైకోర్టు తప్పుపట్టింది. అభ్యర్థుల భవిష్యత్తు గురిం చి ఏ మాత్రం పట్టించుకోరా అంటూ నిలదీసింది. ప్రశ్నపత్నంలో 50కి పైగా తప్పులు ఏమిటంటూ అడిగింది. పరీక్షలు నిర్వహించేది ఇలాగేనా అంటూ ప్రశ్నించింది. ఇంగ్లిష్ లో ఉన్న ప్రశ్నలను తెలుగులోకి సక్రమంగా అనువదించేందుకు అవసరమైన సామర్థ్యం కమిషన్‌కు లేదా అంటూ నిలదీసింది. నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది.
ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నల్లో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని, అందువల్ల పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని కోరారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, పరీక్ష తిరిగి నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపించారు. ఏపీపీఎస్‌సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తప్పులున్న ప్రశ్నలకు అభ్యర్థులందరికీ సమానంగా మార్కులిచ్చామన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పరీక్షలు నిర్వహించడం ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేసింది.
పరీక్ష నిర్వహించేది ఇలానేనా?
Published Tue, Feb 9 2021 5:19 AM | Last Updated on Tue, Feb 9 2021 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment