ఏపీపీఎస్సీ రూటే సపరేటు! | There are many doubts over recent Group1 Prelims | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ రూటే సపరేటు!

Published Sat, Jun 8 2019 3:57 AM | Last Updated on Sat, Jun 8 2019 3:57 AM

There are many doubts over recent Group1 Prelims - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న వివిధ పోస్టుల భర్తీ పరీక్షల్లో నెలకొంటున్న లోపాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ పరీక్షల కోసం లక్షలు వెచ్చించి ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటున్న వారు ఏపీపీఎస్సీ తీరుపై ఆందోళనకు గురవుతున్నారు. లోపాలు సరిదిద్దేబదులు వాటిని ప్రశ్నించే వారిపై వేధింపులు, ఇతర చర్యలకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ 2016లో 32 నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షల్లో నెలకొన్న పలు లోపాల కారణంగా పలు న్యాయ వివాదాలు ఏర్పడి నియామక ప్రక్రియ సజావుగా ముందుకు సాగలేదు. మళ్లీ ఇటీవల మరో 30 వరకు నోటిఫికేషన్లు ఇచ్చింది. నియామక నిబంధనలను, సిలబస్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుండడంతో అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదివిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకపక్క ప్రామాణిక గ్రంధాలు లేక తప్పనిస్థితిలో కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోపక్క ఎంతో కాలం గడవకుండానే మొదటి నోటిఫికేషన్ల సమయంలో ఉన్న నిబంధనలు, సిలబస్‌ను ఏపీపీఎస్సీ మార్పు చేసింది. 

కరెంట్‌ అకౌంట్‌ సర్‌ప్లస్‌ అంటే అధిక విద్యుత్‌ సరఫరా
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పలు పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాల ఆప్షన్లు తప్పుల తడకగా ఉంటున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలుగు అనువాద ప్రశ్నలు అర్థంపర్థం లేని రీతిలో ఉంటూ తెలుగు మాధ్యమ అభ్యర్థులను తికమకకు గురి చేస్తున్నాయి. ఇటీవల గ్రూప్‌1లో ఆంగ్లంలోని ప్రశ్నలు, సమాధానాలకు.. తెలుగు అనువాదాలు ఇలా ఉన్నాయి..
- కరెంట్‌ అకౌంట్‌ సర్‌ప్లస్‌ అనే పదానికి తెలుగు అనువాదంలో అధిక విద్యుత్‌ సరఫరా అని ఇచ్చారు.
‘ద ప్రయాంబుల్‌ మే బి ఇన్వోక్‌డ్‌ టు డిటర్‌మైన్‌ ద యాంబిట్‌ ఆఫ్‌ అనే వాక్యానికి ప్రవేశిక ఆంబిట్‌ యొక్క ఇన్వోక్‌ గుర్తించడానికి’ అని పేర్కొన్నారు. 
రెడ్యూస్‌ ద అమౌంట్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ వితవుట్‌ ఛేంజింగ్‌ ఇట్స్‌ కేరక్టర్‌ అనే దానికి ‘వాక్యాల గుణాన్ని మార్చకుండా వాక్యాన్ని కుదిస్తుంది’ అని ఇచ్చారు.
సబ్‌స్టిట్యూట్‌ వన్‌ ఫ్రమ్‌ ఆఫ్‌ పనిష్మెంట్‌ ఫర్‌ అదర్‌ ఆఫ్‌ ఏ లైటర్‌ కేరెక్టర్‌ అనే దానికి ‘ఒక రూపానున్న దండనను లైటర్‌ గుణంగా మారుస్తుంది’ అని పేర్కొన్నారు.
ఏ స్టే ఆఫ్‌ ఎగ్జిక్యూషన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ అనే దానికి ‘దండనను ఎక్సిక్యూట్‌ చేయడానికి స్టే’ అని ఇచ్చారు.
చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకు ‘హైకోర్టు జడ్జి’ అని ఇచ్చారు.
ప్రొవైడింగ్‌ ఇరిగేషనల్‌ ఫెసిలిటీస్‌ అనే దానికి ‘వ్యవసాయ సంబంధిత వనరులను కల్పించడం’ అన్నారు. 
ఏ కంట్రీ విత్‌ ఏ క్రూడ్‌ బర్త్‌ రేట్‌ అనే దానికి ‘ఒకదేశ ముడి ద పుట్టిన రేటు’గా అనువదించారు.
ఏ క్రూడ్‌ డెత్‌ రేట్‌ను ‘ముడి గిట్టుక రేటు’ అని పేర్కొన్నారు.
సెర్చ్‌ ఆఫ్‌ సిగ్నేచర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అనేదానిని ‘మానవ జీవిత రేఖలను గురించి తెలుసుకోవడానికి’ అని ఇచ్చారు.
ఇలా చూస్తే 36 ప్రశ్నల్లో ఇలాంటి అనువాద లోపాలు తెలుగు మాధ్యమం అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఆయా ప్రశ్నలను గూగుల్‌ ట్రాన్సలేట్‌లో యధాతథంగా పెట్టి అనువదించినందున ఇలా వచ్చినట్లున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాల అనువాదాలు కూడా తప్పుగా ఉన్నాయని తెలిపారు. వీటికి ఏ సమాధానలు గుర్తించాలో అర్థం కాక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. పైగా నెగిటివ్‌ మార్కులుండడంతో తెలుగు మాధ్యమ విద్యార్థులు ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు వెళ్లడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మక్కీకి మక్కీ కాపీ 
ఏపీపీఎస్సీ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులకు 2017లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన 11 ప్రశ్నలు సమాధానాల ఆప్షన్లతో సహా ఎలాంటి మార్పు లేకుండా యధాతథంగా అదే వరుసలో ఇప్పుడు అడిగారని అభ్యర్థులు చెబుతున్నారు. ఆ ప్రశ్నలను మక్కీకి మక్కీ కాపీ చేసినట్లుగా చెబుతున్నారు. అంతే కాకుండా జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నల్లో ‘జీకే యాప్‌’లోని ప్రశ్నలు, వాటి సమాధానాలను యధాతథంగా కాపీ చేసి ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు సివిల్స్‌లోని పాత పేపర్ల నుంచి కాపీ చేసి పెట్టారని చెబుతున్నారు. గ్రూప్‌1 వంటి పరీక్షలకు ప్రశ్నలను ఇలా ఇవ్వడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

ఏది సరైన సమాధానమో సందిగ్థమే
ఏపీపీఎస్సీ సిలబస్, పరీక్ష విధానంలో తరచూ మార్పులు చేస్తుండడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. గ్రూప్‌1, గ్రూప్‌2 సిలబస్‌ను ఏడాది తిరగకుండానే మార్పు చేశారని, పైగా ప్రామాణిక గ్రంధాలను పేర్కొనకపోవడంతో దేన్ని అనుసరించి తాము పరీక్షలకు సన్నద్ధం కావాలో అర్థం కాకుండాపోతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్‌సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ వంటి ప్రభుత్వ సంస్థల ఆదేశాలతో రూపొందించే పాఠ్యపుస్తకాలను, లేదా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన గణాంకాలను తాము అనుసరించి సమాధానాలు రాస్తే వాటిని ఏపీపీఎస్సీ కొన్ని సందర్భాల్లో తప్పుగా పేర్కొంటూ నష్టం చేస్తోంది. పైగా సిలబస్‌కు అనుగుణమైన ప్రామాణిక పుస్తకాలు ఆంగ్లంలో అందుబాటులో ఉండడం లేదు. తెలుగులో అయితే అసలు లేనేలేవు. తెలుగు అకాడమి పుస్తకాలు గతంలో అందుబాటులో ఉండేవి. ప్రభుత్వం దాన్ని ఏపీలో ఏర్పాటు చేయకపోవడంతో అకాడమి పుస్తకాలు రావడం లేదు. చివరకు నిరుద్యోగులంతా కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించేలా చేస్తున్నార’ని  వాపోతున్నారు.

ఇంటర్వ్యూల్లోనూ అదే తీరు
ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ ఇంటర్వ్యూల తీరుపైనా పలు విమర్శలు గతంలో వచ్చాయి. కొందరికి గరిష్ఠ మార్కులు, మరికొందరికి అతి తక్కువ మార్కులు వేస్తున్నారని, దీనివల్ల రాత పరీక్షల్లో మెరిట్‌లో ఉన్న వారు ఇంటర్వ్యూల్లో మార్కులు రాక ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. గతంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టుల ఇంటర్వ్యూలు, గ్రూప్‌1 ఇంటర్వ్యూల్లో ఇదే రీతిన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండగా కొందరికి 70 వరకు, మరికొందరికి   కేవలం 15 నుంచి 20 మార్కులతో సరిపెడుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ కొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలను కేవలం ఆంగ్లంలోనే నిర్వహిస్తామని పేర్కొనడం గ్రామీణ తెలుగు మాధ్యమం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో తలెత్తే లోపాలను ప్రశ్నించినా, వాటిపై న్యాయస్థానాల్లో సవాలు చేసినా, సోషల్‌ మీడియాలో ఇతరులకు పంపినా వేధింపులు ఎదురవుతున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇలా కేసులు వేసిన వారి జాబితాను రూపొందించి వారు ప్రభుత్వ పోస్టులకు ఎంపికవ్వకుండా చేస్తున్నారని చెబుతున్నారు. గ్రూప్‌1 పరీక్షల్లో మెరిట్‌లో ఉండి కోర్టులో కేసు వేసిన ఒక అభ్యర్థికి పోస్టు రాకుండా చేశారని, దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేశారని గుర్తు చేస్తున్నారు.   

అన్నింటికీ ప్రిలిమ్స్‌..
గ్రూప్‌1 మినహా తక్కిన పోస్టుల భర్తీ పరీక్షలకు గతంలో ప్రిలిమ్స్‌ లేదు. కానీ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్‌ను అన్నిటికీ అమలు చేస్తోంది. మొదట్లో 25 వేలకు మించి దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్‌ నిర్వహించాలన్న నిబంధన ఉండగా, దాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం ఎత్తేసి పూర్తిగా ఏపీపీఎస్సీ నిర్ణయాధికారానికి వదిలేసింది. మరోవైపు ఆయా పోస్టులకు ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే విధానం అమల్లో ఉండేది. కొద్ది కాలం క్రితం దాన్ని కూడా మార్పు చేశారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ఏ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలో ఏపీపీఎస్సీయే నిర్ణయించుకొనేలా ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టింది. ఈ తతంగం వెనుక కుట్ర దాగి ఉందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న అంశాన్ని ముందుగా తేల్చకపోవడంపైనా విమర్శలున్నాయి. పైగా ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యేటప్పుడు రిజర్వేషన్‌ను వినియోగించుకుంటే వారు మెరిట్‌లో ఉన్నా అదే కేటగిరీకి పరిమితమయ్యేలా ఏపీపీఎస్సీ మార్పు చేయడంపైనా ఆయా వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. నోటిఫికేషన్లో పేర్కొనకుండా తర్వాత ఇష్టానుసారంగా మార్పులు చేస్తోందని అభ్యర్థులు ధ్వజమెత్తుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement