రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టం రూపకల్పన కోసం సూచనలు, సలహాలు అందించేందుకు మంత్రు ల బృందాన్ని ఏర్పాటుచేస్తూ రాష్ర్ట ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి జీవో జారీచేశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, వి సునీతాలకా్ష్మరెడ్డి మంత్రుల బృందంలో ఉన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంత్రుల బృందానికి సహకారం అందిస్తారు. మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ కేసులో 2006 సెప్టెంబర్ 22వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘పోలీసు యాక్టు-2013’ను పోలీసుశాఖ సిద్ధంచేసిం ది. మొత్తం 8 చాప్టర్లు, 121 ఉప చాప్టర్లతో సుమారు 150 పేజీలున్న ‘పోలీసు యాక్టు-2013’ను ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మూడు పోలీసు చట్టాల స్థానంలో ఒకే చట్టాన్ని రూపొందించారు. పోలీసుశాఖ రూపొందించిన ‘యాక్టు-2013’ బిల్లును ‘సాక్షి’ సంపాదించింది. అందులోని ప్రధానమైన అంశాలివే...
డీజీపీకి చట్టబద్ధంగా రెండేళ్ల పదవీకాలం
రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా నియమితులైనవారు సర్వీసుతో సంబంధంలేకుండా కచ్చితంగా రెండేళ్లపాటు కొనసాగేవిధంగా చట్టంలో పొందుపరిచారు. జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)లను రెండేళ్ల తరువాత మాత్రమే బదిలీ చేసేవిధంగా పేర్కొన్నారు. వారిపై తీవ్రమైన ఆరోపణలు, పనిలో అసమర్థత ఉన్న సమయంలో మాత్రమే రెండేళ్లకన్నా ముందుగా వారిని బదిలీచేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చైర్మన్‌గా పోలీసు ఫిర్యాదుల విభాగంను కూడా చట్టబద్ధంచేశారు. జిల్లా స్థాయి విభాగంలో రిటైర్డు జిల్లా జడ్జి చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో పీసీఏను ఏర్పాటుచేస్తారు. హత్య, అత్యాచారం, అధికార దుర్వినియోగం తదితర నేరాలకు పాల్పడిన పోలీసులపై పీసీఏ విచారణ జరుపుతుంది. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే, అధికారిపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. పదిలక్షలకన్నా అధికంగా జనాభా కలిగిన పట్టణ ప్రాంతాలలో సివిల్, దర్యాప్తు విభాగాలు వేర్వేరుగా పనిచేయనున్నాయి. రాష్ర్ట హోంమంత్రి చైర్మన్‌గా... ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఐదుగురు స్వతంత్ర సభ్యులతో రాష్ట్ర భద్రతా కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. పోలీసు చట్టంలో ఎస్‌ఎస్‌సీకి కూడా స్థానం కల్పించారు. బదిలీలు, పదోన్నతులన్నీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ద్వారానే జరిగే విధంగా చట్టంలో నిబంధన పొందుపరిచారు. మంత్రుల బృందం సూచనల తర్వాత పోలీసు నూతన చట్టం ముసాయిదా బిల్లును ప్రభుత్వం శాసనసభ ఆమోదానికి పంపనుంది. అసెంబ్లీలో బిల్లుపెట్టే పరిస్థితి ప్రస్తుతానికి లేకుంటే ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
సమాజ భద్రత విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం నియమిస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(ఎస్పీవో)ల నియామకానికి సంబంధించి కూడా కచ్చితమైన మార్గదర్శకాలను పొందుపరిచారు. రిటైర్డు పోలీసులు, మిలటరీ సిబ్బందిని మాత్రమే ఎస్పీవోలుగా తీసుకోవాలని స్పష్టంచేశారు.