కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రెండురోజుల జిల్లా పర్యటన గ్రూపుల మధ్య చిచ్చును మరింత రాజేసింది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు ఆమె పర్యటనకు అడ్డంకులు కలిగించడం.. అదే స్థాయిలో రేణుకతో పాటు ఆమె వర్గీయులు మంత్రి అనుచరులుపై మండిపడడంతో కాంగ్రెస్ పరువు బజారున పడింది. తాజా పరిణామాలతో సై అంటే సై అంటూ ఎక్కడికక్కడ వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నారు.
వరుస ఎదురుదెబ్బలు తగులుతుండడంతో...జిల్లాలో తన ప్రాబల్యం చాటుకునేందుకు రేణుకాచౌదరి భద్రాచలం జైత్రయాత్ర పేరుతో పర్యటించగా...పార్టీ కేడర్ నుంచి స్పందన అంతంతమాత్రంగా వచ్చింది. ఆమె పర్యటనకు జిల్లాలో ఆపార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు వెళ్లకుండా మంత్రి ఎత్తులు వేశారని.. దీంతో ఆమె యాత్ర వెలవెలబోయిందనే చర్చ పార్టీ శ్రేణులలో నడుస్తోంది. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలన్న డిమాండ్‌తో యాత్ర చేపడితే పార్టీ నేతలెవ్వరూ రాకపోవడంపై రేణుక ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో పోలీసులు కూడా ఆమె పర్యటనకు కావాలనే అడ్డంకులు కలిగించారని రేణుక అనుచరులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పాలేరులో తన అనుచరులతో రేణుక మాట్లాడుతూ ఇలానే చేస్తే రెండు మూడు రోజుల్లో వాతలు పెట్టిస్తానని ఆగ్రహంగా మంత్రి, ఆయన అనుచరులని ఉద్దేశించి హెచ్చరించిన దానిపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది.
మంత్రి ఇలాకాలో రేణుక కుంపటి..
పర్యటనలో భాగంగా రేణుకాచౌదరి చివరగా... తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాలేరులో రూ. 15 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిరా్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక సర్పంచ్‌ను తన వర్గం నాయకురాలిగా మార్చుకోవడం, అక్కడ మంత్రికి సమాచారం లేకుండా పనులకు శంకుస్థాపన చేయడంతో..ఇటు మంత్రితో పాటు ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాలో తన ఆధిపత్యానికి మంత్రి అడ్డంకిగా మారడంతో.. కావాలనే రాంరెడ్డి నియోజకవర్గం పాలేరులో ఆమె అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారనే చర్చ జరుగుతోంది. మంత్రి ఇలాకాలోనే స్థానిక సర్పంచ్‌ను మచ్చిక చేసుకొని కుంపటి పెట్టడంతో ఆయనకు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా పాలేరు ప్రజలు ఏ సహాయం కావాలన్నా తనను ఎప్పుడైనా అడగవచ్చని ఆమె హామీలు ఇవ్వడంపై మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నేతలను తనవైపుకు తిప్పుకునే వ్యూహంలో కూడా రేణుక ఉన్నట్లు తెలిసింది.
సై అంటే సై అంటున్న నేతలు..
రేణుక పర్యటనపై మరోవైపు మంత్రి వర్గీయులు భగ్గుమన్నారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, నేతలు శీలంశెట్టి వీరభద్రం, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి సోమవారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేణుకపై నిప్పులు చెరిగారు. పార్టీలో సభ్యత్వం లేని నాయకులను వెంట తిప్పుకొని టికెట్ ఇప్పిస్తానని రేణుక చెబుతున్నారని, భద్రాచలంపై షో చేస్తే జిల్లా ప్రజలు ఆమెను తరిమికొడతారని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రేణుక పర్యటనతో జిల్లాలో జరిగిన రసాభాస విషయమై మంత్రి ఇప్పటికే తెలంగాణ మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ర్టం వస్తే మావోయిస్టులు పెరుగుతారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించడం కూడా ఆయన వారి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
సమైక్యవాదం వినిపిస్తున్న సీఎంను రేణుక సమర్థిస్తున్నారని మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. అలాగే తనపర్యటనకు మంత్రి కావాలనే అడ్డంకులు కలిగించారని.. రేణుకాచౌదరి కూడా ఆయనతో అమీతుమీ తెల్చుకునేందుకు ఈవ్యవహారం ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇలా ఇరువురు నేతల పంచాయితీ తారస్థాయికి చేరడం, వారి అనుచర గణం కూడా సై అంటే సై అనడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.