మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు | Growing sexual attacks on women | Sakshi
Sakshi News home page

మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు

Published Sun, Jan 26 2014 1:52 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు - Sakshi

మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు

  • మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు
  •  చట్టాలెన్ని ఉన్నా రక్షణ కరువు
  •  ఆగని అబలలఆర్తనాదాలు
  •  
    శశికళ (పేరు మార్చాం) డిగ్రీ చదివింది. ఇంగ్లిషులోనూ ప్రావీణ్యం సంపాదించింది. చాలా తెలివిగల అమ్మాయి. ఒక్కగానొక్క మగబిడ్డతో జీవితం సంతృప్తిగా సాగుతోంది. ఒకరోజు ఆమెను విధి వెక్కిరించింది. భర్త చనిపోయాడు. మానసికంగా వేదనకు గురైంది. ఏం చేయాలో అర్థంకాలేదు. బిడ్డను తీసుకుని తిరుపతి వెళ్లింది. అక్కడ బస్టాండులో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడ్ని నమ్మింది. ఆ ప్రబుద్ధుడు ఆమెపై లైంగికదాడి చేసి పిల్లాడితోసహా పారిపోయాడు. ఇప్పుడామె జీవితం ఛిద్రమైంది. ప్రభుత్వం నడిపే మహిళా హాస్టల్‌లో ఉంటోంది. బిడ్డకోసం కన్నీరుమున్నీరవుతోంది.
     
     నగరానికి చెందిన స్నేహ (పేరు మార్చాం) 15 ఏళ్ల బాలిక. తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. పరిస్థితి బాగోలేక చదువుకు స్వస్తి పలికింది.  ఓ రోజు ఇంట్లో వాళ్లు కూల్‌డ్రింక్స్ తెమ్మంటే బజారుకెళ్లింది. కూల్‌డ్రింక్స్ కొనుక్కుని వస్తుండగా తెలిసిన ఆటోడ్రైవర్ ఒకడు ఆమెను ఎక్కించుకున్నాడు. కిడ్నాప్ చేసి అతడితోపాటు మరికొందరు దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఆ పాప జీవితం కకావికలమైంది.
     
     హైదరాబాద్‌కు చెందిన ఆశాలతకు (పేరు మార్చాం) 16 ఏళ్లు ఉంటాయి. తల్లిదండ్రులు విడిపోయారు. ఏదో విషయంలో అలిగి ఇంట్లో చెప్పాపెట్టకుండా విజయవాడకు పారిపోయి వచ్చింది. కనకదుర్గ గుడికి చేరుకుంది. అక్కడ ఆమెకు ఒకడు పరిచయమయ్యాడు. మాయమాటలు చెప్పి సమీపంలో ఒక గదిలో ఉంచాడు. ఇంతలో ఆమెకు మరొకడు పరిచయమయ్యాడు. పరిచయమైన వారిద్దరూ కూడా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఐదేళ్ల చిన్నారి శ్యామల (పేరు మార్చాం)..  ఒకటో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఇంజినీరింగ్ విద్యార్థి పాపపై కన్నేశాడు. దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డాడు.
     
    సాక్షి, విజయవాడ : ఈ సంఘటనలను చూస్తుంటే భయమేస్తోంది. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల మహిళ వరకు ఎవరికీ రక్షణ లేకుండాపోయింది. నిన్నగాక మొన్న మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలో లైంగిక దాడి, హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఐదేళ్ల చిన్నారుల మొదలు 26 ఏళ్ల యువతులు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నారు. జిల్లాలో ఇటువంటి కేసులు ఏడాదికేడాది బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    2011లో జిల్లాలో 58 మందిపై లైంగికదాడి జరిగితే... 2012లో ఆ సంఖ్య 61కి చేరింది. 2013లో మహిళలపై లైంగిక దాడులు 63 జరిగాయి.  పరువు పేరుతో బయటకు రాని కేసులు ఇంతకు నాలుగైదింతలు ఉండొచ్చని అంచనా. చదువుకునే బాలికలు, వివిధ దుకాణాల్లో పనిచేసే అమ్మాయిలు, షిఫ్టుల ప్రకారం రాత్రి వేళల్లో పనిచేసేవారు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒంటరిగా నివసించేవారు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నారు.

    అంతేకాదు తల్లిదండ్రులు స్వేచ్ఛ పేరుతో పిల్లలపట్ల గారాబం చేయడం, సెల్‌ఫోన్లు ఇవ్వడం, ‘మా వాడికి గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ’ వాడిని రెచ్చగొట్టడం, నైతిక విలువలు చెప్పకపోవడం, పాఠశాలల్లో అసభ్యకరమైన పాటలకు డ్యాన్సులు చేయించడం, సినిమాల్లో ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం.. ఇలా అనేక కారణాలు ప్రస్తుత పరిస్థితికి దారితీస్తున్నాయని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కె.కృష్ణకుమారి అభిప్రాయపడుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో అనేక ఆకర్షణలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.
     
    ముందుజాగ్రత్తలు అవసరం..
     
    సమాజంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా తల్లిదండ్రులు తమ అమ్మాయిలు, అబ్బాయిలకు హితబోధ చేస్తున్న పరిస్థితి లేదు. ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్ళే అమ్మాయిలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణకుమారి అంటున్నారు. రాత్రి వేళ లేదా తెల్లవారుజామున రైలు లేదా బస్సు దిగాక ఆటో లేదా క్యాబ్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.  
     
    ఆసరా...

    లైంగికదాడులకు గురైన మహిళలు, బాలికలకు స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆసరా కల్పిస్తోంది. రేప్‌కు గురైన మహిళకు రూ. లక్ష, లైంగిక దాడికి యత్నం జరిగితే రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం ఇస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఇస్తోంది. 2013లో లైంగిక దాడికి, యత్నానికి గురైన వారికి మాత్రం పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావాల్సి ఉంది. 2012 సంవత్సరంలో రూ. 19 లక్షలు ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని బాధితులకు అందజేసింది. అంతేగాకుండా లైంగిక దాడికి గురై ఎక్కడా ఆసరాలేని మహిళలకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆసరా ఇస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement