చరిత్రాత్మకం
మా బిడ్డే దీక్ష చేస్తున్నాడంటూ తల్లులు.. మా తమ్ముడే దీక్షలో ఉన్నాడంటూ అక్కలు.. మా అన్నే ఉద్యమం చేపట్టాడంటూ యువతరం.. మా మనవడే మహోద్యమం చేస్తున్నాడంటూ వృద్ధులు.. మా ఉద్యోగాల కోసమే నిరశన చేపట్టాడంటూ నిరుద్యోగులు.. మా బతుకుల బాగు కోసమే కూర్చున్నాడంటూ కూలీలు, కార్మికులు.. మాకు రాయితీలు కల్పించేందుకే అంటూ పారిశ్రామికవేత్తలు.. సాగు జలాల సాధన కోసమే అంటూ కర్షకులు.. సాఫ్ట్‌వేర్ రంగం కోసమే అంటూ ఐటీ రంగ విద్యార్థులు.. ఏ పల్లె చూసినా..
ఏ పట్టణం చూసినా.. ఏ నగరం చూసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష పైనే చర్చ.. మనకోసమే నంటూ హోదా సాధనలో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.. జననేత దీక్షా శిబిరానికి పోటెత్తుతున్నారు.. ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు.. రేపటితరానికి వారధిలా నిలుస్తున్నారు.. మహోజ్వల భవితకు నాంది పలుకుతున్నారు..
* ప్రత్యేక హోదాపైనే సర్వత్రా చర్చ
* జగన్ దీక్షకు వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు
* కదలివస్తున్న ప్రజాసంఘాలు,వివిధ పార్టీల నేతలు
* నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణుల ర్యాలీలు
* దీక్షాశిబిరంలో ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ‘ప్రత్యేక హోదా- ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. శనివారానికి ఆయన దీక్ష నాలుగో రోజుకు చేరుకోవడంతో ప్రతి ఇల్లూ, గ్రామం, తరగతి గది, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రత్యేక హోదాపై చర్చ నడుస్తోంది. హోదా వల్ల కలిగే ప్రయోజనాలు, హోదా సాధనకు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షపై చర్చ జరుగుతోంది.
‘దీక్షకు వెళదాం- మద్దతు పలుకుదాం’అనే అభిప్రాయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని నల్లపాడు రోడ్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన జగన్ దీక్షా శిబిరానికి భారీగా తరలివస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉదయం నియోజకవర్గాల్లో వంటా-వార్పు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి సాయంత్రానికి శిబిరానికి చేరుకుంటున్నారు. మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శిబిరంలో జగన్‌ను కలసి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం...
జగన్‌కు సంఘీభావం తెలుపుతూ శనివారం ముఖ్య ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తరలివచ్చారు. ప్రధానంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.రాధాకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.నళినీకాంత్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పీవీ రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.భగవాన్‌దాస్, మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు తదితరులు జగన్‌ను కలసి తమ సంఘీభావం తెలిపారు.
సోమవారం నుంచి కోర్టు విధుల బహిష్కరణ..
గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించగా, జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సోమవారం నుంచి కోర్టు విధులను బహిష్కరించనున్నట్టు జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇంకా, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రామావత్ కృష్ణానాయక్, ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాలిరెడ్డి, ఇతర ప్రతినిధులు జగన్‌కు సంఘీభావం తెలిపారు.
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (డబ్ల్యుపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి జి.ఎం.జపురుల్లా, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సాహెబ్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.కె.శాస్త్రి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారావు తదితరులు కలిసి తమ మద్దతు ప్రకటించారు.
దీక్షా శిబిరంలో వైఎస్ విజయమ్మ..
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉద యం దీక్షా శిబిరానికి చేరుకుని తన కుమారుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు జగన్‌తో గడిపిన తరువాత ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగించారు. జగన్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్న సమయంలో కొందరు మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.
‘వైఎస్సార్‌సీపీ స్థాపించిన రోజు నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పా.. ఆరోజు నుంచి ఈరోజు వరకు నా కుమారుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని గొడవలు చేసినా.. మీ కోసం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఎక్కడ ఎవరు చనిపోయినా.. ఎక్కడ ఏం జరిగినా.. ప్రతి ఒక్క సందర్భంలో నా బిడ్డ మీ దగ్గరకు వస్తున్నాడు’’ అంటూ విజయమ్మ ఉద్వేగానికి లోనుకావడంతో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు.
మేళతాళాలతో ప్రదర్శనలు..
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు మేళతాళాలు, ప్రదర్శనలతో చేరుకున్నారు. రెండో శనివారం సెలవు దినం కావడంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందీ తరలి వచ్చారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ప్లకార్డులు చేబూని దీక్షా శిబిరానికి చేరుకున్నారు. భట్టిప్రోలులోని కేఎస్‌హెచ్ జూనియర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు జగన్ దీక్షకు సంఘీభావం పలికారు. రెవరెండ్ ఫాదర్ ఆంథోని పిళ్లై జగన్ ఆశయ సాధనలో విజయం చేకూరాలని ప్రార్థన చేశారు.
సడలని సంకల్పం...
నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నీరసంగా కనిపించారు. అయినా సడలని సంకల్పంతో సంఘీభావం పలకడానికి వచ్చిన వారందరినీ పేరుపేరునా పలకరించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు వచ్చినప్పుడు వారితో చర్చించారు. విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చి ఉత్సాహపరిచారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులతో మాట్లాడమే కాకుండా వారి కోరిక మేరకు ఫొటోలు దిగడానికి అవకాశం కల్పించారు.
వేసవి ఎండలను తలపించే రీతిలో ఉష్టోగ్రత ఉన్నప్పటికీ చెరగని చిరునవ్వుతో కనిపించారు. ఇదిలావుండగా, శిబిరంపై పోలీస్ నిఘా నిరంతరం కొనసాగుతోంది. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన అధికారులు ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. ముఖ్య సంఘటనలను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. శిబిరంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇతర నేతలు పాల్గొన్నారు.