హామీలు నెరవేర్చి హోదా ఇవ్వాలి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు: విభజన వల్ల అన్యాయమై పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు రెండూ అవసరమేనని, అందు కోసం అందరూ కలసి కట్టుగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పిలుపు నిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షా శిబిరాన్ని ఆమె శనివారం ఉదయం సందర్శించారు. విజయమ్మ తొలుత తన కుమారుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తరువాత ప్రసంగిస్తూ ఈ నెల 22వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి ప్రత్యేక హోదా ఇచ్చేలా పోరాటం చేయాలని అన్నారు.
ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరమని, విభజన చట్టం హామీలను అమలు చేయడం కూడా అవసరమేనని అన్నారు. ‘పార్లమెంటు చేసిన విభజన చట్టంలోనే హామీలన్నీ ఉన్నాయి. రాజధాని కూడా లేకుండా పోయి అన్యాయమైన మన రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తామని ఆరోజు చట్టంలో చెప్పారు. మెట్రోరైలు, కారిడార్లు, రైలు మార్గాల నిర్మాణం, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వంటివన్నీ చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామనీ చెప్పారు.
ఇవన్నీ అమలు చేస్తూనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆరోజు ప్రధానమంత్రి చెప్పారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడైతే పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పారు. ఆ రోజు ప్రత్యేక హోదాపై మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ పెద్దలు ఇపుడు ఏం చేస్తున్నారు? అపుడు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన ఈ పెద్దలు ఎందుకు మాట మారుస్తున్నారు? పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కులేక పోతే ఎలా?’ అని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ తప్పనిసరిగా అమలు కావాల్సిందేనని, అదే సమయంలో ప్రత్యేక హోదా కూడా ఆంధ్రుల హక్కు అని, దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని నాయకులందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో అందరూ మేల్కొనాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె అన్నారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని 70 నుంచి 80 శాతం వరకూ పూర్తి చేశారు. ఆ తరువాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య ప్రభుత్వాలు గాని, ఇపుడున్న పదిహేడు నెలల టీడీపీ ప్రభుత్వం గాని ఆ ప్రాజెక్టుల్లో ఏవీ పూర్తి చేయని పరిస్థితిని చూస్తున్నాం.
అలాంటపుడు ఉన్నవన్నీ ఎపుడు మొదలెడతారు? ఎపుడు పూర్తి చేస్తారు? హామీ ఇస్తున్న పెద్దలను కూడా ఇదే అడుగుతున్నాను’ అని విజయమ్మ అన్నారు. ‘ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి. విద్యా, ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి, ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. ఆరు కోట్ల ప్రజానీకానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి దేశాలన్నీ తిరుగుతున్నారు.’ అని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తారో చంద్రబాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇవాళ రాజధాని, రాజధాని అని తిరుగుతోందనీ, రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు? డ్వాక్రా అక్క చెల్లెళ్లు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు ఏం వాగ్దానాలు చేశాం, ఎన్ని నెరవేర్చాం అని ఆలోచించడం లేదని విజయమ్మ విమర్శించారు. విమానాశ్రయాలని, నౌకాశ్రయాలని, రాజధాని అని చెప్పి పేదల దగ్గర నుంచి వేలాది ఎకరాలు దోచేసి ప్రభుత్వం పక్కాగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తోందనీ, ఇవన్నీ ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నా కొడుకును మీ చేతుల్లో పెట్టా..
‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిననాడు ఒకటే చెప్పా..నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పా... ఆరోజు నుంచీ ఈ రోజు వరకూ కూడా నా కుమారుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని గొడవలు చేసినా భరించాం.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏం జరిగినా... ప్రతి ఒక్క సందర్భంలోనూ నా బిడ్డ మీదగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈ రోజు వైఎస్సార్‌సీపీ చేసినన్ని దీక్షలు, పోరాటాలు, ఉద్యమాలు ఏ పార్టీ కూడా చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని అభిలషించాం.
ఇది ప్రజలందరికీ మంచి జరిగే అంశం. ప్రజలకోసం అందరి తరపున పోరాడుతున్న నా బిడ్డను ఆశీర్వదించమని ఇక్కడున్న మిమ్మల్ని, యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షకు మద్దతు తెలుపుతున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అందరికీ హృదయపూర్వక అభివందనాలు తెలియ చేస్తున్నానన్నారు.
ప్రజల భవిష్యత్తు కోసమే దీక్ష..
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని నేతలు చెప్పారు. శనివారం దీక్షా వేదికపై పలువురు నేతలు ప్రసంగించారు. జగన్ చేస్తున్న దీక్ష ఆయన సీఎం అయ్యేందుకు, రాజకీయ లబ్ది కోసమో చేయడం లేదని.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలనే పవిత్రమైన కారణంతోనే దీక్ష చేపట్టారని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జగన్ ఆరోగ్యం గురించి ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పట్టడం లేదని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ విమర్శించారు.