ఆమెను పక్కన పెట్టేశారు
► గూడూరు ఇన్‌చార్జ్ జోత్స్నలతకు అవమానం
► ప్రకటనల్లో ఆమె ఫొటో పెట్టేందుకు ఇష్టపడని వైనం
► మాజీ మంత్రి, సీనియర్ నేత బల్లి దుర్గాప్రసాద్ కూడా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గూడూరు టీడీపీ ఇన్‌చార్జ్ జోత్స్నలతను ఆ పార్టీ నేతలు పక్కనపెట్టేశారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ కోసం దళిత మహిళకు అన్యాయం చేశారని ఆ సామాజికవర్గం చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పేరుచెప్పే దిక్కులేని సమయంలో జోత్స్నలత అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించేవారని మండిపడుతున్నారు. అటువంటి మహిళను టీడీపీ నేతలు కావాలనే పక్కనపెట్టారని మండిపడుతున్నారు. శుక్రవారం పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో ఆమె ఫొటో కానీ, పేరు గానీ లేకపోవటమే ఇందుకు నిదర్శనమని ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్‌ను కూడా టీడీపీ నేతలు విస్మరించారు. అతని ఫొటోగానీ, పేరు గానీ ప్రకటనల్లో కనిపించకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరినీ కనీసం మాటమాత్రానికైనా పిలువకపోవటంపై వారి వర్గీయులు మండిపడుతున్నారు. గూడూరు మున్సిపల్ చైర్మన్ దేవసేనమ్మను పార్టీకి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కొద్దిరోజుల తర్వాత ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ వర్గీయుడికి చైర్మన్ పదవి కట్టబెట్టేలా టీడీపీ నేతలు మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పటినుంచి ఆమెను కూడా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కొత్తవారి కోసం ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వారిని టీడీపీ విస్మరించటం జిల్లాలో చర్చనీయాంశమైంది. టీడీపీలో ఎప్పటికైనా తమ పరిస్థితి కూడా ఇంతేనని పాత కాపులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.