
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి వర్తింపచేసింది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తేల్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
- 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు
- మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
- వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారు అర్హులు
- 5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
- 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు
- 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
- ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ.. గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు
- కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు
- కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం