
సీటు కోసం గన్‌తో బెదిరించిన గన్‌మాన్
తిరుమల: ఇతను ఒక భాద్యత గల పోలీస్ కానిస్టేబుల్. అందులోను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రికి గన్‌మాన్ కూడా. శ్రీవారి దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. బస్సులో సీటు కోసం తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. అడ్డు చెప్పిన వారిపై గన్(కార్బెన్‌గన్)తో బెదిరించాడు. శనివారం రాత్రి తిరుమలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనూప్ కుమార్ త్రివేది(35), ఓ మంత్రి వద్ద గన్‌మాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తమిళనాడు రామేశ్వరంలో మంత్రి పర్యటన ఉండటంతో ముందుగానే అనూప్ త్రివేది అక్కడికి వచ్చాడు.
అయితే మంత్రి పర్యటన రద్దు అయింది. దీంతో తన వద్దనున్న కార్బన్‌గన్‌తో తిరుమలకు బయలుదేరాడు. టీటీడీ నిబంధనల ప్రకారం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద గన్ వివరాలు నమోదు చేసి తిరుమలకు చేరుకున్న తర్వాత వన్‌టౌన్ పీఎస్‌లో అప్పగించాడు. శ్రీవారిని దర్శించుకుని శనివారం రాత్రి 9 గంటలకు గన్‌తో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఆర్టీసీబస్టాండ్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్లకోసం ఇబ్బంది ఎదురైంది. దీంతో తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. వారు ఎదురుచెప్పడంతో గన్‌తో కాలుస్తానని బెదిరించాడు. భయపడిన తోటిప్రయాణికులు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీఎస్‌పీ అనూప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.