కురిచేడు,న్యూస్‌లైన్: నీరందక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ గుంటూరు జిల్లా రైతులు కురిచేడు ఎన్‌ఎస్‌పీ డీఈ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. తమ భూములు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు చివరిలో ఉండడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండల పరిధిలోని పాతనాగిరెడ్డి పల్లె, కొత్తనాగిరెడ్డిపల్లె, లింగమొక్కపల్లె గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు ద్విచక్రవాహనాలు,ట్రాక్టర్లపై తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను డీఈఈ షేక్ లాల్ అహ్మద్‌తో చెప్పుకున్నారు. ఐనవోలు మేజర్ పరిధిలోని చివరి భూములకు నేటికీ సక్రమంగా నీరు విడుదల కావడంలేదని చెప్పారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోక తప్పదన్నారు. ఆందోళన చేపట్టినప్పుడు మాత్రం కాస్తోకూస్తో విడుదల చేస్తూ.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదని తెలిపారు. నీటి పరిమాణాన్ని తగ్గించకుండా ఐనవోలు మేజర్‌కు కేటాయించినవిధంగా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈఈ మాట్లాడుతూ తమ జిల్లాకు ప్రధాన కాలువ ద్వారా విడుదలయ్యే నీటి కోటాను దృష్టిలో ఉంచుకొని బ్రాంచ్ కాలువలు, మేజర్లకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశానికి నిర్దేశించిన మేర జలాలు రాకపోవడంవల్లే సమస్య ఎదురవుతున్నట్లు చెప్పారు. మేజర్లకు విడుదలైన నీరు దుర్వినియోగం కాకుండా సక్రమంగా పొలాలకు చేరేవిధంగా సిబ్బంది పర్యవేక్షిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. ప్రస్తుతానికి నీటి సరఫరా పెంచాలని జేఈ శ్రీనివాసరావును ఆదేశించడంతో.. ఆయన మేజర్ హెడ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఐనవోలు మేజర్‌కు 83 క్యూసెక్కుల నీరు సరఫరా కావాల్సి ఉండగా..కేవలం 65 క్యూసెక్కులు మాత్రమే విడుదలవుతున్నాయి. వెంటనే మేజర్ షట్టర్‌ను పైకి లేపడంతో నీటి సరఫరా 80 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేసి ఆందోళన విరమించారు.
విడుదల చేయడం వరకే మా బాధ్యత: షేక్‌లాల్ అహ్మద్: డీఈఈ
ప్రధాన కాలువ ద్వారా వచ్చిన నీటిని మేజర్లకు, బ్రాంచీలకు సరఫరా చేయడమే మా బాధ్యత. అక్కడ నుంచి పంటపొలాలకు వెళుతున్నాయా లేదా? నీరు దుర్వినియోగమవుతుందా? వంటి విషయాలను గమనిం చాల్సింది వినుకొండ సబ్‌డివిజన్ అధికారులే.
ఏఈలు, డీఈఈలు ఎవరో తెలియదు: పరిమి వెంకటేశ్వర్లు: రైతు: కొత్త నాగిరెడ్డిపల్లె
మా కాలువకు సంబంధించిన ఏఈలు, డీఈఈలు ఎవరో మాకు తెలియదు. ఎన్నిసార్లు నీటి సమస్య వచ్చినా వారు వచ్చి పరిష్కరించలేదు. మేమే కురిచేడు వచ్చి పోట్లాడి నీరు తీసుకు పోతున్నాం.
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి: దూలం
యలమందారెడ్డి: రైతు: లింగమొక్కపల్లె
మా భూములు మేజర్ చివర ఉండడమే మా ఖర్మ. సాగర్ నీరు విడుదల చేసినప్పుడల్లా సంబరపడి సాగు చేస్తున్నాం. తీరా సగం పంట వచ్చాక నీరు నిలిచిపోతోంది. దీనివల్ల ఎంతో నష్టపోతున్నాం.
కురిచేడులో గుంటూరు రైతుల ఆందోళన
Published Sun, Oct 20 2013 6:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement