ముఖ్యమంత్రి మాట డొల్ల.. జీజీహెచ్ అభివృద్ధి కల్ల
► ఆసుపత్రి అభివృద్ధికి రూ. 4 కోట్లు ఇస్తామని 2015లో ఆర్భాట ప్రకటన
► జీవో విడుదల చేసి పనులు ప్రారంభమయ్యాక తూచ్..!
► 2016లో రూ. 1.25 కోట్లు ఖర్చు పెట్టిన కాంట్రాక్టర్‌కు మొండిచేయి
► ఎక్కడికక్కడ నిలిచిన అభివృద్ధి పనులు
► లేఖలు పంపినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో జీజీహెచ్‌ను మరింత అభివృద్ధి చేస్తాం.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.. అందుకుగాను ప్రత్యేక బడ్జెట్ రూ. 4 కోట్లు కేటాయించి ఆసుపత్రిని ప్రక్షాళన చేస్తాం..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు 2015 నవంబర్‌లో బడ్జెట్ మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారు. పనులకు టెండర్లు పిలవడం, పనులు ప్రారంభం కావడం అన్నీ జరిగిపోయాయి. తర్వాత ఏమైందో తెలియదు గానీ నిధులు వెనక్కి వెళ్లి పనులు నిలిచిపోయాయి.
సాక్షి, గుంటూరు : గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో 2015 ఆగస్టు 26వ తేదీన ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జీజీహెచ్ ప్రతిష్ట అంతకంత దిగజారేలా చేసింది. దీంతో 15 రోజుల పాటు కలెక్టర్‌తో పాటు, మంత్రులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రిని పరిశీలించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆర్భాట ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పలికారు.
తర్వాత కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో మూడు గంటల సేపు కలియదిరిగి సమస్యలను గుర్తించారు. ఆసుపత్రిలో రెండు వార్డుల నిర్మాణం, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ. 4 కోట్ల ప్రత్యేక నిధులిస్తామని జీవో విడుదల చేశారు.
తూచ్.. జీవో వెనక్కి..
2015 నవంబరులో నిధులు మంజూరు కావడంతో 2015 డిసెంబర్‌లో టెండర్లు పిలిచి పనులు సైతం అప్పగించేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 2016 జనవరిలో వార్డుల నిర్మాణాన్ని చేపట్టి శ్లాబులు కూడా పూర్తి చేశాడు. సుమారు 30 శాతం పనులు చేపట్టిన తర్వాత 2016 మార్చిలో నిధులు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. ఆ పనులకు రూ. 1.20 కోట్లు ఖర్చుపెట్టానని, తక్షణం నగదు చెల్లించేలా చూడాలని సదరు కాంట్రాక్టర్ వైద్యాధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ఉన్నతాధికారుల మాధ్యమంగా లేఖ కూడా రాశారు. ఎన్ని విధాలు విన్నవించుకున్నా ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది.
రోగులకు మెరుగైన వైద్యం మృగ్యం..
2017 జనవరి 18వ తేదీన జీజీహెచ్‌కు వచ్చిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్ కాంతీలాల్ దండేకు సమస్యను వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్, ట్రాన్స్‌ఫార్మర్, 125 కేవీఏ జనరేటర్ తదితర సదుపాయాలు సమకూర్చాలి ఉంది. నిధులు వెనక్కు వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వసతులు సమకూరకపోతే ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ సైతం పనిచేయని పరిస్థితి ఏర్పడింది.
నిధులు వెనక్కి వెళ్లిన విషయం వాస్తవమే..
జీజీహెచ్‌లో రెండు వార్డుల నిర్మాణం, జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 4 కోట్ల ప్రత్యేక నిధులు విడుదలైన సంగతి వాస్తవమే. వార్డుల నిర్మాణం పనులు పూర్తి కావొచ్చింది. సమస్యలపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ద్వారా విన్నవించాం. ఈఈ అశోక్‌కుమార్