గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : వ్యాధి తీవ్రతను తట్టుకోలేక గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)కి వచ్చే పేదలకు వైద్యసేవలు సకాలంలో అందడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాత్రివేళల్లో వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రాత్రి వేళల్లో సాధారణంగా రోడ్డు ప్రమాద కేసులు, గుండెపోటుకు గురైన బాధితులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు, విషప్రభావానికి గురైన కేసులు ఎక్కువగా వస్తుంటాయి. డ్యూటీ డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతుండడంతో.. పీజీ వైద్యులే వివిధ రకాల వ్యాధుల నిర్థారణ పరీక్షల పేరుతో తెల్లవార్లూ అత్యవసర వైద్యసేవల విభాగంలోనే రోగులను ఉంచుతున్నారు. రోగులు ఆస్పత్రిలో ఉండి కూ డా వైద్యులు విధుల్లో లేకపోవడంతో బాధను భరిస్తూ దేవుడిపై భారం వేసి జాగారం చేయాల్సివస్తోంది. రెండు రోజులు గడిచినా కొన్ని అత్యవసర కేసులు కూడా క్యాజువాలిటీలోనే గడుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
పగటి వేళా అత్తెసరు వైద్యమే...
నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు వైద్యులు తమసేవలను అందించాల్సివుంటుంది. ఉదయం 9 గంటలకు ఓపీకి రావాల్సిన డాక్టర్లు 10 గంటలు దాటినా రావడం లేదు. కొందరు వైద్యులతే ఏకంగా ఓపీ విభాగాలకు హాజరుకాకుండానే గడిపేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యవిభాగాలు మధ్యాహ్నం 12.30 గంటలకే మూతపడుతున్నాయి. ఓపీలో కొందరు వైద్యులు రోగులకు వైద్యం అందించకుండా వైద్యవిద్యార్థులకు బోధన చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం చేయాల్సిన బోధనను ఉదయం ఓపీ సమయంలోనే చేసి మధ్యాహ్నం నుంచి సొంత క్లినిక్‌లకు జారుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తీరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి హాజరుపట్టీలో సంతకాలు చేసి మరీ వెళుతున్నారు. వైద్యసిబ్బందిలో విధులపై నానాటికి చిత్తశుద్ధి లోపిస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పర్యవేక్షణ ఉండడం లేదు..
పేదలకు వైద్యసేవలు అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగులకు వైద్యసేవలు సకాలంలో అందేలా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తగు చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తాం..
క్యాజువాలిటీలో రోగులకు సకాలంలో వైద్యం అందేలా సంబంధిత విభాగాల అధిపతులను రెస్పాన్‌బుల్‌పర్సన్‌గా నియమిస్తామని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. రోగులకు వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
రాత్రి వేళ రాకండి
Published Sun, Feb 16 2014 3:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement