ఇకపై వారంతా.. విశాఖకు వెళ్లాల్సిందే! | Guntur, krishna, Yanam residents have to migrate Vizag | Sakshi
Sakshi News home page

ఇకపై వారంతా.. విశాఖకు వెళ్లాల్సిందే!

Published Thu, May 21 2015 11:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

Guntur, krishna, Yanam residents have to migrate Vizag

- పాస్‌పోర్ట్ సేవలపై విదేశీ మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు
- నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ 4 జిల్లాలు హైదరాబాద్‌లోకే


సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో ఉన్న యానాం జిల్లా పాస్‌పోర్ట్ సేవలను విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్వనీ సత్తారు తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వాసులు ఇప్పటి వరకూ పాస్‌పోర్ట్ సేవలకు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చేవారు. యానాం వాసులు పుదుచ్చేరి వెళ్లేవారు. అయితే ఇకపై ఈ మూడు జిల్లాలకు చెందిన వారు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 22 (నేటినుంచి) పూర్తిగా ఈ సేవలను విశాఖకు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది. నేటినుంచి గుంటూరు, క్రిష్ణా, యానాం జిల్లాల వాసులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ పాస్‌పోర్ట్‌పై విశాఖపట్నం కార్యాలయం పేరు మాత్రమే వస్తుంది.

విశాఖపట్నం కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కొత్తగా గుంటూరు, కృష్ణా, యానాం జిల్లాలు. మొత్తం 8 జిల్లాలు విశాఖపట్నం పరిధిలోకి ఉంటాయి. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖ కార్యాలయం పరిధిలోకే వస్తుంది.

హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాదాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు వస్తాయి. తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్ట్ సేవా (అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి) కేంద్రాలు హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకే వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement