Ashwini sattaru
-
ఆర్పీవో అశ్వినికి హైకోర్టు జరిమానా
కోర్టు ఆదేశాల అమలులో అలసత్వంపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించి నందుకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ (ఆర్పీవో) అధికారి అశ్విని సత్తారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ నిందితురాలి పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకో కుండా.. ఆమె దేశం విడిచి వెళ్లేందుకు కారణమైనందుకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఆమెను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఓ క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన పి.వెంకటరెడ్డి.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అయితే పాస్‌పోర్ట్ అధికారులు తన వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వెంకటరెడ్డి వినతిపత్రంపై రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరెడ్డి.. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేశ్ కెరుుత్.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్విని వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఎదుట హాజరైన ఆమె.. కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వానికి కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందజేయడానికి పిటిషనర్ పదే పదే తిరిగినా పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. -
చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్: చేతి రాత పాస్‌పోర్టులను యంత్రం చదువగలిగిన తరహాలోకి మార్చుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలు www.passportindia.gov.in వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. జాతీయ కాల్‌సెంటర్ 1800-258-1800 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సంప్రదించ వచ్చని ఆమె వివరించారు. -
హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీఓ) అశ్విని సత్తారు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే ఆమెను ఎక్కడకు బదిలీ చేసింది వివరాలు తెలియరాలేదు. వారం రోజుల క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు పంపినట్లు ఢిల్లీలోని ఎంఈఏ వర్గాలు తెలిపాయి. 2013 సెప్టెంబర్‌లో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా అశ్విని సత్తారు హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అప్పటి పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్‌రెడ్డి బదిలీ కావడంతో పదోన్నతిపై హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అయ్యారు. గతంలో ఆమె జర్మనీలోని ఇండియా రాయబార కార్యాలయంలో పనిచేశారు. అంతేగాదు నేపాల్, భూటాన్ దేశాల విదేశీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తన బదిలీని కొద్ది రోజులు ఆపాలని అశ్విని సత్తారు కేంద్ర కార్యాలయానికి లేఖ రాసినట్లు సమాచారం. కాగా ఈమె స్థానంలో కొత్త అధికారి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. డీపీఓనూ బదిలీ చేసిన ఎంఈఏ... ఐదేళ్లుగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్న మదన్కుమార్రెడ్డిని కూడా బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేసే ఈయన డిప్యుటేషన్‌పై ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లు డిప్యుటేషన్‌పై ఉండొచ్చు. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినందున బదిలీ చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు చెప్పారు. -
పాస్‌పోర్టు సేవలు విస్తరించాలి
అధికారులకు కేసీఆర్ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలను మరింత విస్తరించాల్సిన అవసరముందని, ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కొత్త కేంద్రాల ఏర్పాటు అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. వరంగల్, కరీంనగర్లో కొత్త కేంద్రాల కోసం అధికారులు సన్నాహాలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌తో స్వయంగా మాట్లాడతానని సీఎం పేర్కొన్నారు. గురువారం తన అధికారిక నివాసంలో రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు, పాస్‌పోర్ట్ జారీ అధికారి అశోక్ కుమార్‌తో పాటు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో ఉప కేంద్రం పనిచేస్తోందని, వచ్చే నెలలో కరీంనగర్లో కూడా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత వరంగల్‌లో కూడా సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడికక్కడే పాస్‌పోర్ట్ సేవలు.. పాస్ పోర్టు కోసం హైదరాబాద్ రావడం ఇబ్బందిగా ఉంటుందని, ఎక్కడికక్కడ జిల్లాల్లో సేవలు విస్తరించాలని సీఎం చెప్పారు. నిజామాబాద్‌లో సేవా కేంద్రం వల్ల ఆ జిల్లాతో పాటు, పశ్చిమ ఆదిలాబాద్‌కు సేవలందించడం సులభమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్లో సేవా కేంద్రం రావడం వల్ల కరీంనగర్‌తో పాటు తూర్పు ఆదిలాబాద్ వాసులకు, వరంగల్‌లో సేవా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఖమ్మం, కొంత మేర నల్లగొండ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని మాట్లాడుతూ.. పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడం వల్ల వారం రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తున్నామని, ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. -
ఇకపై వారంతా.. విశాఖకు వెళ్లాల్సిందే!
- పాస్‌పోర్ట్ సేవలపై విదేశీ మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు - నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ 4 జిల్లాలు హైదరాబాద్‌లోకే సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో ఉన్న యానాం జిల్లా పాస్‌పోర్ట్ సేవలను విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్వనీ సత్తారు తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వాసులు ఇప్పటి వరకూ పాస్‌పోర్ట్ సేవలకు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చేవారు. యానాం వాసులు పుదుచ్చేరి వెళ్లేవారు. అయితే ఇకపై ఈ మూడు జిల్లాలకు చెందిన వారు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 22 (నేటినుంచి) పూర్తిగా ఈ సేవలను విశాఖకు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది. నేటినుంచి గుంటూరు, క్రిష్ణా, యానాం జిల్లాల వాసులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ పాస్‌పోర్ట్‌పై విశాఖపట్నం కార్యాలయం పేరు మాత్రమే వస్తుంది. విశాఖపట్నం కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కొత్తగా గుంటూరు, కృష్ణా, యానాం జిల్లాలు. మొత్తం 8 జిల్లాలు విశాఖపట్నం పరిధిలోకి ఉంటాయి. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖ కార్యాలయం పరిధిలోకే వస్తుంది. హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాదాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు వస్తాయి. తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్ట్ సేవా (అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి) కేంద్రాలు హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకే వస్తాయి. -
సామాన్యునికి - పాస్‌పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా!
సి.బి. ముత్తమ్మ... మనదేశంలో మొదటి మహిళా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్). ఆమె 1949లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరోసారి వచ్చింది. ఆ అవసరాన్ని కల్పించిన మహిళ అశ్విని సత్తారు. అశ్విని కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఒక తొలి రికార్డును కూడా సాధించారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసులో రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్. అంతేకాదు... పాస్‌పోర్టు ఆఫీస్ చరిత్రలో తొలి మహిళా అధికారి. సామాన్యులకు పాస్‌పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన తొలి అజెండా అంటున్న అశ్విని సత్తారుతో ముఖాముఖి. మీరు మీడియాకు దూరంగా ఉంటారనుకుంటాను. అపాయింట్మెంట్ చాలా కష్టమైంది... అశ్విని: నిజమే. పెద్దగా ఇష్టపడను. ఏ బ్యాచ్‌లో ఐఎఫ్ఎస్లోకి వచ్చారు? అశ్విని: 2008 బ్యాచ్. నాన్న ఐపిఎస్, మీరు ఐఎఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. కానీ ఐఎఫ్ఎస్ను ఎంచుకోవడంలో కారణం ఉందా? అశ్విని: డిప్లమాట్ అవుదామనే ఐఎఫ్ఎస్ని ఎంచుకున్నాను. ఇండియా చాలా గొప్ప దేశం. ఈ దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు? అశ్విని: ఒకరు ప్రభావితం చేయడం అనడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉండేది. నాన్నగారు ఈ రంగంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. కాలేజ్కొచ్చే సరికి అది ఐఎఫ్ఎస్ అని స్పష్టంగా నిర్ణయించుకున్నాను. మీ వికాసంలో అమ్మానాన్నల్లో ఎవరి పాత్ర ఎక్కువ? అశ్విని: నాకు తెలిసినంత వరకు పిల్లల వికాసంలో అమ్మపాత్ర, నాన్న పాత్ర అని విడదీసి చూడలేం. అమ్మానాన్న ఇద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ పిల్లల్ని నడిపిస్తుంది, నడవనిస్తుంది. మా అమ్మానాన్నలు నన్ను, మా అన్నయ్యను ఇద్దరినీ నడవనిచ్చారు. మాకు ఇష్టమైన రంగాల్లోకి రావడానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. అన్నయ్య జాన్సన్ అండ్ జాన్సన్స్లో సౌత్ ఇండియా హెడ్. మీ బాల్యం ఎక్కడ గడిచింది? అశ్విని: మొత్తం హైదరాబాద్‌లోనే. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదివాను. ఉస్మానియా యూనివర్శిటీలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్? అశ్విని: గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ దాదాపుగా ఒకే రూపు సంతరించుకున్నాయి. రెండు - మూడ దశాబ్దాల కిందట అయితే ఎవరైనా యుఎస్ నుంచి వస్తుంటే అక్కడి విశేషాలను తెలుసుకోవడం కోసం బంధువులు, స్నేహితులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. నేను వెళ్లినప్పటికి అలా కొత్త భావన కలిగే పరిస్థితి లేదు. సివిల్స్ ప్రిపరేషన్లో జర్మన్ లాంగ్వేజ్ తీసుకున్నాను. కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకపోయింది. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీలో మీ అనుభవాలు? అశ్విని: ఐఎఫ్ఎస్గా నా మొదటి పోస్టింగ్ జర్మనీలోనే. 2010వ సంవత్సరం జూలై నుంచి 2013 వరకు బెర్లిన్‌లోని భారత రాయభార కార్యాలయంలో పని చేశాను. మనదేశానికి- జర్మనీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను అక్కడ ఉన్న సమయంలోనే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దఫాలు జర్మనీలో పర్యటించారు. మనదేశానికి సాంకేతిక సహాయకారి జర్మనీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జర్మనీ ముద్ర మన దేశం మీద చాలా ఎక్కువ. మనం ఉపయోగించే ఎస్కలేటర్, లిఫ్ట్, కార్లు, పెద్ద మెషీన్లు... ఇలా అనేకం జర్మనీ తయారు చేసినవే. జర్మనీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే అని చెప్పాలి. జర్మనీ నుంచి మనదేశం నేర్చుకోవాల్సింది... అశ్విని: చాలా ఉంది. వారిలో జాతీయభావన మెండు. ఉద్యోగం కూడా దేశం అభ్యున్నతి కోసమే అన్నట్లు చేస్తారు. పని కచ్చితంగా చేయడం ద్వారా దేశాభివృద్ధిలో తమ పాత్రను నిర్వహిస్తున్నాం అని సంతోషిస్తారు. మేధాసంపత్తిలో భారతీయులు చాలా తెలివైన వాళ్లు. వర్క్ కల్చర్, క్రమశిక్షణ, జాతీయత భావాన్ని పెంచుకుంటే మనదేశం త్వరగా అభివృద్ధి చెందుతుందనిపించింది. పాస్‌పోర్టు వ్యవహారాల విషయానికి వస్తే... తొలి మహిళా అధికారిగా ఎలా ఫీలవుతున్నారు? అశ్విని: ప్రొఫెషన్‌కి స్త్రీ, పురుషులనే తేడాలుండవు. అయితే ఒక విషయాన్ని మహిళలు స్వీకరించే విధానం కొంత భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా పరిమితమైన సందర్భాల్లోనే. నాకు తేడా ఏమీ కనిపించలేదు. ఇంతకంటే కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫారిన్ అఫైర్సన్ సెక్రటరీ సుజాతాసింగ్లాంటి ఎందరినో చూస్తున్నాం కదా! పాస్‌పోర్టు అధికారిగా ఫస్ట్ ఉమన్‌గా రికార్డు మీదే. మరి ఫస్ట్తోపాటు బెస్ట్ రికార్డు కూడా మీ ఖాతాలో చేరాలంటే... అశ్విని: నాకు ముందు ఈ బాధ్యత నిర్వర్తించిన శ్రీకర్ రెడ్డి గారు చాలామంచి సిస్టమ్‌ను రూపొందించారు. అప్పుడు నేను డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్ని. ఇప్పుడూ ఆయన బాటలోనే పని చేస్తున్నాను. పాస్‌పోర్టు సేవల పట్ల ప్రజల్లో ఇంతకు ముందుకంటే ఇప్పుడు నమ్మకం పెరిగింది. అప్లయ్ చేస్తే పాస్‌పోర్టు వస్తుందనే భరోసా కలిగింది. మా సేవల్లో ప్రతి అంశాన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా అదే ‘బెస్ట్ సర్వీస్’ రికార్డును తెస్తుంది. పాస్‌పోర్టు ఏజెంట్ సిస్టమ్ తొలగిపోవాలంటే... అశ్విని: పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు చాలా వరకు పారదర్శకంగా మారింది. ఎవరికి వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కొంతయినా ఉండాలి. నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సౌకర్యం కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ట్రాన్స్పరెంట్ సిస్టమ్‌లో ఏజెంట్ అవసరమే లేకుండా పాస్‌పోర్టును అందుకోవచ్చు. తప్పదనుకుంటే సేవాకేంద్రాల సహాయం తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క పౌరునికీ తప్పని సరా? అశ్విని: పాస్‌పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. సిటిజన్‌షిప్ డాక్యుమెంట్ కాదు. తప్పని సరి కాదు. పాస్‌పోర్టు సమగ్రమైన డాక్యుమెంట్ కదా? అశ్విని: పాస్‌పోర్టు... ప్రభుత్వం ఇచ్చిన అనేక ధృవపత్రాల ఆధారంగా జారీ అయి ఉంటుంది. కాబట్టి ఓ భరోసా. రోజూ పాస్‌పోర్టు కోసం వచ్చే దరఖాస్తులు, జారీ చేస్తున్న పాస్‌పోర్టుల నిష్పత్తి సమంగా ఉంటోందా? అశ్విని: బేగంపేటలో రోజుకు 800 వస్తున్నాయి. రోజుకు వెయ్యి పాస్‌పోర్టులు జారీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆఫీసు ఇది. అన్ని డాక్యుమెంట్లూ సరిగ్గా ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. తత్కాల్ అయితే 48 గంటల లోపు జారీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామీణుల కోసం అవగాహన సదస్సుల వంటివి... అశ్విని: గ్రామీణులలో పాస్‌పోర్టు పట్ల చైతన్యం తీసుకురావడం నా ప్రధానమైన అజెండా. విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌కి శిక్షణ ఇవ్వబోతున్నాం. పాస్‌పోర్టు సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. నకిలీ పాస్‌పోర్టును అడ్డుకోవడం ఎలా? అశ్విని: ఒకప్పుడు చేత్తో రాసేవారు. ఇప్పుడు అన్నీ మెషీన్ రీడ్ పాస్‌పోర్టులే, బయో మెట్రిక్ సిస్టమ్‌లో నకిలీకి ఆస్కారం ఉండదు. తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టు కోసం వస్తే? అశ్విని: మాకు చర్య తీసుకునే అధికారం ఉండదు. మేము పాస్‌పోర్టు జారీ చేయడానికి అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారం నకిలీ అని నాకు వ్యక్తిగతంగా తెలిసినా సంబంధిత అధికార విభాగం జారీ చేసిన డాక్యుమెంట్‌ని నేను గౌరవించాల్సిందే. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారికి మీరు ఈ డాక్యుమెంట్‌ను మరోసారి సరి చేసుకోగలరు అని సూచించగలం. దేశంలోపల ఉద్యోగం, దేశం వెలుపల ఉద్యోగంలో తేడా? అశ్విని: పౌరులకు నేరుగా సేవ అందిస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న విభాగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దేశం బయటకు వెళ్లినప్పుడు ‘నేను నా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక బాధ్యత. జాబ్ సాటిస్ఫాక్షన్ పొందిన సందర్భం? అశ్విని: గత ఏడాది డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయి పాస్‌పోర్టు విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన ఉద్యోగం అనిపించిన సందర్భం ? అశ్విని: పబ్లిక్ సర్వీస్‌లో చాలెంజెస్ ఉంటాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మొదటి రోజునే అనుకున్నాను. అయితే కష్టం అనిపించిన సందర్భం ఇంత వరకూ రాలేదు. కుటుంబ వివరాలు... హాబీలు... అశ్విని: నేను సింగిల్. నా హాబీ క్రమశిక్షణతో పని చేయడమే. చివరగా పౌరులకు ఓ సూచన! అశ్విని: పాస్‌పోర్టు జారీ చేసే పనిని మా స్టాఫ్ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతగా చేయట్లేదు. మన పౌరులకు చేస్తున్న సేవ అనే ధోరణితో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. దీనిని కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తాం. - వాకా మంజులారెడ్డి సామాన్యులకు మీరిచ్చే సూచన? అశ్విని: ఏజెంట్లు ‘‘నేను చిటికెలో ఇప్పిస్తాను’’ అన్నట్లు చెబుతుంటారు. ఆ మాటలను నమ్మవద్దు. మీరే స్వయంగా పాస్‌పోర్టు ఆఫీసు లోపలికి రండి. ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదో అత్యవసరం ఏర్పడుతుంది. ఆ సమయానికి పాస్‌పోర్టు సిద్ధమవుతుందా లేదా అనే అయోమయంలో ఏజెంట్లను ఆశ్రయిస్తారు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే - దయచేసి ఉదయం 9.30-11.30 మధ్య మా బ్యాక్ ఆఫీస్‌కి రండి. అన్ని వివరాలనూ తెలుసుకోండి. ఇప్పుడు సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది.