పాస్‌పోర్టు సేవలు విస్తరించాలి
అధికారులకు కేసీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలను మరింత విస్తరించాల్సిన అవసరముందని, ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కొత్త కేంద్రాల ఏర్పాటు అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. వరంగల్, కరీంనగర్‌లో కొత్త కేంద్రాల కోసం అధికారులు సన్నాహాలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌తో స్వయంగా మాట్లాడతానని సీఎం పేర్కొన్నారు.
గురువారం తన అధికారిక నివాసంలో రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు, పాస్‌పోర్ట్ జారీ అధికారి అశోక్ కుమార్‌తో పాటు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో ఉప కేంద్రం పనిచేస్తోందని, వచ్చే నెలలో కరీంనగర్‌లో కూడా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత వరంగల్‌లో కూడా సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
ఎక్కడికక్కడే పాస్‌పోర్ట్ సేవలు..
పాస్ పోర్టు కోసం హైదరాబాద్ రావడం ఇబ్బందిగా ఉంటుందని, ఎక్కడికక్కడ జిల్లాల్లో సేవలు విస్తరించాలని సీఎం చెప్పారు. నిజామాబాద్‌లో సేవా కేంద్రం వల్ల ఆ జిల్లాతో పాటు, పశ్చిమ ఆదిలాబాద్‌కు సేవలందించడం సులభమవుతుందని పేర్కొన్నారు. కరీంనగర్‌లో సేవా కేంద్రం రావడం వల్ల కరీంనగర్‌తో పాటు తూర్పు ఆదిలాబాద్ వాసులకు, వరంగల్‌లో సేవా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఖమ్మం, కొంత మేర నల్లగొండ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని మాట్లాడుతూ.. పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయడం వల్ల వారం రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తున్నామని, ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.