ఇక తెలంగాణ పౌరసత్వ కార్డులు
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టుల తరహాలో తెలంగాణ పౌరసత్వ కార్డులను అందించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని అపార్డ్ (గ్రామీణాభివృద్ధి సంస్థ)లో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందించడానికి ప్రతీ వ్యక్తికి చెందిన సమగ్ర సమాచారంతో కార్డులను రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మల్టిపర్పస్ హౌస్‌హోల్డ్ కార్డుల మాదిరిగా.., పాస్‌పోర్టుల తరహాలో ఈ సిటిజన్ కార్డులు ఉండాలన్నారు.
‘ఎవరు నిజంగా పేదవారు? ఎవరి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ద్వారా ఎవరికి, ఎలాంటి సహాయం అందాలి అనే వివరాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలన్నీ అవినీతి లేకుండా, పారదర్శకంగా నేరుగా అర్హులకు అందాలి. దీనికోసం గ్రామ స్థాయిలో సమగ్రంగా ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాలి. ఆగస్టులోగా దీనిని పూర్తిచేయండి’ అని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గృహ నిర్మాణం, పెన్షన్లు, రేషన్‌కార్డుల పంపిణీ వంటి అంశాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు అవినీతి రహితంగా, పారదర్శకంగా ఉండాలన్నారు.
దీనికోసం విస్తృత ప్రచారం, ప్రజల భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై బాగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 80 శాతం మంది బలహీనవర్గాల వారున్నారని, వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా సంక్షేమ కార్యక్రమాలుండాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర కచ్చితమైన వివరాలు, సమాచారం లేదన్నారు. అందుకే తెలంగాణలో సమగ్ర ఆర్థిక, సామాజిక సర్వేను ప్రభుత్వమే గడపగడపకూ వెళ్లి నిర్వహిస్తుందని సీఎం చెప్పారు. దసరా, దీపావళి మధ్య కాలంలో రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని తెలిపారు.