సామాన్యునికి - పాస్‌పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా! | Passport Officer Ashwini sattaru interview | Sakshi
Sakshi News home page

సామాన్యునికి - పాస్‌పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా!

Published Fri, Aug 8 2014 11:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Passport Officer Ashwini sattaru interview

సి.బి. ముత్తమ్మ... మనదేశంలో మొదటి మహిళా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్). ఆమె 1949లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరోసారి వచ్చింది. ఆ అవసరాన్ని కల్పించిన మహిళ అశ్విని సత్తారు. అశ్విని కూడా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఒక తొలి రికార్డును కూడా సాధించారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసులో రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్. అంతేకాదు... పాస్‌పోర్టు ఆఫీస్ చరిత్రలో తొలి మహిళా అధికారి. సామాన్యులకు పాస్‌పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన తొలి అజెండా అంటున్న అశ్విని సత్తారుతో ముఖాముఖి.
 
 మీరు మీడియాకు దూరంగా ఉంటారనుకుంటాను. అపాయింట్‌మెంట్ చాలా కష్టమైంది...
 అశ్విని: నిజమే. పెద్దగా ఇష్టపడను.
 
 ఏ బ్యాచ్‌లో ఐఎఫ్‌ఎస్‌లోకి వచ్చారు?
 అశ్విని: 2008 బ్యాచ్.
 
 నాన్న ఐపిఎస్, మీరు ఐఎఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. కానీ ఐఎఫ్‌ఎస్‌ను ఎంచుకోవడంలో కారణం ఉందా?
 అశ్విని: డిప్లమాట్ అవుదామనే ఐఎఫ్‌ఎస్‌ని ఎంచుకున్నాను. ఇండియా చాలా గొప్ప దేశం. ఈ దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి.
 
 మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు?
 అశ్విని: ఒకరు ప్రభావితం చేయడం అనడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉండేది. నాన్నగారు ఈ రంగంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. కాలేజ్‌కొచ్చే సరికి అది ఐఎఫ్‌ఎస్ అని స్పష్టంగా నిర్ణయించుకున్నాను.
 
 మీ వికాసంలో అమ్మానాన్నల్లో ఎవరి పాత్ర ఎక్కువ?
 అశ్విని: నాకు తెలిసినంత వరకు పిల్లల వికాసంలో అమ్మపాత్ర, నాన్న పాత్ర అని విడదీసి చూడలేం. అమ్మానాన్న ఇద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ పిల్లల్ని నడిపిస్తుంది, నడవనిస్తుంది. మా అమ్మానాన్నలు నన్ను, మా అన్నయ్యను ఇద్దరినీ నడవనిచ్చారు. మాకు ఇష్టమైన రంగాల్లోకి రావడానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. అన్నయ్య జాన్సన్ అండ్ జాన్సన్స్‌లో సౌత్ ఇండియా హెడ్.
 
 మీ బాల్యం ఎక్కడ గడిచింది?
 అశ్విని: మొత్తం హైదరాబాద్‌లోనే. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదివాను. ఉస్మానియా యూనివర్శిటీలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే.
 
 ఐఎఫ్‌ఎస్ అధికారిగా జర్మనీకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్?
 అశ్విని: గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ దాదాపుగా ఒకే రూపు సంతరించుకున్నాయి. రెండు - మూడ దశాబ్దాల కిందట అయితే ఎవరైనా యుఎస్ నుంచి వస్తుంటే అక్కడి విశేషాలను తెలుసుకోవడం కోసం బంధువులు, స్నేహితులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. నేను వెళ్లినప్పటికి అలా కొత్త భావన కలిగే పరిస్థితి లేదు. సివిల్స్ ప్రిపరేషన్‌లో జర్మన్ లాంగ్వేజ్ తీసుకున్నాను. కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకపోయింది.
 
 ఐఎఫ్‌ఎస్ అధికారిగా జర్మనీలో మీ అనుభవాలు?
 అశ్విని: ఐఎఫ్‌ఎస్‌గా నా మొదటి పోస్టింగ్ జర్మనీలోనే. 2010వ సంవత్సరం జూలై నుంచి 2013 వరకు బెర్లిన్‌లోని భారత రాయభార కార్యాలయంలో పని చేశాను. మనదేశానికి- జర్మనీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను అక్కడ ఉన్న సమయంలోనే మన మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ రెండు దఫాలు జర్మనీలో పర్యటించారు.  మనదేశానికి సాంకేతిక సహాయకారి జర్మనీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జర్మనీ ముద్ర మన దేశం మీద చాలా ఎక్కువ. మనం ఉపయోగించే ఎస్కలేటర్, లిఫ్ట్, కార్లు, పెద్ద మెషీన్లు... ఇలా అనేకం జర్మనీ తయారు చేసినవే. జర్మనీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే అని చెప్పాలి.
 
జర్మనీ నుంచి మనదేశం నేర్చుకోవాల్సింది...
అశ్విని: చాలా ఉంది. వారిలో జాతీయభావన మెండు. ఉద్యోగం కూడా దేశం అభ్యున్నతి కోసమే అన్నట్లు చేస్తారు. పని కచ్చితంగా చేయడం ద్వారా దేశాభివృద్ధిలో తమ పాత్రను నిర్వహిస్తున్నాం అని సంతోషిస్తారు. మేధాసంపత్తిలో భారతీయులు చాలా తెలివైన వాళ్లు. వర్క్ కల్చర్, క్రమశిక్షణ, జాతీయత భావాన్ని పెంచుకుంటే మనదేశం త్వరగా అభివృద్ధి చెందుతుందనిపించింది.
 
పాస్‌పోర్టు వ్యవహారాల విషయానికి వస్తే... తొలి మహిళా అధికారిగా ఎలా ఫీలవుతున్నారు?
అశ్విని: ప్రొఫెషన్‌కి స్త్రీ, పురుషులనే తేడాలుండవు. అయితే ఒక విషయాన్ని మహిళలు స్వీకరించే విధానం కొంత భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా పరిమితమైన సందర్భాల్లోనే. నాకు తేడా ఏమీ కనిపించలేదు. ఇంతకంటే కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫారిన్ అఫైర్సన్ సెక్రటరీ సుజాతాసింగ్‌లాంటి ఎందరినో చూస్తున్నాం కదా!
 
పాస్‌పోర్టు అధికారిగా ఫస్ట్ ఉమన్‌గా రికార్డు మీదే. మరి ఫస్ట్‌తోపాటు బెస్ట్ రికార్డు కూడా మీ ఖాతాలో చేరాలంటే...
అశ్విని: నాకు ముందు ఈ బాధ్యత నిర్వర్తించిన శ్రీకర్ రెడ్డి గారు చాలామంచి సిస్టమ్‌ను రూపొందించారు. అప్పుడు నేను డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్‌ని. ఇప్పుడూ ఆయన బాటలోనే పని చేస్తున్నాను. పాస్‌పోర్టు సేవల పట్ల ప్రజల్లో ఇంతకు ముందుకంటే ఇప్పుడు నమ్మకం పెరిగింది. అప్లయ్ చేస్తే పాస్‌పోర్టు వస్తుందనే భరోసా కలిగింది. మా సేవల్లో ప్రతి అంశాన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా అదే ‘బెస్ట్ సర్వీస్’ రికార్డును తెస్తుంది.
 
పాస్‌పోర్టు ఏజెంట్ సిస్టమ్ తొలగిపోవాలంటే...
అశ్విని: పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు చాలా వరకు పారదర్శకంగా మారింది. ఎవరికి వారు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కొంతయినా ఉండాలి. నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సౌకర్యం కోసం ఏజెంట్‌లను ఆశ్రయిస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ట్రాన్స్‌పరెంట్ సిస్టమ్‌లో ఏజెంట్ అవసరమే లేకుండా పాస్‌పోర్టును అందుకోవచ్చు. తప్పదనుకుంటే సేవాకేంద్రాల సహాయం తీసుకోవచ్చు.
 
 ఇది ప్రతి ఒక్క పౌరునికీ తప్పని సరా?
 అశ్విని: పాస్‌పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. సిటిజన్‌షిప్ డాక్యుమెంట్ కాదు. తప్పని సరి కాదు.
 
 పాస్‌పోర్టు సమగ్రమైన డాక్యుమెంట్ కదా?

 అశ్విని: పాస్‌పోర్టు... ప్రభుత్వం ఇచ్చిన అనేక ధృవపత్రాల ఆధారంగా జారీ అయి ఉంటుంది. కాబట్టి ఓ భరోసా.
 
రోజూ పాస్‌పోర్టు కోసం వచ్చే దరఖాస్తులు, జారీ చేస్తున్న పాస్‌పోర్టుల నిష్పత్తి సమంగా ఉంటోందా?

అశ్విని: బేగంపేటలో రోజుకు 800 వస్తున్నాయి. రోజుకు వెయ్యి పాస్‌పోర్టులు జారీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆఫీసు ఇది. అన్ని డాక్యుమెంట్‌లూ సరిగ్గా ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. తత్కాల్ అయితే 48 గంటల లోపు జారీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 
 గ్రామీణుల కోసం అవగాహన సదస్సుల వంటివి...
 అశ్విని: గ్రామీణులలో పాస్‌పోర్టు పట్ల చైతన్యం తీసుకురావడం నా ప్రధానమైన అజెండా. విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌కి శిక్షణ ఇవ్వబోతున్నాం. పాస్‌పోర్టు సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.
 
 నకిలీ పాస్‌పోర్టును అడ్డుకోవడం ఎలా?
 అశ్విని: ఒకప్పుడు చేత్తో రాసేవారు. ఇప్పుడు అన్నీ మెషీన్ రీడ్ పాస్‌పోర్టులే, బయో మెట్రిక్ సిస్టమ్‌లో నకిలీకి ఆస్కారం ఉండదు.
 
తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టు కోసం వస్తే?
అశ్విని: మాకు చర్య తీసుకునే అధికారం ఉండదు. మేము పాస్‌పోర్టు జారీ చేయడానికి అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారం నకిలీ అని నాకు వ్యక్తిగతంగా తెలిసినా సంబంధిత అధికార విభాగం జారీ చేసిన డాక్యుమెంట్‌ని నేను గౌరవించాల్సిందే.  సాధారణంగా బర్త్ సర్టిఫికేట్‌ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారికి మీరు ఈ డాక్యుమెంట్‌ను మరోసారి సరి చేసుకోగలరు అని సూచించగలం.
 
దేశంలోపల ఉద్యోగం, దేశం వెలుపల ఉద్యోగంలో తేడా?

అశ్విని: పౌరులకు నేరుగా సేవ అందిస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న విభాగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దేశం బయటకు వెళ్లినప్పుడు ‘నేను నా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక బాధ్యత.
 
జాబ్ సాటిస్‌ఫాక్షన్ పొందిన సందర్భం?
అశ్విని: గత ఏడాది డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయి పాస్‌పోర్టు విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
 
ఇది చాలా కష్టమైన ఉద్యోగం అనిపించిన సందర్భం ?
అశ్విని: పబ్లిక్ సర్వీస్‌లో చాలెంజెస్ ఉంటాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మొదటి రోజునే అనుకున్నాను. అయితే కష్టం అనిపించిన సందర్భం ఇంత వరకూ రాలేదు.
 
 కుటుంబ వివరాలు... హాబీలు...
 అశ్విని: నేను సింగిల్. నా హాబీ క్రమశిక్షణతో పని చేయడమే.
 
చివరగా పౌరులకు ఓ సూచన!
అశ్విని: పాస్‌పోర్టు జారీ చేసే పనిని మా స్టాఫ్ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతగా చేయట్లేదు. మన పౌరులకు చేస్తున్న సేవ అనే ధోరణితో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. దీనిని కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తాం.
 
- వాకా మంజులారెడ్డి

 
సామాన్యులకు మీరిచ్చే సూచన?
అశ్విని: ఏజెంట్‌లు ‘‘నేను చిటికెలో ఇప్పిస్తాను’’ అన్నట్లు చెబుతుంటారు. ఆ మాటలను నమ్మవద్దు. మీరే స్వయంగా పాస్‌పోర్టు ఆఫీసు లోపలికి రండి. ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదో అత్యవసరం ఏర్పడుతుంది. ఆ సమయానికి పాస్‌పోర్టు సిద్ధమవుతుందా లేదా అనే అయోమయంలో ఏజెంట్‌లను ఆశ్రయిస్తారు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే - దయచేసి ఉదయం 9.30-11.30 మధ్య మా బ్యాక్ ఆఫీస్‌కి రండి. అన్ని వివరాలనూ తెలుసుకోండి. ఇప్పుడు సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు  ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement