శిశువును ఎత్తుకెళ్తున్న మహిళ.. సీసీ టీవీ దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నవజాత శిశువు అపహరణకు గురైంది. ఇటీవల నిలోఫర్‌లో శిశువు కిడ్నాప్ ఘటన మరిచిపోక ముందే సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మరో పసికందు అపహరణకు గురైంది. ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని బాలింతను నమ్మబలికి శిశువుతో ఉడా యించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సబావతి విజయ కాన్పు కోసం జూన్ 21న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. జూన్ 27న సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఆయానంటూ పరిచయం చేసుకొని...
తల్లీబిడ్డలను ఆస్పత్రి నుంచి మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనుండగా సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ తనను తాను ఆయాగా పరిచయం చేసుకొని బాలింత విజయ వద్దకు వచ్చింది. ఆమెతో చనువుగా మాట్లాడింది. పాపకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువును వెంటతీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆ మహిళ శిశువును తీసుకురాకపోవడంతో విజయ తన భర్త నారీకి విషయం చెప్పింది. ఆయన ఆస్పత్రి పరిసరాలన్నీ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. మహిళా కిడ్నాపర్ బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఏడు పోలీసు బృందాల్లో మూడు బృందాలు బీదర్ వెళ్లాయి. సీసీ ఫుటేజీ దృశ్యాలను ఇతర పోలీస్ స్టేషన్లకు పంపినట్లు సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపారు.
అడుగడుగునా అదే నిర్లక్ష్యం...
ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన నిఘా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల పిల్లలు తారుమారు కావడం, అపహరణకు గురికావడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రి నుంచి చికిత్స కోసం నిలోఫర్‌కు తీసుకొచ్చినఓ శిశువు అపహరణకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆయా ఆస్పత్రుల్లో భద్రతను రెట్టింపు చేసింది. వైద్యులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయా ఆస్పత్రుల ప్రధాన ద్వారాల వద్ద పోలీసు ఔట్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయితే పలుచోట్ల సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీనికితోడు సెక్యురిటీ కాంట్రాక్టు దక్కించుకున్న ఓ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ... నిర్ధేశించిన దానికంటే తక్కువ మందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెక్యురిటీ గార్డులకు నెల నెలా వేతనాలు చెల్లించకపోవడంతో వారు రోగుల వద్ద చేతివాటానికి పాల్పడుతున్నారు. రూ. పది చేతిలో పెడితే చాలు తనిఖీలు లేకుండానే లోనికి అనుమతిస్తున్నారు. ఇది అగంతకులకు అవకాశంగా మారింది. ఎప్పటికప్పుడు ఆయా విభాగాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కూర్చున్న చోటి నుంచి కదలకపోవడం కూడా ఇందుకు మరో కారణం.
Comments
Please login to add a commentAdd a comment