న్యూఢిల్లీ: పని కోసం సౌదీ అరేబియాలోని రియాద్ కు వెళ్లి మరణించిన అసిమమా ఖటూన్ (25) ను యజమానే చంపేశాడని ఆమె తల్లి గౌసియా ఖటూన్ ఆరోపించారు. డిసెంబర్ లో డబ్బు సంపాదించడం కోసం తన బిడ్డను సౌదీకు పంపినట్లు ఆమె తెలిపారు. అసిమమా ను అక్కడికి చేరుకున్న వెంటనే ఒక గదిలో బంధించినట్లు వివరించారు. అనుక్షణం వేధించే వారని , మానసికంగా, శారీరకంగా యజమాని అబ్దుల్ రహమాన్ అలీ చేతిలో తన బిడ్డ నలిగిపోయిందని రోదించారు.
రోజుల తరబడి భోజనం లేకుండా ఉంచే వారని అసిమమా ఫోన్ చేసి జరిగిన ఘటనలన్నీ చెప్పుకునేదని తెలిపారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోరగా మే 2న కేంద్ర చర్యలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ రోజే అసిమమా మరణించిన విషయం తెలియడంతో ఆమె మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఓ ఆసుపత్రిలో పనిచేసే విధంగా ఏజెంట్ల సాయంతో అసిమమా మిడిల్ ఈస్ట్ లో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పని నచ్చితే అక్కడే కొనసాగేట్లు లేకపోతే మూడు నెలల్లో తిరిగి వచ్చే విధంగా ఏజెంట్ల వద్ద హామీ పత్రం కూడా తీసుకుందని పోలీసుల తెలిపారు.