riyad
-
ఏబీసీ చైర్మన్‌గా రియాద్ మాథ్యూ
న్యూఢిల్లీ: పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్ అసోసియేట్ ఎడిటర్ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్ బజాజ్ (ఐటీసీ) డిప్యూటీ ౖచైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్ జైన్ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఏబీసీ మేనేజ్మెంట్ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు.. పబ్లిషర్స్ ప్రతినిధులు: రియాద్ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్ జి.పవార్ (సకాల్ పేపర్స్), శైలేష్ గుప్తా (జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), ప్రవీణ్ సోమేశ్వర్ (హెచ్‌టి మీడియా లిమిటెడ్), మోహిత్ జైన్ (బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), కరణ్ దర్దా (లోక్మత్ మీడియా ప్రై. లిమిటెడ్), గిరీష్ అగర్వాల్ (డీబీ కార్ప్ లిమిటెడ్). ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్ బజాజ్ (ఐటీసీ లిమిటెడ్), అనిరుధ హల్దార్ (టీవీఎస్ మోటర్స్ కంపెనీ లిమిటెడ్), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్). యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్ కె.స్వామి (ఆర్కే స్వామి లిమిటెడ్), విక్రమ్ సఖుజా (మాడిసన్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), ప్రశాంత్ కుమార్ (గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), వైశాలి వర్మ (ఇనీíÙయేటివ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), సేజల్ షా (పబ్లిక్స్ మీడియా ఇండియా గ్రూపు). -
సౌదీలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబం మృతి
సౌదీ అరేబియాలో జరిగి శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారై కుటుంబం మృత్యువాత పడింది. అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు(ఉమ్రా) వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి..ప్రార్థనలు చేశారు. తిరిగి కారులో కువైట్‌కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుంచి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై డివైడర్‌ను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు. నలుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్.. మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసి గౌస్ బాషా తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కాగా గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ళ క్రితం వీరి కుటుంబం మదనపల్లికి ఆ తర్వాత బెంగళూరులో స్ధిరపడినట్లుగా సమాచారం. గౌస్‌బాషా కుటుంబం బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లింది. -
సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి, 8 మందికి గాయాలు
రియాద్: సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి జరిగింది. నైరుతి సౌదీ అరేబియాలోని అభా ఎయిర్‌పోర్టు లక్ష్యంగాపై దాడిలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఓ విమానం ధ్వంసం అయినట్లు సౌదీ మీడియా పేర్కొంది. గడిచిన 24 గంటల్లో స్థానిక అభా ఎయిర్‌పోర్టుపై ఇది రెండో దాడిగా తెలుస్తోంది. ఈ డ్రోన్ దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఎవరూ ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు -
సౌదీ నుంచి మృతదేహాన్ని తెప్పించండి
రియాద్ : సౌదీ అరేబియాలోని రియాద్‌లో నెలరోజుల క్రితం మరణించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చౌక రమేశ్(42) అనే కారు డ్రైవర్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మృతుని భార్య లావణ్య తల్లి రుక్కుంబాయి, తమ్ముడు రాజేశ్వర్ మానవహక్కుల కమిషన్‌లో ఫిటిషన్ దాఖలుచేశారు. అనంతరం హెచ్చార్సీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 67 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య లావణ్య ఇద్దరు కుమార్తెలు శివాణి (11), పావని (9) ఉన్నారు. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడానికి సహకరించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి సురేందర్సింగ్ ఠాకూర్, వలసకార్మికుల హక్కుల కార్యకర్త, న్యాయవాది అబ్దుల్ ఖాదర్‌లు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో మరణించినవారి శవాలను తెప్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలలో ప్రత్యేక విభాగాలను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలరూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్‌లో గత ఐదేళ్లలో తెలంగాణ ప్రవాసులు వెయ్యిమందికిపైగా చనిపోయారని వారు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఫోరం హెల్ప్ లైన్ నెం. +91 93912 03187ను సంప్రదించాలని కోరారు. -
నా బిడ్డను చంపింది యజమానే
న్యూఢిల్లీ: పని కోసం సౌదీ అరేబియాలోని రియాద్ కు వెళ్లి మరణించిన అసిమమా ఖటూన్ (25) ను యజమానే చంపేశాడని ఆమె తల్లి గౌసియా ఖటూన్ ఆరోపించారు. డిసెంబర్ లో డబ్బు సంపాదించడం కోసం తన బిడ్డను సౌదీకు పంపినట్లు ఆమె తెలిపారు. అసిమమా ను అక్కడికి చేరుకున్న వెంటనే ఒక గదిలో బంధించినట్లు వివరించారు. అనుక్షణం వేధించే వారని , మానసికంగా, శారీరకంగా యజమాని అబ్దుల్ రహమాన్ అలీ చేతిలో తన బిడ్డ నలిగిపోయిందని రోదించారు. రోజుల తరబడి భోజనం లేకుండా ఉంచే వారని అసిమమా ఫోన్ చేసి జరిగిన ఘటనలన్నీ చెప్పుకునేదని తెలిపారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోరగా మే 2న కేంద్ర చర్యలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ రోజే అసిమమా మరణించిన విషయం తెలియడంతో ఆమె మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓ ఆసుపత్రిలో పనిచేసే విధంగా ఏజెంట్ల సాయంతో అసిమమా మిడిల్ ఈస్ట్ లో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పని నచ్చితే అక్కడే కొనసాగేట్లు లేకపోతే మూడు నెలల్లో తిరిగి వచ్చే విధంగా ఏజెంట్ల వద్ద హామీ పత్రం కూడా తీసుకుందని పోలీసుల తెలిపారు. -
రియాద్‌లో తెలుగువాళ్ల సందడి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో గల తెలుగు కళా క్షేత్రం ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగాయి. తెలుగువారికోసం ఈ సంస్థ ఏర్పాటుచేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్య అతిథులుగా భారత్ నుంచి ప్రముఖ తెలుగు గాయకుడు సింహా, కమేడియన్ వేణు(జబర్దస్త్), మిమిక్రీ కళాకారుడు నర్సింహామూర్తి హాజరై అతిథులందరిని అలరించారు. స్థానిక గాయకుడు అంజద్ హుస్సేన్ కూడా కొద్ది సేపు పాటలతో హుషారెత్తించారు. ప్రత్యేక అతిథులుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్ధా(తాజ్) అధ్యక్షుడు మస్తాన్, మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, అంజద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు కళాక్షేత్రం అధ్యక్షుడు పీ వేణుమాదవ్ మాట్లాడుతూ గత పదేళ్లలో వారు చేసిన వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు వివరించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో పసందైన విందు కూడా ఏర్పాటు చేశారు. వందలాది ప్రవాసీ తెలుగు కుటుంబాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొని సరదాగా గడిపారు.