సౌదీ అరేబియాలో జరిగి శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారై కుటుంబం మృత్యువాత పడింది. అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు(ఉమ్రా) వచ్చారు.
సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి..ప్రార్థనలు చేశారు. తిరిగి కారులో కువైట్‌కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుంచి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై డివైడర్‌ను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు.
నలుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్.. మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసి గౌస్ బాషా తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
కాగా గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ళ క్రితం వీరి కుటుంబం మదనపల్లికి ఆ తర్వాత బెంగళూరులో స్ధిరపడినట్లుగా సమాచారం. గౌస్‌బాషా కుటుంబం బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment