తన్వి సేత్ దంపతులు - సుష్మా స్వరాజ్
లక్నో, ఉత్తరప్రదేశ్ : కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ట్విటర్ వేదికగా సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఇందకు నిదర్శనంగా లక్నోలో మరో సంఘటన జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా ఓ జంటకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు లక్నో పాస్‌పోర్ట్ అధికారులు. అంతేకాక అన్య మతస్తున్ని పెళ్లి చేసుకున్నందుకు సదరు మహిళను తీవ్రంగా అవమానించారు. దాంతో తమకు సాయం చేయండంటూ ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. వీరి అభ్యర్ధనకు స్పందించిన సుష్మా స్వరాజ్ వీరికి పాస్ పోర్టు వచ్చేలా చేసారు.
వివరాల ప్రకారం...నోయిడాకు చెందిన తన్వి సేత్ అనే మహిళ ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుధవారం తన్వి కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ వికాస్ మిశ్రా అనే అధికారి తాను ముస్లింను వివాహం చేసుకున్నానే కారణంతో తనతో అవమానకరంగా ప్రవర్తించాడని తెలిపింది తన్వి. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా సుష్మా స్వరాజ్‌కు వివరించింది.
ఈ విషయం గురించి తన్వి ‘సుష్మా మేడమ్.. పాస్‌పోర్ట్ కార్యాలయంలోని అధికారులు ప్రజల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని ఓ అధికారి నన్ను అవమానించాడు. అంతేకాక మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని పేరు మార్చుకోవాలని అంటున్నాడు. అందరు చూస్తుండగానే నా మీద కేకలు వేసాడు. ఇంతటి అవమానాన్ని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. ప్రస్తుతం అతడు నా పాస్‌పోర్ట్‌తో పాటు నా భర్త పాస్‌పోర్ట్‌ను కూడా హోల్డ్‌లో పెట్టాడు.
అతని ప్రవర్తన చూసి షాకయ్యా. నాకు వివాహం అయ్యి 12 ఏళ్ల అవుతుంది. ఇప్పటికి నా సర్టిఫికెట్లలో నా పేరు తన్వీ సేత్‌గానే ఉంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు పేరు మార్చుకోవాలనే నియమం ఎక్కడ లేదు. అయినా ఏ పేరు పెట్టుకోవాలన్నది నా వ్యక్తిగత విషయం. ఇది మా కుటుంబానికి సంబంధించినది. మాకు పాస్‌పోర్ట్ వచ్చేలా సాయం చేయండి’ అని ట్వీట్ చేసింది.
దీనిపై సుష్మా స్పందించారు. ఈ కేసును పీయూష్ వర్మ అనే పాస్‌పోర్ట్ అధికారికి అప్పగించి తన్వి దంపతులకు పాస్‌పోర్ట్ వచ్చేలా చేసారు. అంతేకాక తన్వి దంపతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment