Passport officer
-
‘సుష్మా స్వరాజ్‌కు నాలుగు తగిలించండి’
సాక్షి, న్యూఢిల్లీ: లక్నోలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఉదంతం తాలూకూ ట్వీట్లు, కామెంట్లు, విమర్శల పరంపర ఆగడం లేదు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బదిలీ చేయడంతో ఆమెపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. సంఘ్‌పరివార్ కార్యకర్తలు సైతం ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. తాజాగా.. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశమైంది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. నేపథ్యం: లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టు ఆఫీసులో గత శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతుల పట్ల పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేశాడని సదరు జంట సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేయడంతో ఆమె స్పందించారు. హుటాహుటిన చర్యలు ప్రారంభించి వికాస్ మిశ్రాను గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. సిద్దిఖీ-తన్వీ జంటకు వెంటనే పాస్‌పోర్టు జారీ చేయించారు. అయితే, సిద్దిఖీ-తన్వీ సమర్పించిన డిక్లరేషన్ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాల వెరిఫికేషన్‌లో బయటపడింది. pic.twitter.com/OIwVL02uoU — Governor Swaraj (@governorswaraj) June 30, 2018 -
సంచలన నిర్ణయం.. తీవ్ర దుమారం
సాక్షి, ముంబై: శివసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహం సాకుతో ఓ జంటకు పాస్‌పోర్ట్‌లు నిరాకరించి వివాదంలో చిక్కకున్న అధికారికి సన్మానం చేయాలని తీర్మానం చేసింది. ఈ మేరకు శివసేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సదరు అధికారి వికాస్ మిశ్రా బదిలీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ శనివారం యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు ఓ మెమొరాండం సమర్పించింది. ‘వికాస్ తన విధులను తాను సక్రమంగా నిర్వహించారు. పాస్‌పోర్ట్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశం. యూపీ ప్రభుత్వం ముస్లింల సానుభూతి కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవటం సహేతుకం కాదు. అందుకే గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాదు వికాస్‌ను ఘనంగా సన్మానించాలని శివసేన నిర్ణయించింది’ అని ఆ పార్టీ ప్రతినిధుల బృందం మీడియాకు తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. పలువురు బీజేపీ నేతలు శివసేనపై విరుచుకుపడుతున్నారు. మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ 2007లో తన్వీ సేథ్ అనే హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగులు. తాజాగా వీరిద్దరూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రా మాత్రం వారి దరఖాస్తులను తిరస్కరించాడు. పైగా మతం మార్చుకోవాలంటూ సిద్ధిఖీకి సూచనలు చేశాడు. దీంతో వారు సుష్మాస్వరాజ్‌ను ఆశ్రయించగా, విదేశాంగ శాఖ చొరవతో వారికి పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. మరోపక్క క్రమశిక్షణ చర్యల కింద పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రాను లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు బదిలీ చేశారు. -
సుష్మపై ట్వీట్.. వ్యక్తిగతమన్న ఆరెస్సెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహం చేసుకున్న జంటను మాటలతో వేధించారనే కారణంగా లక్నో పాస్‌పోర్టు ఆఫీసర్ వికాస్ మిశ్రాను బదిలీ చేయడాన్ని ఆరెస్సెస్ ఢిల్లీ ప్రచార ప్రముఖ్ రాజీవ్ తులి తప్పుపట్టారు. ‘వికాస్ మిశ్రాకు న్యాయం చేయాలి. అసలైన బాధితుల ఎవరో తెలుసుకోవాలి. సుష్మా స్వరాజ్ మీరు కూడా చట్టానికేం అతీతులు కారు. ఈ వివాదంలో అధికారి మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే రాజీవ్ ట్వీట్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో తన వ్యాఖ్యలతో సంఘ్‌కు ఎటువంటి సంబంధం లేదని.. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే... జాతీయ మీడియా కథనం ప్రకారం... లక్నోకు చెందిన మహ్మద్ అనాస్ సిద్ధిఖీ, తన్వీ సేథ్ దంపతులు జూన్ 19న పాస్‌పోర్టు కోసం అప్లై చేయగా.. జూన్20న వారికి లక్నో పాస్‌పోర్టు ఆఫీసులో అపాయింట్మెంట్ లభించింది. అందులో భాగంగా కౌంటర్ ఏ, బీల్లో జరిగిన ఇంటర్వ్యూను పూర్తి చేశారు. తర్వాత తన్వీ సేథ్ కౌంటర్ సీ వద్దకు వచ్చింది. ఆమె తన భర్త పేరు చెప్పగానే పాస్‌పోర్టు అధికారి వికాస్ మిశ్రా.. ‘అసలు ఏంటిది’ అంటూ ఆమెపై పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ‘ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ’ ఆమెను దూషించారు. భర్త పేరు మార్చిన తర్వాత మరోసారి ఇక్కడికి రావాలంటూ తన్వీని హెచ్చరించారు. మిశ్రా వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతమైన తన్వీ భర్తకు విషయం చెప్పింది. ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ సిద్ధిఖీ మిశ్రాను ప్రశ్నించగా.. ‘నువ్వు హిందువుగా మారితేనే మీ వివాహం చెల్లుబాటు అవుతుందని.. అయినా హిందూ అమ్మాయిల్ని పెళ్లి పేరుతో ముస్లిం మతంలోకి మారుస్తున్నారుగా. మరి మీరు మారితే తప్పేంటని’ ఆయన సిద్ధిఖీపై విరుచుకుపడ్డారు. దీనిపై సుష్మా స్వరాజ్‌కు ట్విటర్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆమె వెంటనే స్పందించి వారికి పాస్‌పోర్ట్ మంజూరు చేయించారు. మిశ్రా ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ అధికారులు ఆయనను వేరే చోటికి బదిలీ చేశారు. కాగా 2007లో సిద్ధిఖీ, తన్వీ సేథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు నోయిడాలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. विकास मिश्रा को न्याय मिलने चाहिए। विक्टिम कार्ड और ऊपर तक पहुंच इससे इतर भी दुनिया है। @SushmaSwaraj आप काननों से ऊपर नहीं हैं। आशा है आप अपने इस अधिकारी की बात भी सुनेंगी। और पूरे मामले की जांच होगी https://t.co/cFaCSaoNY0 — rajiv tuli (@rajivtuli69) June 22, 2018 -
ట్విటర్ వేదికగా సాయం చేసిన మంత్రి
లక్నో, ఉత్తరప్రదేశ్ : కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ట్విటర్ వేదికగా సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఇందకు నిదర్శనంగా లక్నోలో మరో సంఘటన జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా ఓ జంటకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు లక్నో పాస్‌పోర్ట్ అధికారులు. అంతేకాక అన్య మతస్తున్ని పెళ్లి చేసుకున్నందుకు సదరు మహిళను తీవ్రంగా అవమానించారు. దాంతో తమకు సాయం చేయండంటూ ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. వీరి అభ్యర్ధనకు స్పందించిన సుష్మా స్వరాజ్ వీరికి పాస్ పోర్టు వచ్చేలా చేసారు. వివరాల ప్రకారం...నోయిడాకు చెందిన తన్వి సేత్ అనే మహిళ ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుధవారం తన్వి కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ వికాస్ మిశ్రా అనే అధికారి తాను ముస్లింను వివాహం చేసుకున్నానే కారణంతో తనతో అవమానకరంగా ప్రవర్తించాడని తెలిపింది తన్వి. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా సుష్మా స్వరాజ్‌కు వివరించింది. ఈ విషయం గురించి తన్వి ‘సుష్మా మేడమ్.. పాస్‌పోర్ట్ కార్యాలయంలోని అధికారులు ప్రజల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని ఓ అధికారి నన్ను అవమానించాడు. అంతేకాక మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని పేరు మార్చుకోవాలని అంటున్నాడు. అందరు చూస్తుండగానే నా మీద కేకలు వేసాడు. ఇంతటి అవమానాన్ని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. ప్రస్తుతం అతడు నా పాస్‌పోర్ట్‌తో పాటు నా భర్త పాస్‌పోర్ట్‌ను కూడా హోల్డ్‌లో పెట్టాడు. అతని ప్రవర్తన చూసి షాకయ్యా. నాకు వివాహం అయ్యి 12 ఏళ్ల అవుతుంది. ఇప్పటికి నా సర్టిఫికెట్లలో నా పేరు తన్వీ సేత్గానే ఉంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు పేరు మార్చుకోవాలనే నియమం ఎక్కడ లేదు. అయినా ఏ పేరు పెట్టుకోవాలన్నది నా వ్యక్తిగత విషయం. ఇది మా కుటుంబానికి సంబంధించినది. మాకు పాస్‌పోర్ట్ వచ్చేలా సాయం చేయండి’ అని ట్వీట్ చేసింది. దీనిపై సుష్మా స్పందించారు. ఈ కేసును పీయూష్ వర్మ అనే పాస్‌పోర్ట్ అధికారికి అప్పగించి తన్వి దంపతులకు పాస్‌పోర్ట్ వచ్చేలా చేసారు. అంతేకాక తన్వి దంపతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేశారు. -
హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి
ప్రస్తుత అధికారి అశ్వని సత్తారు ఢిల్లీకి బదిలీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రెండో డాక్టరుగా ఈయన గుర్తింపు పొందారు. గతంలో డాక్టర్ శ్రీకర్‌రెడ్డి పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న అశ్వని సత్తారును ఢిల్లీకి బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన డా.విష్ణువర్ధన్‌రెడ్డి నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ఈయన 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఈయన ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖలో ఎక్స్టర్నల్ పబ్లిసిటీ సెల్లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లో పనిచేసే పీఎంఐ (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా)లో మానవహక్కుల విభాగంలో సెక్రటరీగా పనిచేశారు. నెల కిందటే ఆయన హైదరాబాద్ సచివాలయంలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఈయన వరంగల్ జిల్లా కు చెందినవారని పాస్‌పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. -
సామాన్యునికి - పాస్‌పోర్టుకు పటిష్టమైన వారధి వేస్తా!
సి.బి. ముత్తమ్మ... మనదేశంలో మొదటి మహిళా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్). ఆమె 1949లో ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరోసారి వచ్చింది. ఆ అవసరాన్ని కల్పించిన మహిళ అశ్విని సత్తారు. అశ్విని కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఒక తొలి రికార్డును కూడా సాధించారు. ఇప్పుడు ఆమె హైదరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసులో రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్. అంతేకాదు... పాస్‌పోర్టు ఆఫీస్ చరిత్రలో తొలి మహిళా అధికారి. సామాన్యులకు పాస్‌పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తన తొలి అజెండా అంటున్న అశ్విని సత్తారుతో ముఖాముఖి. మీరు మీడియాకు దూరంగా ఉంటారనుకుంటాను. అపాయింట్మెంట్ చాలా కష్టమైంది... అశ్విని: నిజమే. పెద్దగా ఇష్టపడను. ఏ బ్యాచ్‌లో ఐఎఫ్ఎస్లోకి వచ్చారు? అశ్విని: 2008 బ్యాచ్. నాన్న ఐపిఎస్, మీరు ఐఎఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. కానీ ఐఎఫ్ఎస్ను ఎంచుకోవడంలో కారణం ఉందా? అశ్విని: డిప్లమాట్ అవుదామనే ఐఎఫ్ఎస్ని ఎంచుకున్నాను. ఇండియా చాలా గొప్ప దేశం. ఈ దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి. మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరు? అశ్విని: ఒకరు ప్రభావితం చేయడం అనడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ పట్ల ఆసక్తి ఉండేది. నాన్నగారు ఈ రంగంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. కాలేజ్కొచ్చే సరికి అది ఐఎఫ్ఎస్ అని స్పష్టంగా నిర్ణయించుకున్నాను. మీ వికాసంలో అమ్మానాన్నల్లో ఎవరి పాత్ర ఎక్కువ? అశ్విని: నాకు తెలిసినంత వరకు పిల్లల వికాసంలో అమ్మపాత్ర, నాన్న పాత్ర అని విడదీసి చూడలేం. అమ్మానాన్న ఇద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ పిల్లల్ని నడిపిస్తుంది, నడవనిస్తుంది. మా అమ్మానాన్నలు నన్ను, మా అన్నయ్యను ఇద్దరినీ నడవనిచ్చారు. మాకు ఇష్టమైన రంగాల్లోకి రావడానికి తగినంత ప్రోత్సాహం ఇచ్చారు. అన్నయ్య జాన్సన్ అండ్ జాన్సన్స్లో సౌత్ ఇండియా హెడ్. మీ బాల్యం ఎక్కడ గడిచింది? అశ్విని: మొత్తం హైదరాబాద్‌లోనే. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయలో చదివాను. ఉస్మానియా యూనివర్శిటీలో బి.టెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీకి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్? అశ్విని: గ్లోబలైజేషన్ కారణంగా దేశాలన్నీ దాదాపుగా ఒకే రూపు సంతరించుకున్నాయి. రెండు - మూడ దశాబ్దాల కిందట అయితే ఎవరైనా యుఎస్ నుంచి వస్తుంటే అక్కడి విశేషాలను తెలుసుకోవడం కోసం బంధువులు, స్నేహితులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. నేను వెళ్లినప్పటికి అలా కొత్త భావన కలిగే పరిస్థితి లేదు. సివిల్స్ ప్రిపరేషన్లో జర్మన్ లాంగ్వేజ్ తీసుకున్నాను. కాబట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకపోయింది. ఐఎఫ్ఎస్ అధికారిగా జర్మనీలో మీ అనుభవాలు? అశ్విని: ఐఎఫ్ఎస్గా నా మొదటి పోస్టింగ్ జర్మనీలోనే. 2010వ సంవత్సరం జూలై నుంచి 2013 వరకు బెర్లిన్‌లోని భారత రాయభార కార్యాలయంలో పని చేశాను. మనదేశానికి- జర్మనీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను అక్కడ ఉన్న సమయంలోనే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దఫాలు జర్మనీలో పర్యటించారు. మనదేశానికి సాంకేతిక సహాయకారి జర్మనీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జర్మనీ ముద్ర మన దేశం మీద చాలా ఎక్కువ. మనం ఉపయోగించే ఎస్కలేటర్, లిఫ్ట్, కార్లు, పెద్ద మెషీన్లు... ఇలా అనేకం జర్మనీ తయారు చేసినవే. జర్మనీ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే అని చెప్పాలి. జర్మనీ నుంచి మనదేశం నేర్చుకోవాల్సింది... అశ్విని: చాలా ఉంది. వారిలో జాతీయభావన మెండు. ఉద్యోగం కూడా దేశం అభ్యున్నతి కోసమే అన్నట్లు చేస్తారు. పని కచ్చితంగా చేయడం ద్వారా దేశాభివృద్ధిలో తమ పాత్రను నిర్వహిస్తున్నాం అని సంతోషిస్తారు. మేధాసంపత్తిలో భారతీయులు చాలా తెలివైన వాళ్లు. వర్క్ కల్చర్, క్రమశిక్షణ, జాతీయత భావాన్ని పెంచుకుంటే మనదేశం త్వరగా అభివృద్ధి చెందుతుందనిపించింది. పాస్‌పోర్టు వ్యవహారాల విషయానికి వస్తే... తొలి మహిళా అధికారిగా ఎలా ఫీలవుతున్నారు? అశ్విని: ప్రొఫెషన్‌కి స్త్రీ, పురుషులనే తేడాలుండవు. అయితే ఒక విషయాన్ని మహిళలు స్వీకరించే విధానం కొంత భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా పరిమితమైన సందర్భాల్లోనే. నాకు తేడా ఏమీ కనిపించలేదు. ఇంతకంటే కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫారిన్ అఫైర్సన్ సెక్రటరీ సుజాతాసింగ్లాంటి ఎందరినో చూస్తున్నాం కదా! పాస్‌పోర్టు అధికారిగా ఫస్ట్ ఉమన్‌గా రికార్డు మీదే. మరి ఫస్ట్తోపాటు బెస్ట్ రికార్డు కూడా మీ ఖాతాలో చేరాలంటే... అశ్విని: నాకు ముందు ఈ బాధ్యత నిర్వర్తించిన శ్రీకర్ రెడ్డి గారు చాలామంచి సిస్టమ్‌ను రూపొందించారు. అప్పుడు నేను డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్ని. ఇప్పుడూ ఆయన బాటలోనే పని చేస్తున్నాను. పాస్‌పోర్టు సేవల పట్ల ప్రజల్లో ఇంతకు ముందుకంటే ఇప్పుడు నమ్మకం పెరిగింది. అప్లయ్ చేస్తే పాస్‌పోర్టు వస్తుందనే భరోసా కలిగింది. మా సేవల్లో ప్రతి అంశాన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రమంగా అదే ‘బెస్ట్ సర్వీస్’ రికార్డును తెస్తుంది. పాస్‌పోర్టు ఏజెంట్ సిస్టమ్ తొలగిపోవాలంటే... అశ్విని: పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు చాలా వరకు పారదర్శకంగా మారింది. ఎవరికి వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం కొంతయినా ఉండాలి. నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సౌకర్యం కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ట్రాన్స్పరెంట్ సిస్టమ్‌లో ఏజెంట్ అవసరమే లేకుండా పాస్‌పోర్టును అందుకోవచ్చు. తప్పదనుకుంటే సేవాకేంద్రాల సహాయం తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క పౌరునికీ తప్పని సరా? అశ్విని: పాస్‌పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. సిటిజన్‌షిప్ డాక్యుమెంట్ కాదు. తప్పని సరి కాదు. పాస్‌పోర్టు సమగ్రమైన డాక్యుమెంట్ కదా? అశ్విని: పాస్‌పోర్టు... ప్రభుత్వం ఇచ్చిన అనేక ధృవపత్రాల ఆధారంగా జారీ అయి ఉంటుంది. కాబట్టి ఓ భరోసా. రోజూ పాస్‌పోర్టు కోసం వచ్చే దరఖాస్తులు, జారీ చేస్తున్న పాస్‌పోర్టుల నిష్పత్తి సమంగా ఉంటోందా? అశ్విని: బేగంపేటలో రోజుకు 800 వస్తున్నాయి. రోజుకు వెయ్యి పాస్‌పోర్టులు జారీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఆఫీసు ఇది. అన్ని డాక్యుమెంట్లూ సరిగ్గా ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. తత్కాల్ అయితే 48 గంటల లోపు జారీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామీణుల కోసం అవగాహన సదస్సుల వంటివి... అశ్విని: గ్రామీణులలో పాస్‌పోర్టు పట్ల చైతన్యం తీసుకురావడం నా ప్రధానమైన అజెండా. విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌కి శిక్షణ ఇవ్వబోతున్నాం. పాస్‌పోర్టు సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. నకిలీ పాస్‌పోర్టును అడ్డుకోవడం ఎలా? అశ్విని: ఒకప్పుడు చేత్తో రాసేవారు. ఇప్పుడు అన్నీ మెషీన్ రీడ్ పాస్‌పోర్టులే, బయో మెట్రిక్ సిస్టమ్‌లో నకిలీకి ఆస్కారం ఉండదు. తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టు కోసం వస్తే? అశ్విని: మాకు చర్య తీసుకునే అధికారం ఉండదు. మేము పాస్‌పోర్టు జారీ చేయడానికి అనేక డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంటాం. ఆ డాక్యుమెంట్లో ఉన్న సమాచారం నకిలీ అని నాకు వ్యక్తిగతంగా తెలిసినా సంబంధిత అధికార విభాగం జారీ చేసిన డాక్యుమెంట్‌ని నేను గౌరవించాల్సిందే. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారికి మీరు ఈ డాక్యుమెంట్‌ను మరోసారి సరి చేసుకోగలరు అని సూచించగలం. దేశంలోపల ఉద్యోగం, దేశం వెలుపల ఉద్యోగంలో తేడా? అశ్విని: పౌరులకు నేరుగా సేవ అందిస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తున్న విభాగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. దేశం బయటకు వెళ్లినప్పుడు ‘నేను నా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక బాధ్యత. జాబ్ సాటిస్ఫాక్షన్ పొందిన సందర్భం? అశ్విని: గత ఏడాది డిప్యూటీ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయి పాస్‌పోర్టు విషయంలో నేను గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన ఉద్యోగం అనిపించిన సందర్భం ? అశ్విని: పబ్లిక్ సర్వీస్‌లో చాలెంజెస్ ఉంటాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మొదటి రోజునే అనుకున్నాను. అయితే కష్టం అనిపించిన సందర్భం ఇంత వరకూ రాలేదు. కుటుంబ వివరాలు... హాబీలు... అశ్విని: నేను సింగిల్. నా హాబీ క్రమశిక్షణతో పని చేయడమే. చివరగా పౌరులకు ఓ సూచన! అశ్విని: పాస్‌పోర్టు జారీ చేసే పనిని మా స్టాఫ్ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతగా చేయట్లేదు. మన పౌరులకు చేస్తున్న సేవ అనే ధోరణితో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. దీనిని కొనసాగిస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తాం. - వాకా మంజులారెడ్డి సామాన్యులకు మీరిచ్చే సూచన? అశ్విని: ఏజెంట్లు ‘‘నేను చిటికెలో ఇప్పిస్తాను’’ అన్నట్లు చెబుతుంటారు. ఆ మాటలను నమ్మవద్దు. మీరే స్వయంగా పాస్‌పోర్టు ఆఫీసు లోపలికి రండి. ముఖ్యంగా విదేశీ విద్యావకాశాలు పెరిగిన ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదో అత్యవసరం ఏర్పడుతుంది. ఆ సమయానికి పాస్‌పోర్టు సిద్ధమవుతుందా లేదా అనే అయోమయంలో ఏజెంట్లను ఆశ్రయిస్తారు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే - దయచేసి ఉదయం 9.30-11.30 మధ్య మా బ్యాక్ ఆఫీస్‌కి రండి. అన్ని వివరాలనూ తెలుసుకోండి. ఇప్పుడు సిస్టమ్ చాలా పారదర్శకంగా ఉంది. అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే మూడు రోజుల్లో పాస్‌పోర్టు జారీ అవుతుంది. -
పాస్‌పోర్టులో జనన తేదీ మార్పుపై కొత్త మార్గదర్శకాలు
పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఒకసారి పాస్‌పోర్ట్ పొంది రెండోసారి ఆ పాస్‌పోర్ట్‌లో జనన ధృవీకరణ తేదీని మార్చుకునేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డా.శ్రీకర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదువుకోని వారు లేదా ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారు చాలా మంది గతంలో అఫిడవిట్లు పొందుపరిచి పాస్‌పోర్ట్‌లు పొందారు. అయితే, ఎస్ఎస్సీ లేకుండా పాస్‌పోర్ట్‌లు పొందితే కొన్ని దేశాలు అనుమతించవు. దీంతో కొంతమంది తిరిగి ధృవీకరణ పత్రాలు తెచ్చుకొని ఒరిజనల్ జనన ధృవీకరణతో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, పాత పాస్‌పోర్ట్‌లోని జనన తేదీకి, ఒరిజనల్ జనన తేదీకి మధ్య ఏడాది తేడా ఉంటే పాస్‌పోర్ట్ కార్యాలయంలోనే ధృవీకరణల పరిశీలన చేస్తారు. ఏడాదికి మించి తేడా ఉంటే హైకోర్టుకు వెళ్లి తెచ్చుకునేవారు. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై హైకోర్టుకు వెళ్లనవసరం లేదని, పాస్‌పోర్ట్ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన చేసి, అధికారులు సూచించిన మేరకు మొదటి శ్రేణి న్యాయమూర్తి (ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) నుంచి అనుమతి తెచ్చుకుంటే సరిపోతుందని పాస్‌పోర్ట్ అధికారి పేర్కొన్నారు.