పాస్‌పోర్టులో జనన తేదీ మార్పుపై కొత్త మార్గదర్శకాలు
పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఒకసారి పాస్‌పోర్ట్ పొంది రెండోసారి ఆ పాస్‌పోర్ట్‌లో జనన ధృవీకరణ తేదీని మార్చుకునేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డా.శ్రీకర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదువుకోని వారు లేదా ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారు చాలా మంది గతంలో అఫిడవిట్లు పొందుపరిచి పాస్‌పోర్ట్‌లు పొందారు. అయితే, ఎస్‌ఎస్‌సీ లేకుండా పాస్‌పోర్ట్‌లు పొందితే కొన్ని దేశాలు అనుమతించవు.
దీంతో కొంతమంది తిరిగి ధృవీకరణ పత్రాలు తెచ్చుకొని ఒరిజనల్ జనన ధృవీకరణతో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే, పాత పాస్‌పోర్ట్‌లోని జనన తేదీకి, ఒరిజనల్ జనన తేదీకి మధ్య ఏడాది తేడా ఉంటే పాస్‌పోర్ట్ కార్యాలయంలోనే ధృవీకరణల పరిశీలన చేస్తారు. ఏడాదికి మించి తేడా ఉంటే హైకోర్టుకు వెళ్లి తెచ్చుకునేవారు. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై హైకోర్టుకు వెళ్లనవసరం లేదని, పాస్‌పోర్ట్ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన చేసి, అధికారులు సూచించిన మేరకు మొదటి శ్రేణి న్యాయమూర్తి (ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) నుంచి అనుమతి తెచ్చుకుంటే సరిపోతుందని పాస్‌పోర్ట్ అధికారి పేర్కొన్నారు.