కరోనా ప్రభావం విదేశీ ప్రయాణాలపై పడుతుందని వేసిన అంచనా.. ఘోరంగా తప్పింది. ట్రావెల్ బ్యాన్‌లు ఎత్తేయడం, పలు దేశాలు నిబంధనల సరళీకరణ గేట్లు తెరవడంతో.. మళ్లీ విదేశీయానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగ్గా.. అందులో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోవడం, మంజూరు కావడం గమనార్హం.
దేశంలో లాక్‌డౌన్ శకం ముగిశాక.. అంటే జూన్ 1, 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 దాకా భారత దేశంలో మంజూరు అయిన పాస్‌పోర్టుల సంఖ్య వివిధ రాష్ట్రాల లిస్ట్‌ను పరిశీలిస్తే.. అత్యధిక పాస్‌పోర్టుల మంజూరుతో మొదటి స్థానంతో పాటు మొత్తం దక్షిణ భారత దేశ రాష్ట్రాలు టాప్ టెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
ఈ జాబితాలో కేరళకు అత్యధికంగా పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి. 23,69,727 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఆ రాష్ట్రం నుంచి వలసలు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. ఇక.. అత్యల్పంగా లక్షద్వీప్‌కు 3,086 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి.
ఇక అత్యధిక పాస్‌పోర్టులు జారీ అయిన రాష్ట్రాల్లో కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(19,96,829) నిలిచింది. ఆపై వరుసగా ఉత్తర ప్రదేశ్(17, 40,522), తమిళనాడు(16,69,807) ఉన్నాయి. లిస్ట్‌లో నెక్ట్స్ పంజాబ్(15,13,519), గుజరాత్(12,19,914) అత్యధికంగా పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి.
ఇక ఈ లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉన్న కర్ణాటకకు 11,29,758 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఆ తర్వాతి ప్లేస్‌లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. తెలంగాణకు 10,22,887 పాస్‌పోర్టులు, ఏపీలో 7,99,713 పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలు మధ్యలో వెస్ట్ బెంగాల్ 8,75,915 పాస్‌పోర్టులతో జాబితాలో నిలిచింది. మొత్తంగా పాస్‌పోర్టులకు దక్షిణ భారత దేశంలో ఎంత డిమాండ్ ఉందన్నది ఈ గణాంకాలు మరోసారి తేటతెల్లం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment