హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి
ప్రస్తుత అధికారి అశ్వని సత్తారు ఢిల్లీకి బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రెండో డాక్టరుగా ఈయన గుర్తింపు పొందారు. గతంలో డాక్టర్ శ్రీకర్‌రెడ్డి పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న అశ్వని సత్తారును ఢిల్లీకి బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన డా.విష్ణువర్ధన్‌రెడ్డి నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ఈయన 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఈయన ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖలో ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ సెల్‌లో అండర్ సెక్రటరీగా పనిచేశారు.
జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లో పనిచేసే పీఎంఐ (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా)లో మానవహక్కుల విభాగంలో సెక్రటరీగా పనిచేశారు. నెల కిందటే ఆయన హైదరాబాద్ సచివాలయంలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఈయన వరంగల్ జిల్లా కు చెందినవారని పాస్‌పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి.