సుష్మపై ట్వీట్‌.. వ్యక్తిగతమన్న ఆరెస్సెస్‌ నేత | RSS Leader Seeks Justice For Passport Officer Accused of Harassing Couple In Lucknow | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 22 2018 6:22 PM | Last Updated on Fri, Jun 22 2018 7:33 PM

RSS Leader Seeks Justice For Passport Officer Accused of Harassing Couple In Lucknow - Sakshi

సిద్ధిఖీ- తన్వీ సేథ్‌

సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహం చేసుకున్న జంటను మాటలతో వేధించారనే కారణంగా లక్నో పాస్‌పోర్టు ఆఫీసర్‌ వికాస్‌ మిశ్రాను బదిలీ చేయడాన్ని ఆరెస్సెస్‌ ఢిల్లీ ప్రచార ప్రముఖ్‌ రాజీవ్‌ తులి తప్పుపట్టారు. ‘వికాస్‌ మిశ్రాకు న్యాయం చేయాలి. అసలైన బాధితుల ఎవరో తెలుసుకోవాలి. సుష్మా స్వరాజ్‌ మీరు కూడా చట్టానికేం అతీతులు కారు. ఈ వివాదంలో అధికారి మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్‌‌ చేశారు. అయితే రాజీవ్‌ ట్వీట్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో తన వ్యాఖ్యలతో సంఘ్‌కు ఎటువంటి సంబంధం లేదని.. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...
జాతీయ మీడియా కథనం ప్రకారం... లక్నోకు చెందిన మహ్మద్‌ అనాస్‌ సిద్ధిఖీ, తన్వీ సేథ్‌ దంపతులు జూన్‌ 19న పాస్‌పోర్టు కోసం అప్లై చేయగా.. జూన్‌20న వారికి లక్నో పాస్‌పోర్టు ఆఫీసులో అపాయింట్‌మెంట్‌ లభించింది. అందులో భాగంగా కౌంటర్‌ ఏ, బీల్లో జరిగిన ఇంటర్వ్యూను పూర్తి చేశారు. తర్వాత తన్వీ సేథ్‌ కౌంటర్‌ సీ వద్దకు వచ్చింది. ఆమె తన భర్త పేరు చెప్పగానే పాస్‌పోర్టు అధికారి వికాస్‌ మిశ్రా.. ‘అసలు ఏంటిది’ అంటూ ఆమెపై పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ‘ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ’ ఆమెను దూషించారు. భర్త పేరు మార్చిన తర్వాత మరోసారి ఇక్కడికి రావాలంటూ తన్వీని హెచ్చరించారు.

మిశ్రా వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతమైన తన్వీ భర్తకు విషయం చెప్పింది. ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ సిద్ధిఖీ మిశ్రాను ప్రశ్నించగా.. ‘నువ్వు హిందువుగా మారితేనే మీ వివాహం చెల్లుబాటు అవుతుందని.. అయినా హిందూ అమ్మాయిల్ని పెళ్లి పేరుతో ముస్లిం మతంలోకి మారుస్తున్నారుగా. మరి మీరు మారితే తప్పేంటని’ ఆయన సిద్ధిఖీపై విరుచుకుపడ్డారు. దీనిపై సుష్మా స్వరాజ్‌కు ట్విటర్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆమె వెంటనే స్పందించి వారికి పాస్‌పోర్ట్‌ మంజూరు చేయించారు. మిశ్రా ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ అధికారులు ఆయనను వేరే చోటికి బదిలీ చేశారు. కాగా 2007లో సిద్ధిఖీ, తన్వీ సేథ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు నోయిడాలోని ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement