వికాస్ మిశ్రా, సిద్ధిఖీ-తన్వీ సేథ్ దంపతులు
సాక్షి, ముంబై: శివసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహం సాకుతో ఓ జంటకు పాస్‌పోర్ట్‌లు నిరాకరించి వివాదంలో చిక్కకున్న అధికారికి సన్మానం చేయాలని తీర్మానం చేసింది. ఈ మేరకు శివసేన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సదరు అధికారి వికాస్ మిశ్రా బదిలీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ శనివారం యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు ఓ మెమొరాండం సమర్పించింది. ‘వికాస్ తన విధులను తాను సక్రమంగా నిర్వహించారు. పాస్‌పోర్ట్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిన అంశం. యూపీ ప్రభుత్వం ముస్లింల సానుభూతి కోసం తీవ్రంగా యత్నిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవటం సహేతుకం కాదు. అందుకే గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాదు వికాస్‌ను ఘనంగా సన్మానించాలని శివసేన నిర్ణయించింది’ అని ఆ పార్టీ ప్రతినిధుల బృందం మీడియాకు తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. పలువురు బీజేపీ నేతలు శివసేనపై విరుచుకుపడుతున్నారు.
మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ 2007లో తన్వీ సేథ్ అనే హిందూ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగులు. తాజాగా వీరిద్దరూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రా మాత్రం వారి దరఖాస్తులను తిరస్కరించాడు. పైగా మతం మార్చుకోవాలంటూ సిద్ధిఖీకి సూచనలు చేశాడు. దీంతో వారు సుష్మాస్వరాజ్‌ను ఆశ్రయించగా, విదేశాంగ శాఖ చొరవతో వారికి పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. మరోపక్క క్రమశిక్షణ చర్యల కింద పాస్‌పోర్ట్ ఆఫీసర్ వికాశ్ మిశ్రాను లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment